కృష్ణాడెస్క్: విధి వక్రీకరించింది. సాఫీగా సాగుతున్న జీవితాన్ని ఒక్క కుదుపు కుదిపింది. బయటి ప్రపంచం తెలియని గృహిణిని అభాగ్యురాలిని చేసింది. భర్త, పిల్లలే సర్వస్వం అనుకుని జీవిస్తున్న ఆమెకు మూడు పదుల వయస్సులోనే పసుపు కుంకుమలను దూరం చేసింది. అయినా ఆ మహిళ పరిస్థితులను తలచుకొని కుంగిపోలేదు. విధిరాతను ఎదురించి ఆత్మస్థైర్యంతో జీవనపోరాటం సాగిస్తోంది. విషాదాన్ని దిగమింగుకుంటూ మహిళలకు కష్టతరమైన వృత్తిని సైతం చేపట్టి కుటుంబ భారాన్ని మోస్తోంది. మగవారికే పరిమితమైన పవర్ టూల్స్ మెకానిక్ వృత్తిని చేపట్టి నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన వీరనాగమల్లేశ్వరికి ఇంటర్ చదువుతుండగానే పొరుగు గ్రామం ఉమామహేశ్వరపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ చొప్పా రాముతో పెళ్లి చేశారు. వీరికి ఆడ, మగ కవలలు జన్మించారు. పదేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో రాముకు కడుపులో ఇన్‌ఫెక్షన్ సోకింది. క్రమంగా వ్యాధి తీవ్రమై శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి రూ.8 లక్షల రుణం తీసకుని ఆపరేషన్ చేయించినా ఫలితం దక్కలేదు. గతేడాది జూలైలో రాము మరణించాడు.
అప్పటికీ రెండో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్న పిల్లలతో మూడు పదుల వయస్సు కూడా దాటని నాగమల్లేశ్వ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గుండె దిటవు చేసుకున్న ఆమె విధిని ఎదురించి నడవాలని సంకల్పించింది. భర్త ఆపరేషన్ కోసం చేసిన రూ. 8 లక్షల రుణభారంతోపాటు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఆమె ముందు సవాళ్లుగా నిలిచాయి. దీంతో అప్పటి వరకు ఇతరులతో మాట్లాడటానికే జంకే నాగ మల్లేశ్వరి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధ పడింది.
హనుమాన్‌జంక్షన్ నూజివీడు రోడ్డులో రాము నిర్వహించే రాజధాని పవర్ టూల్స్ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించింది. గతంలో భర్తతో కలిసి షాప్‌కి వెళ్లినప్పుడు పవర్ టూల్స్ రిపేర్లు, విడి భాగాల కొనుగోళ్లు, అమ్మకాలను గమనిస్తుండటంతో కొంత అవగాహన ఏర్పడింది. ఏడాదిగా భవనాల కూల్చివేత, ఐరన్ బార్ బెండింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్ పనుల కోసం ఉపయోగించే పవర్ టూల్స్ అద్దెకిస్తూ.. వాటికి రిపేర్లు చేస్తూ పిల్లలిద్దరినీ చదివించుకుంటోంది.
కుంగిపోకుండా ముందుకు..
బయటకొచ్చి పని చేయటం తెలియని గృహిణికి ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో కస్టమర్లకు సమాధానం చెప్పే ధైర్యం వచ్చింది. భర్తే తనకు కొండంత ధైర్యమని, ఆయనే తనలో ధైర్యాన్ని నింపి ఈ వ్యాపారం నడిస్తున్నారని చెమర్చిన కళ్లతో నాగ మల్లేశ్వరి చెబుతోంది. పరిస్థితులు తారుమారయ్యాయని కుంగిపోకుండా జీవితంలో ముందుకు సాగటమే తాను నేర్చుకున్న పాఠమని, సవాళ్లను ఎదుర్కొని కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్ కోసం తాను కష్టపడుతున్నానని చెబుతున్న నాగమల్లేశ్వరి మహిళలకు స్ఫూర్తిదాయకం.
Comments
Please login to add a commentAdd a comment