సోషల్ ‌మీడియా మార్గాన్వేషణ | Social Media Perception Visualization And Reality | Sakshi
Sakshi News home page

సోషల్ ‌మీడియా మార్గాన్వేషణ

Published Tue, May 12 2020 10:17 AM | Last Updated on Tue, May 12 2020 4:28 PM

Impacts Of Social Media On Human Lifes - Sakshi

సోషల్‌ మీడియా అనగానే మీకు మొదట గుర్తొచ్చేది ఏంటి? డొల్గొనా కాఫీ, కొవిడ్‌ టైమ్స్‌‌, క్వారంటైన్‌ టైమ్స్‌. ఇవి కాకపోతే ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్రెండీ ఛాలెంజ్‌లు. ఇవన్నీ గమనిస్తుంటే నాకేం అనిపిస్తోందో నేను చెప్తాను. ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు టీఎస్‌ ఎలియట్‌ ఒక మాటన్నారు. డిస్ట్రాక్షన్‌ ఫ్రమ్‌ డిస్ట్రాక్షన్ బై డిస్ట్రాక్షన్ (పరధ్యానం పరధ్యానం ద్వారా పరధ్యానం నుంచి) ఈ మాట అసలు సానుకూలమైనదా? వ్యతిరేక భావం కలిగించే వాక్యమా? అన్న అనుమానం రావొచ్చు. నిజానికి ఇది తటస్థ భావం కల్పించే అర్థవంతమైన వాక్యం. ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఆలోచిస్తుంటే కూడా ఇలాంటి సందర్భమే గుర్తుకుతెస్తుంది. గందరగోళ పరిచే ఒక సందేహాత్మక రీతిలోనే సోషల్‌ మీడియా కూడా కనబడుతుంది. దానిని మంచి లేదా చెడు రెండింటిలో దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు. సోషల్‌ మీడియా మనకు ఎందుకోసం అవసరమో ముందుగా అర్థం చేసుకుని ఉండటం ముఖ్యం. ఆ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించడంలో సమతుల్యత అవసరం. ఆ సమతుల్యత ఎలా పాటించాలన్నది రోజూ క్రమం తప్పకుండా ఆ వేదికలను వినియోగించే వారు తప్పనిసరిగా తెలుకోవాలి.
(హైపవర్ కమిటీతో సోషల్ మీడియా ప్రక్షాళన!)

సాధారణంగా ఒక మనిషి తినడానికి రోజులో ఎంత సమయాన్ని వెచ్చిస్తారు? రెండు గంటలు లేదా మూడు గంటలు. నేను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌ కోసం ఎంత సమయం వెచ్చిస్తున్నానో తెలుసుకోవాలని నా మొబైల్‌లో చెక్‌ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తినడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో దాదాపు అంతే సమయం లేదా అంతకన్నా ఎక్కువ సమయాన్ని సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ చూడటానికి వినియోగిస్తున్నాం. కావాలంటే ఎవరికి వారు తమ మొబైల్‌లో ఈ విషయాన్ని చెక్‌ చేసుకుంటే ఎవరెంత సమయం వెచ్చిస్తున్నారో తెలిసిపోతుంది.

70 శాతం మంది కెనడియన్‌లు సోషల్‌  మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. వారిలో చాలామంది చిన్న చిన్న విషయాలను కూడా ట్రెండ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, వాటిలో కొన్ని మాత్రమే పనికొచ్చేవి కావొచ్చు. చాలా వరకు అనవసరమైనవే ఉండొచ్చు. ప్రతి రోజూ వారు చేసిన, చేస్తున్న ప్రతి పనినీ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో మంచిమంచి ఫోటోలను పెడుతుంటారు. అలా ఎందుకు చేస్తారు? అలాపెట్టే ప్రతి పోస్ట్‌, ప్రతి ఫోటో సోషల్‌ మీడియాలో ఉండే వారిని ప్రభావితం చేస్తుంది అని అనుకుంటున్నారా? నిజానికి అలా ఎప్పటికీ జరగదు. కానీ ఈ 2020 లో ప్రతి ఒక్కరు అలానే అనుకుంటున్నారు. వారు పెట్టే చిన్న పోస్ట్‌ కూడా ఎంతో మందిని ప్రభావితం చేస్తోందని భావిస్తున్నారు. అది ఒక అపోహ, ఒక భ్రమ అని తెలిసినా సోషల్‌ మీడియాలో చూడగానే మనం దాన్ని నిజమని నమ్మేస్తున్నాం. ఇలాంటి విషయాలు ప్రశాంతగా ఉన్న మన మొదడులో లేనిపోని అలజడలు రేకెత్తిస్తాయి. ఆ పరిస్థితిని మనం సరిగా అర్థంకూడా చేసుకోలేం. దాంతో మనం సోషల్‌ డిటాక్స్‌లు హాష్‌ట్యాగ్‌లను కనిపెడతాం. డిటాక్స్‌ గురించి మాట్లాడే ముందు,  సోషల్‌ మీడియా కారణంగా మనపై విష ప్రభావం చూపించే నాలుగు విధాలైన ఒత్తిడుల గురించి ఒకసారి తెలుసుకుందాం. (లాక్డౌన్ వాట్సప్ చాలెంజెస్)

మొదటిది - పోల్చకోవడం :  
సోషల్‌ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌ను మన నిజ జీవితంతో పోల్చుకుంటూ ఉంటాం. అదివరకు కేవలం ప్రముఖులను (సెలెబ్రిటీస్‌) చూసి వారి జీవితాలతో పోల్చకుంటూ ఆత్మన్యూనతతో కొంచెం నిరాశకు గురయ్యేవాళ్లం. ఇప్పుడేమో, సోషల్‌ మీడియాలో కనిపించే పెట్టే ప్రతి చిన్నా చితకా పోస్ట్‌ను కూడా మన జీవితాలతో పోల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాం.  విహార యాత్రకు సంబంధించి ఎవరి ప్రణాళికలు బాగున్నాయి? ఎవరు ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు? ఎవరు మంచిమంచి దుస్తులు ధరిస్తున్నారు? ఇలా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చే ప్రతి విషయాన్ని  పోల్చుకొని మనకు మనం ఆత్మన్యూనతా భావంతో కూడిన ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నాం.

రెండవది - సోషల్‌ కరెన్సీ :
ఈ విషయాన్ని సింపుల్‌గా చెప్పాలంటే సోషల్‌ మీడియాలో మనల్ని మనం మార్కెట్‌ చేసుకుంటున్నాం అని అర్థం. కేవలం ఒకటి రెండు ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడానికి మనం 100 సెల్ఫీలు తీసుకుంటున్నాం. అయితే, మనం లైక్‌ల కోసం కామెంట్స్‌ కోసం ప్రయత్నించడం. ఆశించినన్ని లైకులు రాకపోవడంతో సోషల్‌ మీడియాను వినియోగించే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. ఏదో ఒక సందర్భంలో చాలా మంది ఇలాంటి అనుభవాలను చవిచూసినవారే.

ఇక మూడోది చాలా ఫేమస్‌ అదే ఫోమో :
ఫోమో ( ఎఫ్‌ఓయమ్‌ఓ) ఇది మనకి తెలియని వారి కోసం చేస్తూ ఉంటాం. ఎవరైనా, కారు  కొన్నాం అని స్టేటస్‌ పెట్టగానే కొన్నది మన వయసు వాడేనా? నాతోటిదేనా ఇలా ఆలోచిస్తాం. వేరే వారు పెట్టిన ఫోటోకి చాలా లైక్‌లు వచ్చాయి. కానీ నేను పెట్టిన పోస్టుకు రాలేదే! అని తెలియకుండానే తీవ్రంగా మథనపడుతాం. ఈ రకంగా సోషల్‌ మీడియా ఒక విధమైన ఒత్తిడికి గురిచేస్తూ చాలా ప్రమాదకరమైన వేదికగా పరిణమించింది.  

ఇక చివరిది ముఖ్యమైనది - ఆన్‌లైన్‌ వేధింపులు :
సోషల్‌ మీడియాలో వేధింపులకు కొదవే లేదు. ఒక పరిశోధన ప్రకారం 40 శాతం మంది పెద్దలు పలు రకాల వేధింపులకు గురవుతున్నారు. 73 శాతం మంది ఏదో రకమైన వేధింపులకు సాక్షి భూతాలుగా నిలుస్తున్నవారే. ఒక మహిళా సెలెబ్రిటీ లేదా ఒక గే లేదా వైకల్యం కలిగిన వారు ఎదుర్కొంటున్న వేధింపులు అంతా ఇంతా కాదు. అంతెందుకు, సోషల్‌ మీడియాలో చెడుగా కామెంట్స్‌ వచ్చాయన్న కారణంగా కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.  ప్రముఖ రచయిత మార్క్‌ మాన్సన్‌ చెప్పినట్టుగా " చాలా సందర్భాల్లో మనస్తాపానికి గురయ్యే భావనకు రావడానికి ప్రజలు బానిసలయ్యారు. ఎందుకంటే అది వారిలో ఒకరకమైన ఆనందాన్ని నింపుతుంది " ఆ కోవలోనే మరే ఇతర సంఘటనలు జరిగినట్టుగానే ఇక్కడకూడా ప్రజలు చావడానికి సిద్ధపడుతున్నారు.  దీన్ని బట్టి ఆన్‌లైన్ వేధింపులు కూడా సోషల్ మీడియాలో తీవ్ర ఒత్తిడులకు గురిచేసే వేదికలుగా మారాయి.

ఈ రకంగా మనిషిపై అనేక ఒత్తిడులకు గురిచేసే సాధనంగా సోషల్‌ మీడియా కనబడుతున్నప్పటికీ, నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టుగానే సోషల్‌ మీడియా వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. పైగా సోషల్‌ మీడియా వల్ల అనేకానేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. చాలా మంది ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవచ్చు. చాలా వినోదాన్ని, మానసిక ఆనందాన్ని పొందవచ్చు. అయితే, ముందుగా సోషల్‌ మీడియాను అర్థం చేసుకోవాలి. ఏది అవసరం ఏది అనవసరం అన్న అంశాలపై నిశిత పరిశీలన అవసరం. సోషల్‌ మీడియాలో సానుకూల, వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తున్న అంశాలను గుర్తించగలిగితే మనం ఎన్నో ఉపయోగాలు పొందగలం. ముఖ్యంగా ఈ వేదిక కారణంగా ఒత్తిళ్లకు గురవుతున్న వారు దీన్ని ఆనందకరమైన సోషల్‌ మీడియాగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకు అత్యంత కీలకమైన నాలుగు అంశాలను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి.

సోషల్‌ మీడియా ఒత్తిడిని అధిగమించాలంటే ముఖ్యంగా ఆచరించాల్సినవి ఏమంటే... సోషల్‌ మీడియా గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడ ఒత్తిడికి గురవుతున్నామో గ్రహించాలి.  ఏ కారణం లేకుండానే మనం ఒత్తిడికి గురవుతున్నామన్న నిజం తెలుసుకోవాలి. సోషల్‌ మీడియా కోసం వినియోగిస్తున్న సమయాన్ని తగ్గించుకోవాలి. దానికి బానిస కాకూడదు. అదే సర్వస్వం కాదన‍్న విషయాన్ని ఒక మామూలు మనిషిలా ఆలోచించండి. కచ్చితంగా ఈ రెండింటినీ అనుసరిస్తే మీరు మంచి ఆన్‌లైన్‌ అనుభవాన్ని పొందగలరు. సోషల్‌ మీడియాలో మిమల్ని ఎవరైనా విసిగిస్తుంటే వారిని రిమూవ్‌ చేసేయండి. ఎవరైనా మీ ఆలోచనలకు వ్యతిరేకంగా భంగం కలిగిస్తుంటే వారిని ఆన్‌ఫాలో అవ్వండి. ఇలాంటి విషయాల్లో మీకు మీరు సంజాయిషీ ఇచ్చుకోనవసరం లేదు. సోషల్‌ మీడియా వేదికల్లో జరిగే ఎలాంటి వాదనల్లో పాల్గొనవలసిన అవసరం అంతకన్నా లేదని గమనించండి. ఏదో యుద్ధంలో మాదిరిగా సోషల్‌ మీడియా వేదికల్లో జరిగే వాదనల్లో పాల్గొని తలపోట్లు తెచ్చుకోవలసిన అవసరం, అగత్యం ఎంతమాత్రం లేదు. ఇలాంటి పాటించడం ద్వారా అత్యుత్తమమైన సోషల్‌ మీడియా మాడల్‌ను మీరు ఎంచుకున్నట్టు లెక్క.  ఇలా చేయడం ద్వారా సోషల్ మీడియా కారణంగా ఎదురవుతున్న ఎలాంటి ఒత్తిళ్లు మీపై పనిచేయవు. దరిచేరవు.

నేను ఈ విషయాలను పంచుకోవడానికి ప్రధాన కారణమేమంటే.. ! ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించి, సోషల్‌ మీడియాలో ఉండే చీకటి కోణం ఏంటో గ్రహించాలి. సోషల్ మీడియాలో కనిపించే కొన్ని విషయాలు విషతుల్యంగా, పైశాచికంగా ఎందుకుంటాయి? అందులో చెడు ఎందుకు చేరింది? అది సోషల్ మీడియా వేదికల వల్లా? లేక అందులో భాగస్వామ్యమయ్యే వ్యక్తుల కారణంగానా? మీకు కథ నచ్చలేదని మాక్‌బుక్‌ను నిందించడం సరైంది కాదు. అలాగే ఏవో కొన్ని అంశాల కారణంగా మీరు సోషల్‌ మీడియా తప్పు అన్న భావనకు రావలసిన అవసరం లేదు. అలాంటి ఆలోచనలను మీ మనసు నుంచి తీసేయండి.

సోషల్‌ మీడియా అన్నది మిమ్మల్ని మీ నిజ జీవితం నుంచి వేరే వైపుకు మళ్లించదు. మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయదు. పైగా మీకు చాలా అనుభవాల్ని ఇస్తుంది. అనేక విధాలుగా మీలో స్ఫూర్తిని నింపుతుంది. అలాగే మీకు ఎన్నో ఫన్నీ మీమ్స్‌ని అందిస్తుంది. దీనిలో దేనిని పొందాలి అనేది మీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. సోషల్‌ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోండి. సరైన కోణంలో వినియోగిస్తే సోషల్‌ మీడియా ఒక సంతోషకరమైన పరిణామంగా మానసికంగా ఆరోగ్యకరమైన వేదికగా ఉపయోగపడుతుంది.


ఆర్‌. మౌనికా రెడ్డి (అనలిస్టు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement