చిత్తూరు యాసలో వినిపించే ‘పుష్పా–2’ డైలాగ్....‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేసనల్’ బాగా పేలింది.
చిత్తూరు జిల్లా తవణంపల్లె మహిళా మార్ట్‌కు కూడా ఈ డైలాగ్‌ను అన్వయించుకోవచ్చు.‘మా మహిళా మార్ట్ అంటే స్టేట్ అనుకుంటివా... ఇప్పుడు నేషనల్... రేపు ఇంటర్నేషనల్’ఆనాటి వై.ఎస్.జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత’ నినాదంతో పురుడు పోసుకున్న ‘మహిళా మార్ట్’లు ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదిగి పోయాయి.కార్పొరేట్ సూపర్ మార్కెట్‌లతో సమానంగా సత్తా చాటుతున్నాయి.తాజాగా... చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె ‘మహిళా మార్ట్’ జాతీయస్థాయిలో పురస్కారం పొందింది.
చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నోవిధాల ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్‌లకు దీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళల ‘మహిళా మార్ట్’లు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు ‘మహిళా మార్ట్’ల పుణ్యమా అని వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు.
‘ఇది మా వ్యాపారం. మా టర్నోవర్ ఇంత...’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో మండల సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే రెండో ‘చేయూత మహిళా మార్ట్ ను తవణంపల్లెలో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మండలంలోని 1,431 స్వయం సహాయక సంఘాల్లోని 14,889 మంది సభ్యుల వాటా ధనం రూ.26 లక్షలతో ‘చేయూత మహిళా మార్ట్’(ప్రస్తుతం వెలుగు మహిళ మార్ట్‌గా పేరు మార్చారు)ను ్రపారంభించారు.ఆర్థిక అవగాహన, పొదుపు, అప్పుల రికవరీలు, సిఐఎఫ్ చెల్లింపులు.
స్త్రీనిధి, పారదర్శక నిర్వహణ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలతో తవణంపల్లె మహిళా మార్ట్ ముందంజలో ఉంది. మండల సమాఖ్య ద్వారా సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ మహిళా మార్ట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నేషనల్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంలో తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత సర్టిఫికేట్, షీల్డు, ్రపోత్సాహక నగదు (రూ.75 వేలు) అందుకున్నారు.‘ఇది ఒకరిద్దరి విజయం కాదు. ఎంతోమంది మహిళల సామూహిక విజయం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అంటున్నారు రేఖ, అనిత.
– తగీరు జగన్నాథం, సాక్షి, తవణంపల్లె, చిత్తూరు జిల్లా.
పారదర్శకత... మా బలం
‘అన్నీ తెలిసిన వారు లేరు. ఏమీ తెలియని వారు లేరు’ అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవరూ ఉండరు. మనకు తెలిసినదాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏదీ అసాధ్యంగా అనిపించదు. ‘మహిళా మార్ట్’ అనే బడిలో వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఏ వ్యాపారానికి అయినా పారదర్శకత అనేది ముఖ్యం. ఆ పారదర్శకత వల్లే జాతీయ గుర్తింపు వచ్చింది. మహిళా సంఘాలు ‘వెలుగు మహిళా మార్ట్’ను పారదర్శకంగా నిర్వహించడంతో జాతీయ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
– అనిత మహిళా సమాఖ్య మండల కార్యదర్శి
ఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుంది
వ్యాపారంలో ఫలానా మహిళ ఉన్నత స్థాయికి చేరింది... లాంటి ఎన్నో విజయగాథలను వినేవాళ్లం. అలాంటి ఒక స్థాయికి ఏదో ఒకరోజు చేరుకోగలమా అనిపించేది. ‘మహిళా మార్ట్’ ద్వారా మమ్మల్ని గొప్ప అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ముందుకు నడిపించింది. ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అడిగే వాళ్లకు నేను చెప్పే జవాబు... ‘నేను సాధించగలను’ అనే నమ్మకం. ఆ నమ్మకానికి కష్టం, అంకితభావం తోడు కావాలి. తవణంపల్లెలోని వెలుగు మహిళా మార్ట్‌లో సభ్యులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డ్వాక్రా సభ్యులు మార్ట్‌లోని వస్తువులే కొంటున్నారు.
– రేఖ
మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment