మంచి మాట....మాటగానే మిగిలిపోదు. ఆ మాటలోని సారాంశం ఇంధనమై ముందుకు నడిపిస్తుంది. విజయం చేతికి అందేలా చేస్తుంది. కెరీర్ కోచ్‌గా ఎంతోమందికి స్టార్టప్‌లపై ఆసక్తి, అవగాహన కలిగిస్తోంది నిష్ఠా త్రిపాఠీ. అమెరికాలో రకరకాల స్టారప్‌లతో కలిసి పనిచేసిన త్రిపాఠీ ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ఎడ్–టెక్ స్టార్టప్ ‘24 నార్త్‌స్టార్’తో విజయం సాధించింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నిష్ఠ తండ్రీ, తాతలు ప్రభుత్వ ఉద్యోగులు. ‘వ్యాపారం’ అనే మాట వారికి అపరిచితం. అయితే కథలు, కవితల పుస్తకాలు ప్రచురించేవారు. పుస్తకాలపై ఆసక్తి తాత, తండ్రి నుంచి నిష్ఠకు వారసత్వంగా వచ్చింది. నిష్ఠ పుస్తకాల పురుగు. చిన్న వయసులోనే స్కూల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివేసింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్’లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన తరువాత ఎన్నో స్టార్టప్‌లతో కలిసి పనిచేసింది.
ఉద్యోగాల కోత ఉధృతంగా ఉన్న రోజులవి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగాలలో ప్రమోషన్‌లతో మంచి పేరు తెచ్చుకుంది నిష్ఠ. ఆ సమయంలో తన మీద తనకు నమ్మకం ఏర్పడడంతో ఎంటర్‌ప్రెన్యూర్ కలలు మొదలయ్యాయి. ‘ఏ రోజైనా సరే స్టార్టప్ స్టార్ట్ చేస్తాను’ అనే నమ్మకంతో ఉన్న నిష్ఠ న్యూయార్క్ యూనివర్శిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్‌లోముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను నిర్వహించే అవకాశం వచ్చింది. నలుగురితో కలిసి మాట్లాడడానికి ఇబ్బంది పడే స్వభావం ఉన్న నిష్ఠకు ఈ సదస్సు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. తన బలహీనతలను అధిగమించే బలాన్ని ఇచ్చింది. మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత...వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యలతో అశాంతికి గురైన నిష్ఠ త్రిపాఠీకి అక్షరస్నేహం సాంత్వన ఇచ్చింది. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు, తత్వశాస్త్ర పుస్తకాలు చదివింది. ‘సెవెన్ కన్వర్‌సేషన్స్’ పేరుతో మొదటి పుస్తకం రాసింది.
ఈ పుస్తకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. స్కూలు ఫ్రెండ్స్ నుంచి యూనివర్శిటీ ప్రొఫెసర్‌ల వరకు తనను అభినందించారు. ఆతరువాత...సంక్లిష్టమైన బిజినెస్ కాన్సెప్ట్‌లను సులభతరం చేసి అందరికీ అర్థమయ్యేలా పుస్తకాలు రాసింది. పుస్తకాలు చదవడానికి ఇష్టపడే వాళ్లతో పాటు పుస్తకం పేరు వినబడగానే పారిపోయే వారు కూడా ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ హాయిగా చదువుకునేలా పుస్తకాలు రాసింది. ‘బిజినెస్ బుక్స్ అనగానే గంభీరమైన భాష వాడాలనే రూల్ లేదు’ అని చెబుతుంది నిష్ఠ.
పదిహేనుమంది స్టార్టప్ ఫౌండర్‌లను ఇంటర్వ్యూ చేసి ‘నో షార్ట్‌కట్స్’ పేరుతో రాసిన పుస్తకానికి కూడా మంచి స్పందన వచ్చింది. అకడమిక్ కౌన్సెలింగ్ పేరుతో ఇస్తున్న కౌన్సెలింగ్ ఆమెను అసంతృప్తికి గురి చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు అత్యవసరమైన లైఫ్‌స్కిల్స్ డెవలప్ చేయడానికి అకడమిక్ కౌన్సెలింగ్ స్పేస్‌లోకి అడుగు పెట్టింది. ‘స్కాలర్ స్ట్రాటజీ’ పేరుతో ఎడ్యుకేషనల్ స్టార్టప్‌ను ప్రారంభించింది.
‘సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉండే వ్యూహాలు స్టార్టప్‌ల విజయానికి కారణం అవుతాయి ’ అంటున్న నిష్ఠ ఎడ్–టెక్ స్టార్టప్ ‘24 నార్త్‌స్టార్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది. ‘డబ్బు బాగా సంపాదించాలనే అత్యాశతో స్టార్టప్‌ను మొదలు పెట్డకండి. స్టార్టప్‌కు తమవైన సవాళ్లు ఉంటాయి. ఆ సవాళ్లు అర్థం చేసుకుంటూ ఓపిగ్గా ప్రయాణం మొదలుపెట్టాలి.
ఒక స్టార్టప్ స్టార్ట్ చేసే ముందు కేవలం నా ఆసక్తి వల్లే ఇది మొదలు పెట్టానా? మార్కెట్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? అనే కోణంలో సీరియస్‌గా విశ్లేషణ చేసుకోవాలి. నేను మొదట ఫ్యాషన్ స్టార్టప్ మొదలుపెట్టి కొద్ది కాలంలో మూసివేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఫ్యాషన్‌పై నాకు అంతగా అవగాహన లేకపోవడమే’ అంటుంది నిష్ఠా త్రిపాఠీ. సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఉండే వ్యూహాలు స్టార్టప్‌ల విజయానికి కారణం అవుతాయి.
– నిష్ఠ
(చదవండి: లాయర్‌ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..)
Comments
Please login to add a commentAdd a comment