దైవంలా ఆదుకుంటున్న ఢిల్లీ హైల్ప్‌లైన్ | Intended him like Delhi hailplain | Sakshi
Sakshi News home page

దైవంలా ఆదుకుంటున్న ఢిల్లీ హైల్ప్‌లైన్

Published Wed, Mar 26 2014 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

దైవంలా ఆదుకుంటున్న ఢిల్లీ హైల్ప్‌లైన్ - Sakshi

దైవంలా ఆదుకుంటున్న ఢిల్లీ హైల్ప్‌లైన్

 గృహిణులు, విద్యార్థిలు, ఉద్యోగినులు, ఇతర అన్ని వర్గాల మహిళలకూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా దేవుడే దిగి వచ్చి ఆదుకోవలసిన పరిస్థితి! భూమి మీద ఎవరూ సహాయపడరు! గ్యాస్ అయిపోయింది. అయిపోయి పదిరోజులు దాటుతోంది. ఇంట్లోవాళ్లు పట్టించుకోరు. సిలిండర్ రాదు. ‘ఎలా చచ్చేదిరా దేవుడా’ అని మొత్తుకోవడం తప్ప వేరే దారి లేదు.
 
 
 కొన్ని కేసులు
     విడాకులు తీసుకున్న ఓ మహిళకు భర్త నుంచి భరణం రావడం లేదు. అదే ఆవిడ జీవనాధారం. ఆ విషయాన్ని హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఇలా ఆమె ఫోన్ చేసిన ప్రతిసారీ హెల్ప్‌లైన్ సిబ్బంది ఆమె భర్తకు విషయాన్ని గుర్తు చేస్తుంటారు.
     ఓ మహిళ బస్సు కోసం శివాజీ స్టేడియం బస్టాప్‌లో ఉంది. రాత్రి 11.30 రావలసిన బస్సు ఎంతకీ రావడం లేదు.  ఆ విషయాన్ని హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేసి చెప్పింది. వారు ట్రాఫిక్ పోలీసులకు, ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పది నిమిషాల్లో బస్సు అక్కడికి చేరుకుంది.
     ఓ బాలిక తెల్లవారు జామున 2 గంటలకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. ఆమె నుంచి వచ్చిన కాల్  ఆధారంగా హెల్ప్‌లైన్ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు వెంటనే కిడ్నాపర్‌లను ఆచూకీ కనిపెట్టి, బాలికను కాపాడారు.
 
 కాలేజీ మొదలైంది. అమ్మానాన్న కాలేజీలో చేర్పించలేదు. ‘‘చదివింది చాల్లే, ఇంట్లో ఉండు’’ అంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలి? అమ్మానాన్నలకంటే గొప్పవాళ్లకు చెప్పుకోవాలి. ఎవరు వాళ్లు. దేవుడు! ‘‘దేవుడా నన్ను కాలేజీకి పంపించమని చెప్పవా?’’ అని వేడుకోవడం తప్ప దారి లేదు.
 ఆఫీసులోనో, ఆఫీసుకు వెళ్లివస్తున్నప్పుడో మగవాళ్ల చూపులు, మాటలు హింస పెడుతుంటాయి. ఇంట్లో చెప్పుకోలేరు. ఆఫీస్‌లో పై అధికారికి ఫిర్యాదు ఇవ్వడానికి ధైర్యం సరిపోదు. ‘‘దేవుడా ఇదేం బాధ నాకు’’ అని కుమిలిపోవడం తప్ప దారి లేదు.
 ఇంకా రకరకాల సమస్యలు, ఇబ్బందులు, వేధింపులు. ఎలా ఈ పాపిష్టి లోకంలో ఆడవాళ్లు నెగ్గుకు రావడం?! దేవుడి మీద భారం వేసి జీవితాన్ని లాగించడమేనా?
 మరీ అంత నిస్పృహలోకి జారిపోకండి. దేవుడు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడు. ఉదా: 181. న్యూఢిల్లీలో మహిళలు ఎవరైనా ఈ నెంబరుకు ఫోన్ చేసి సమస్య చెబితే చాలు. మిగతాదంతా ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి కార్యాలయమే చూసుకుంటుంది. 181 అనేది హెల్ప్‌లైన్ నెంబరు. 24 గంటలూ, 365 రోజులూ ఈ లైన్ అందుబాటులో ఉంటుంది. ప్రతి షిఫ్టులోనూ కనీసం 8 మంది నిర్విరామంగా పనిచేస్తూ ఉంటారు. సమస్యను అందుకోవడం, పరిష్కారాన్ని అందివ్వడం 181 విధి.
 2012 డిసెంబరులో ప్రారంభమైన ఈ హెల్ప్‌లైన్‌కు తొలి ఏడాదే లక్షకు పైగా కాల్స్ వచ్చాయి. వాటిలో చాలావరకు పోలీసు సహాయం అవసరమైన కాల్స్. మిగతావి రోజువారీ జీవితంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు. ప్రస్తుతం ఈ హెల్ప్ లైన్ దగ్గర పరిష్కరించవలసిన కేసులు నలభై వేల వరకు ఉన్నాయి. పరిష్కరించినవి 25 వేల వరకు ఉన్నాయి! అవసరాన్ని బట్టి సాధారణ కాల్స్‌ను కూడా అత్యవసరమైన కాల్స్‌గానే హెల్ప్‌లైన్ సిబ్బంది పరిగణిస్తుంటారు. ఇటీవల సీలంపూర్ నుంచి ఒక గృహిణి ఫోన్ చేసి గ్యాస్ ఇంకా రాలేదని వాపోయింది. మీ సమస్య చిన్నది కాబట్టి మేము స్వీకరించలేము అని హెల్ప్‌లైన్ సిబ్బంది ఆమెతో చెప్పారు. అందుకు ఆ గృహిణి ఏడుపు ఆపుకుంటూ ‘‘చిన్నదే కావచ్చు. కానీ ఇంటికి రాగానే భోజనం వడ్డించలేదని నా భర్త నన్ను చిత్రహింసలు పెడితే అప్పుడైనా నా సమస్య పెద్దదవుతుందా?’’ అని అడిగింది. వెంటనే వాళ్లు ఆమె నుండి వివరాలు తీసుకుని, గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి తక్షణం సిలిండర్‌ని బట్వా చేయించారు! ఇలా 2012-2013 సంవత్సర కాలంలో హెల్ప్‌లైన్ 14,000 ‘అసభ్యమైన కాల్స్’  కేసులను, 11,989 గృహహింస కేసులను, 52 ఆరోగ్యసంబంధిత కేసులను, 36 సీటీ బస్‌లకు సబంధించిన కేసులను పరిష్కరించింది. ఇవికాక ఆస్తి తగాదాలకు సంబంధించి 377 కేసులలో చిక్కుముడులను విప్పింది. హెల్ప్‌లైన్ దగ్గర అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలకమైన ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాటి ఆధారంగా ఒక్కో సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటూ పోతారు హెల్ప్‌లైన్ సిబ్బంది. అలాగే న్యాయనిపుణులు, పోలీసు అధికారులు,  మీడియా రంగంలో ఉన్న ప్రముఖులు వీరికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఢిల్లీలో ఉన్నట్లే మన దగ్గరా ఇలాంటి హెల్ప్‌లైన్ ఒకటి ఉంటే మహిళలకు కొండంత అండగా ఉంటుంది. పక్కనే దేవుడున్నంత భరోసా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement