టిక్‌టాక్‌ ఎడబాటు..ఫేస్‌బుక్‌ డిప్రెషన్‌ | Some pepoles Are Died for Social Meadia Deprestion | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ ఎడబాటు స్మ్యూల్‌ ఆత్మహత్య ఫేస్‌బుక్‌ డిప్రెషన్‌

Published Mon, Sep 30 2019 12:59 AM | Last Updated on Mon, Sep 30 2019 10:26 AM

Some pepoles Are Died for Social Meadia Deprestion - Sakshi

పిల్లలు చదువుకుంటుంటారనీ,భర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని, గృహిణులు ఇల్లు చక్కదిద్దుకుంటూ ఉంటారనీ అనుకునే రోజులు పోయాయా? ఒక్కళ్లే ఉంటూ కూడా వారు చేతిలో ఉన్న ఫోన్‌తో ఒక పెద్ద ప్రపంచంతో కనెక్ట్‌ అవుతున్నారు. ఆ పెద్ద ప్రపంచం వారికి మేలు చేస్తోందా కీడు చేస్తోందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రమాదకరమైన పరిణామం.

అనగనగా ఒక అమ్మాయి. అబ్బాయి. ఇద్దరూ ఒకరికొకరు తెలియదు. కానీ సోషల్‌ మీడియా ద్వారా ఫ్రెండ్స్‌ అయ్యారు. ఇద్దరూ టిక్‌టాక్‌ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆ జంటకు మంచి పేరు వచ్చింది. ఫాలోయెర్స్‌ పెరిగారు. ఆ అమ్మాయి ఈ టిక్‌టాక్‌లు మానేసి వేరే కెరీర్‌లోకి వెళదామనుకుంది. కానీ ఆ అబ్బాయికి ఇది నచ్చలేదు. కుదర్దు మనం చేయాల్సిందే అన్నాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. అంతే కాదు.. సోషల్‌ మీడియాలో వారి స్నేహాన్ని చర్చలో పెట్టాడు. ఫాలోయెర్స్‌ దీని మీద తీర్పరులుగా మారారు. రకరకాల కామెంట్స్‌. ఇద్దరికీ మనశ్శాంతి లేదు. గతంలో కాలేజీ ఫీజులు లేవు... మంచి బట్టలు లేవు... సినిమాకు డబ్బులు లేవు... ఇవి యువతీయువకులకు సమస్యలుగా ఉండేవి. ఇప్పుడు టిక్‌టాక్‌ జోడితో స్నేహం పోయింది అనేది పెద్ద సమస్యగా మారింది.స్మ్యూల్‌ అనేది ఒక సింగింగ్‌ యాప్‌. పాటల సంగీతం అలాగే ఉంచి మన గొంతుతో పాడే వీలు కల్పిస్తుంది.

తాజాగా నిన్న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఈ యాప్‌ ఒక గృహిణి ఆత్మహత్యకు కారణమైంది. చిక్‌బళ్లాపూర్‌కు చెందిన 35 ఏళ్ల గృహిణి ఇద్దరు పిల్లల తల్లి. భర్త వృత్తిరీత్యా ప్లంబర్‌. ఒక మోస్తరు గొంతు ఉన్న ఆమె స్మ్యూల్‌ ద్వారా పాటలు పాడి అప్‌లోడ్‌ చేసేది. ఇలాగే పాటలు పాడి అప్‌లోడ్‌ చేసే మరో గాయకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఫేస్‌బుక్‌ ద్వారా ఫోన్‌ నంబర్లు ఎక్స్‌ఛేంజ్‌ చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి రకరకాల డ్యూయెట్లు పాడి అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ జంటకు 18 వేల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. అయితే ఇటీవల కొంతమంది ఫాలోయెర్స్‌ ఈ జంట మీద కామెంట్లు ఏవో పెట్టారట. దాంతో ఆ సహపాటగాడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం గురించి ఆమె అతనితో పోట్లాడింది. అయినా సరే ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం (సెప్టెంబర్‌ 28) ఆత్మహత్యకు పాల్పడింది. గృహహింస, వివాహేతర సంబంధాలు కాకుండా కేవలం సోషల్‌ మీడియా స్నేహాలు విఫలం అవడం కూడా ప్రాణాలు తీయగలవని నిరూపించే సంఘటన ఇది.

ఇటీవల ఫేస్‌బుక్‌ నుంచి విరమించుకునేవారు పెరిగారు. దానికి కారణం ఏదైనా పోస్ట్‌కు ఎదురవుతున్న పరుషమైన కామెంట్లు. లైకులు పెట్టకపోవడం గురించి, వేరే వారికి పెట్టడం గురించి, మన మీద ఎవరో పెట్టిన విమర్శకు మన స్నేహితులు లైక్‌ కొట్టడం గురించి, చెప్పా పెట్టకుండా మనల్ని అన్‌ఫ్రెండ్‌ చేయడం గురించి ఫేస్‌బుక్‌లో ఉన్నవారికి తీవ్రమైన వ్యాకులత ఎదురవుతోంది. రెగ్యులర్‌గా లైక్‌ కొట్టేవారు రెండు మూడు పోస్ట్‌లకు లైక్‌ కొట్టలేదంటే పనులన్నీ మాని ఇక వారి గురించి ఆలోచన చేయడం మొదలెడుతున్నారు. బయటి సమాజంలో పరువు, మర్యాదల గురించి ఒక స్థితి ఉంటే ఫేస్‌బుక్‌లో నిర్మితమయ్యే పరువు, మర్యాదల స్థితి మరొకటి ఉంటుంది. ఫేస్‌బుక్‌లో ఎవరు ఎవరినైనా బద్‌నామ్‌ చేయొచ్చు. ఇదంతా అవసరమా అని ఫేస్‌బుక్‌ నుంచి పారిపోతున్నవారు ఉన్నారు. ఇటీవల తెలంగాణలో ఫేస్‌బుక్‌ ద్వారా ఫ్రెండ్‌ అయిన కుర్రాడు ఒక అమ్మాయిని హత్య చేయడం ఈ మీడియా వల్ల కలిగే ప్రమాదాన్ని పతాకస్థాయిలో నిలబెట్టింది.

ఇరుగుపొరుగు వారికి ముఖాలు చూస్తూ మాట్లాడతాం. రచ్చబండ దగ్గర, టీసెంటర్‌ దగ్గర ముఖాలు చూస్తూ వాదనలు పెట్టుకుంటాం. చర్చలు చేస్తాం. నలుగురూ సమక్షంలో ఉంటారు. పరిస్థితి చేయి దాటకుండా ఒక రక్షణ ఉంటుంది. కానీ సోషల్‌ మీడియాలో ఇలా కాదు. అనేవాడు ఎక్కడో ఉంటాడు. పడేవాళ్లు ఎక్కడో ఉంటారు. ఎప్పుడూ కలవకుండా తీవ్రమైన స్నేహితులుగా తీవ్రమైన మిత్రులుగా మారిపోయే పరిస్థితిని ఈ మీడియా కల్పిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఒకరు ఒకరిని ఏమైనా అంటే అందులోని వాలిడ్‌ పాయింట్‌ని పట్టించుకోకుండా గ్రూప్‌ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, జెండర్‌ని బట్టి కొంతమంది ఏకమై ఆ పాయింట్‌ని లేవదీసిన వారిని ట్రోల్‌ చేసే పరిస్థితి ఫేస్‌బుక్‌ కల్పిస్తోంది. దాంతో గుండె గాయపడి గిలగిలలాడేవారి సంఖ్య పెరుగుతోంది.నిజానికి సోషల్‌ మీడియా ఒక మంచి ప్రచార మాధ్యమం.

వ్యక్తిగత విశేషాలు, అభిప్రాయాలు, చైతన్యపరిచే సంగతులు, ఈవెంట్స్, హెల్త్‌ టిప్స్, వంటలు... ఇలా ఏవైనా సరే రూపాయి ఖర్చులేకుండా వేలాది మందితో షేర్‌ చేసుకోవచ్చు. టాలెంట్‌ ఉంటే ప్రదర్శించవచ్చు. కానీ దీనిని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలుసుకోకపోవడం తెలియచేసేవారు లేకపోవడమే సమస్య. ఎవరినైనా ఎంతెంతైనా అనేయవచ్చనుకొని లీగల్‌ సమస్యల్లో చిక్కుకున్నవారు కూడా ఉన్నారు. సోషల్‌ మీడియాలో మన చర్యలను గమనించే ఏజెన్సీలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు.ఏమైనా మానవ సంబంధాలు భౌతిక స్థాయిలో ఏర్పరచుకోలేని స్థితిలో సమాజం ఉంది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం, ఒకరిని మరొకరు కలవడం దుస్సాధ్యమైన స్పీడులో ఉన్నాం.

కనుక ఈ సోషల్‌ మీడియా ద్వారానే ఒకరితో ఒకరు కనెక్ట్‌ అవుతున్నాం. ఈ నేపథ్యంలో తారసపడుతున్న అపరిచితుల నుంచి ఎదురయ్యే మంచి, చేదు అనుభవాలు వారి వారి మనోశక్తిని బట్టి నిలబెడుతున్నాయి. కుంగదీస్తున్నాయి.గతంలో పెద్దలు ఎలా ఉన్నావు, భోం చేశావా అని తప్పక అడిగేవారు. ఇవాళ నీ సోషల్‌ మీడియాలో ఏదైనా సమస్య ఉంటే మాతో షేర్‌ చేసుకో. లోలోపలే పెట్టుకుని కుమిలిపోకు అని చెప్పాల్సిన రోజులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఒకచోట కూర్చుని ఇంటి విషయాలు, చదువు విషయాలు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా యాక్టివిటీని కూడా చర్చించుకుంటే చాలా మేలు. మేలుకో వర్తమాన పౌరుడా... మేలుకో.
– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement