విజయా రాజన్
ఇంటిని, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇల్లాలు. నిర్ణయమైనా, పనైనా కుటుంబ యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుంటారు గృహిణులు. ఈ కోవకు చెందిన ఇల్లాలే విజయా రాజన్. తన భర్త, పిల్లలకు పుష్కలంగా పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించాలని ఎప్పుడూ అనుకుంటుండేది. ఈక్రమంలో ఎటువంటి ఆహారంలో.. శరీరానికి కావల్సిన పోషకాలు దొరుకుతాయో జాగ్రత్తగా పరిశీలించి, ఆహార పదార్థాలను ఎంపిక చేసి, వాటితో రకరకాల స్నాక్స్‌ను తయారుచేసి కుటుంబ సభ్యులకు పెట్టేది. విజయ చేసే స్నాక్స్ ఇరుగుపొరుగు స్నేహితులకు కూడా నచ్చడంతో .. వారి సలహాతో చిన్న స్టార్టప్‌ను ప్రారంభించింది విజయ. స్టార్టప్ దినదినాభివృద్ధి చెందుతూ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది.
ఇంగ్లిష్ చానల్ ఈదేందుకు..
విజయ భర్త రాజన్ శ్రీనివాసన్ కి టెలికాంలో ఉద్యోగం. ఆయన సైక్లిస్ట్, రన్నర్, స్విమ్మర్ కూడా. అతడు 2015లో ఇంగ్లిష్ చానల్ ఈదడానికి శిక్షణ తీసుకుంటున్నారు. ఆ చానల్‌ను ఈదాలంటే శరీరంలో శక్తి బాగా ఉండాలి. అందుకోసం బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఆలోచించిన విజయ భర్తకు అధికమొత్తంలో శక్తినిచ్చే ఆహారం ఏంటి? అని మరింత లోతుగా వెతికింది. ఈక్రమంలోనే ఖనిజ పోషకాలు ఉండే ఆహారాలను పంచదార, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా స్నాక్స్ తయారు చేసి భర్తకు పెట్టేదామె. వాటిని తిన్న రాజన్ చురుకుగా, ఆరోగ్యంగా కనిపించేవారు.
డ్రైఫ్రూట్స్, ధాన్యాలు, పండ్లతో తయారుచేసిన స్నాక్స్‌ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. అంతేగాక మూడు నాలుగురోజులపాటు స్నాక్స్ తాజాగా ఉండేవి. ఇదే సమయంలో తన బంధువులు, స్నేహితుల్లో కొందరు కూడా.. పోషకాలతో కూడిన ఆహారం కోసం వెతుకుతున్నారని తెలిసి, తాను తయారుచేసిన స్నాక్స్‌కు వారికి ఇచ్చి రుచిచూడమనేది. అవి తిన్నవాళ్లు ‘‘చాలా బావున్నాయి, ఇలాంటి ఫుడ్ మార్కెట్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎందుకు ఈ స్నాక్స్‌ను బయట అమ్మకూడదు. బయట అమ్మావంటే మంచి ఆదాయం కూడా వస్తుంది’’ అని ప్రోత్సహించారు.
సిరిమిరి..
కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆదరణతో విజయ స్నాక్స్ విక్రయాలను ప్రారంభించింది. పోషకాలతో కూడిన స్నాక్స్ కావడంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో.. స్నాక్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇదే క్రమంలో 2017లో బెంగళూరులో 15 మంది పనివాళ్లతో ‘సిరిమిరి’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. తన కుటుంబం కోసం తయారు చేసిన స్నాక్స్‌లో కొద్దిపాటి మార్పులు చేసి, మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి పెద్దమొత్తంలో మార్కెట్లో విక్రయిస్తోంది.
విజయ తన బ్రాండ్ పేరు అర్థవంతంగా ఉండాలనుకుని, ‘సిరిమిరి’ని బ్రాండ్ నేమ్‌గా పెట్టుకుంది. కన్నడలో సిరిమిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. వ్యాపార విస్తరణలో భాగంగా ‘అమెజాన్ సహేలి కార్యక్రమం’లో సిరిమిరి ఉత్పత్తులను చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా తన ఉత్పత్తులను మార్కెట్లో ఎలా విక్రయించాలో నేర్చుకుని కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సిరిమిరి ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ఇంతింతై వటుడింతై..
భర్త, పిల్లల ఆరోగ్యం కోసం వచ్చిన ఐడియా విజయను ఎంట్రప్రెన్యూర్‌గా మార్చేసింది. తొలినాళ్లలో మూడు రకాల ఎనర్జీ బార్‌లను విక్రయించిన సిరిమిరి క్రమంగా తమ ఉత్పత్తులను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం సిరిమిరి పేరిట ఎనిమిది హెల్థీ బార్స్, ఆరు కండరాలకు పుష్టినిచ్చే బార్‌లు, మరొక హెల్థీ మిక్స్ ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. తన స్టార్టప్‌లో తయారైన ఉత్పత్తులను ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. స్టార్టప్ ప్రారంభంలో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికి ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్‌తో సిరిమిరి వ్యాపారం సాగుతోంది.
భార్య స్నాక్స్ వ్యాపారం ఇంతింటై వటుడింతయై అన్నట్లుగా విస్తరించడంతో... బ్రిటీష్ టెలికమ్‌లో కంప్యూటర్ ఇంజినీర్‌గా రెండు దశాబ్దాలుగా చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి రాజన్ ఇండియా తిరిగి వచ్చి, సిరిమిరి వ్యాపారంలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివద్ధికి కృషి చేస్తున్నారు. ఆడవాళ్లు అనుకోవాలేగానీ ఏదైనా సాధించగలరు అన్న మాటకు విజయారాజన్ ఉదాహరణగా నిలుస్తూ, ఎంతోమంది ఔత్సాహిక మహిళలకు ప్రేరణనిస్తున్నారు.
చదవండి: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!!
Comments
Please login to add a commentAdd a comment