Reactors
-
Atchutapuram: ప్రాణాలు తీసిన పాతకాలం రియాక్టర్!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లే ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నాయి. కార్మికుల భద్రతని గాలికొదిలేస్తూ.. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా.. కేవలం లాభాలు గడించేయాలన్న దురాలోచనతో పరిశ్రమలు వేస్తున్న తప్పుటడుగులతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోతున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. రియాక్టర్ల తనిఖీలు పట్టించుకోవడం లేదు.. వీటిని పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో పేలుడుకు అది పాతకాలం రియాక్టర్ కావడమేనని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలకు పాత రియాక్టర్లే కారణమవుతున్నాయని అంటున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లే అత్యంత కీలకం. వీటిలోనే రసాయనాలను మిశ్రమం చేస్తారు. ఈ కొలతల్లో తేడా వచ్చినా పీడనం, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవించినా ఈ రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోతాయి. ఇప్పుడు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో కూడా రియాక్టర్ పేలడానికి ఎక్సోథర్మల్ రియాక్షనే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి రసాయనాల మిశ్రమంలో తేడా వస్తే దాని ఉధృతిని ఆపే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. రసాయన మిశ్రమాల పరిమాణంపై దీని నష్ట తీవ్రత ఆధారపడి ఉంటుందంటున్నారు. ఇప్పటికీ చాలా కంపెనీల్లో పాత రియాక్టర్లే.. విదేశాల్లో పోలిస్తే మన దేశ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు తరచూ పేలడానికి సరైన నిబంధనలు, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికీ అత్యాధునిక రియాక్టర్లను కాకుండా పాత కాలం నాటి రియాక్టర్లనే వాడుతున్నాయని.. ఇవే ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణమని విశ్లేíÙస్తున్నారు. అత్యాధునిక రియాక్టర్లలో ఎక్సో థర్మల్ రియాక్షన్ మొదలైతే దానికదే నీటిని వెదజిమ్ముకోవడం లేదా ఉష్ణోగతలను తగ్గించుకోవడం, తీవ్రతను బట్టి దానికదే ఆగిపోవడం జరుగుతుందంటున్నారు. కానీ మన రాష్ట్రంలో కొత్త రియాక్టర్లు ఖరీదైనవి కావడంతో పాతకాలం రియాక్టర్లనే కంపెనీలు కొనసాగిస్తున్నాయి. పాత రియాక్టర్ల స్థానే కొత్త రియాక్టర్లను బిగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎసెన్షియా ఫార్మాలో పేలుడు జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణలో ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. ఇదీ చదవండి: మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటంఅనుక్షణం అప్రమత్తత.. అచ్యుతాపురం సెజ్‌లో దాదాపు 208 ఫార్మా కంపెనీలు దాదాపు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతి ఫార్మా పరిశ్రమలోనూ సామర్థ్యాన్ని బట్టి 2 నుంచి 10కి పైగా రియాక్టర్లు ఉంటాయి. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెంపరేచర్లో ద్రావకాలను మరిగించాల్సి ఉంటుంది. రియాక్టర్‌కు 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రియాక్టర్‌పై ఒత్తిడి పెంచే సమయంలో సంబంధిత నిపుణులు, కార్మికులు దానిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. రియాక్టర్లు వేడిని తట్టుకోలేక పేలిపోతుంటాయి. రియాక్టర్ టీమ్‌లో ఉండేవారు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 140 డిగ్రీల నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో వెంటనే దానిని చల్లబర్చాల్సి ఉంటుంది. రియాక్టర్లో రసాయనాల్ని బాయిల్ చేయడం ఆపివేయాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించే రప్చర్ డిస్్క, సేఫ్టీ వాల్వ్ రియాక్టర్ ప్రెజర్ కుక్కర్ మాదిరిగా పనిచేస్తుంటుంది. కుక్కర్లో ఎలా అయితే ఒత్తిడి పెరిగితే విజిల్ రూపంలో దాన్ని బయటికి పంపిస్తుంటుందో.. ప్రతి రియాక్టర్‌కు రప్చర్ డిస్్క, సేఫ్టీ వాల్వ్ ఉంటాయి. రియాక్టర్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒత్తిడి ఎక్కువైనట్లు అనిపిస్తే.. రప్చర్ డిస్క్ ఓపెన్ అయి.. ప్రెజర్‌ని రిలీజ్ చేస్తుంటుంది. అది పనిచేయకపోతే సేఫ్టీ వాల్వ్ వెంటనే ఓపెన్ అయి.. ప్రెజర్‌ని బయటకు పంపించేస్తుంటుంది. ఈ రెండూ సక్రమంగా పనిచేస్తే ఏ రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉండదు. ఎసెన్షియాలో ఏం జరిగి ఉంటుంది? ఎసెన్షియాలో రియాక్టర్ నాణ్యమైనది కాకపోవడం వల్ల పేలిందా లేక రియాక్టర్లో ఒత్తిడి కారణంగా అనేది తెలియాల్సి ఉంది. రియాక్టర్లో రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతని బయట నుంచి పరిశీలించేందుకు టెంపరేచర్ గేజ్ ఉంటుంది. రియాక్టర్ తట్టుకునే ఉష్ణోగ్రతని దాటుతుందా లేదా అనేది ఇక్కడ పరిశీలిస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది దీన్ని పరిశీలించలేదా? లేదా ఆ సమయంలో ప్రెజర్ పెరిగితే రప్చర్ డిస్క్ ఓపెన్ అవ్వలేదా? పోనీ అది విఫలమయితే.. వెంటనే సేఫ్టీ వాల్ ఓపెన్ అవ్వాలి. ఈ మూడు జరగకపోతేనే రియాక్టర్ పేలుతుంది. ఇక్కడ అదే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫార్మాలో నాలుగు రకాల రియాక్టర్లు ఫార్మా రంగంలో ప్రధానంగా చిన్న స్థాయి ఉత్పత్తి కోసం బాచ్ రియాక్టర్లు, ఉత్పత్తి నాణ్యతను నిరంతరం నిలిపి ఉంచడం కోసం కంటిన్యూ స్టిర్డ్–ట్యాంక్ రియాక్టర్లు, పెద్ద స్థాయి ఉత్పత్తి కోసం ప్లగ్ ఫ్లో రియాక్టర్లు, అధిక పీడనం, ఉష్ణోగ్రత అవసరం ఉండే వాటి కోసం ఆటోక్లేవ్ రియాక్టర్లను ఉపయోగిస్తారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణం, పీడనాన్ని నియంత్రించలేనప్పుడు, రియాక్టర్ల సరైన నిర్వహణ లేనప్పుడు, మానవ తప్పిదాలు ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. రియాక్టర్ల ప్రమాదాలను నియంత్రించాలంటే ఈ చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ డిజైన్– నిర్వహణ.. » రియాక్టర్లు, అవి ఉపయోగించే రసాయన ప్రతిక్రియలకు తగ్గట్టు డిజైన్ చేయాలి. అందుకు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి. » పరికరాల్లోని యాంత్రిక సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి నిరంతర పరిశీలన, తగిన నిర్వహణ అవసరం. ఆధునిక నిఘా నియంత్రణ వ్యవస్థలు » ఉష్ణోగ్రత, పీడనం, ఇతర ముఖ్యమైన పారామితులను నిరంతరం ట్రాక్ చేసే ఆటోమేటెడ్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు. » ‘ఎమర్జెన్సీ స్టాప్’ వ్యవస్థలు ఉండాలి. ఇవి ప్రమాదం సంభవించినప్పుడు ప్రతిక్రియలను సురక్షితంగా నిలిపివేయడానికి ఉపయోగపడతాయి. రసాయనాల నిల్వలో జాగ్రత్తలు » ప్రమాదకర రసాయనాల నిల్వ, నిర్వహణకు కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలి. » రసాయనాల లక్షణాలపై ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం లేదా అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.నిరోధకాలు ఉపయోగించాలి.. » వేడిని గరిష్ట స్థాయి నుంచి తగ్గించే ఏర్పాట్లను వినియోగించుకోవడం అవసరం. ఉదాహరణకు కూలింగ్ జాకెట్లు లాంటివి వాడాలి. » కెమికల్ రియాక్షన్ వేగాన్ని తగ్గించడానికి నిరోధకాలు ఉపయోగించాలి. రియాక్షన్ కైనెటిక్స్ను సవరించడం ద్వారా అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యే పరిస్థితులను నివారించవచ్చు. ఉద్యోగ శిక్షణ, భద్రతా డ్రిల్లులు » రియాక్టర్ల ఆపరేషన్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానాలపై క్రమం తప్పకుండా సిబ్బందికి శిక్షణ అవసరం. అందుకు తగిన విధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి. » భద్రతా డ్రిల్లులు నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు వేగంగా, సమర్థంగా స్పందించవచ్చు. నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించాలి ఫార్మా పరిశ్రమల్లో డ్రగ్స్ తయారీ సమయంలో వివిధ రసాయన మిశ్రమాలను రియాక్టర్లలో కలుపుతారు. ఈ సమయంలో ఆర్గానిక్ సాల్వెంట్స్ బాయిలింగ్ టెంపరేచర్ వద్ద త్వరగా ఆవిరైపోతుంటాయి. అప్పుడు రియాక్టర్లలో ఒత్తిడి పెరుగుతుంది. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైనా రియాక్టర్ పేలుతుంది. ఒక్కోసారి ప్రెజర్ మీటర్, సేఫ్టీ వాల్వ్ పనిచేయవు. ఆ సమయంలో సరిగా గమనించకపోతే రియాక్టర్ పేలిపోతుంది.అందుకే ప్రతి రోజూ సేఫ్టీ వాల్వ్ చెక్ చేస్తుండాలి. ఫార్మాలో పెద్ద పెద్ద రియాక్టర్లని స్థానికంగా స్టీల్ కొనుగోలు చేసి పరిశ్రమల్లోనే తయారు చేస్తుంటారు. ఈ సమయంలో జాయింట్స్‌ని వెల్డింగ్ చేస్తారు. రసాయన మిశ్రమాలు నిరంతరం జరుగుతున్నప్పుడు ఈ జాయింట్స్ వీక్ అవుతుంటాయి.ఒత్తిడి పెరిగినప్పుడు జాయింట్స్ సక్రమంగా లేకపోయినా పేలుడు జరుగుతుంది. అందుకే రియాక్టర్స్ జాయింట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతి పరిశ్రమ నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించి ఒకరోజు షట్‌డౌన్ చేయాలి. అప్పుడు ప్రతి విభాగాన్ని కచి్చతంగా తనిఖీ చేసుకోవాలి. అయితే పరిశ్రమలు ఇలా చేయడం లేదు. అందువల్లే ప్రమాదాలు తలెత్తుతున్నాయి. – ప్రొ.జి.నాగేశ్వరరావు,ఏయూ ఫార్మాస్యూటికల్ ప్రొఫెసర్, కోల్ ఇండియా డైరెక్టర్ -
హైదరాబాద్ సమీపంలో స్టాండర్డ్ గ్లాస్ కొత్త ప్లాంటు
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ, రసాయనాల ఉత్పత్తికి అవసరమైన కీలక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. హైదరాబాద్ సమీపంలోని జిన్నారం వద్ద రూ.35 కోట్లతో దీనిని స్థాపిస్తోంది. ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని స్టాండర్డ్ గ్రూప్ ఎండీ కందుల నాగేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నెలకు 200ల రియాక్టర్ల తయారీ సామర్థ్యంతో ఇది రానుందని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి జీడిమెట్ల వద్ద రియాక్టర్ల తయారీ కేంద్రాలు రెండున్నాయి. ఈ రెండు యూనిట్లకు రూ.35 కోట్లు వెచ్చించారు. 63 నుంచి 20,000 లీటర్ల కెపాసిటీ గల రియాక్టర్లను రూపొందిస్తున్నారు. 2018–19లో రూ.80 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. దేశంలో తొలిసారిగా...: జపాన్ సంస్థ హక్కో సాంగ్యోతో స్టాండర్డ్ గ్లాస్ చేతులు కలిపింది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో తొలిసారిగా కండక్టివిటీ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లను స్టాండర్డ్ ప్రవేశపెట్టనుంది. ఈ రియాక్టర్లతో విద్యుత్ ప్రమాదాలు జరగవని కంపెనీ చెబుతోంది. డిసెంబరు నుంచి ఇవి మార్కెట్లోకి రానున్నాయి. జీడిమెట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంటులోనూ ఇవి తయారు చేస్తారు. 32,000 లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్లు సైతం జిన్నారం యూనిట్లో రూపుదిద్దుకోనున్నాయి. కాగా, స్టాండర్డ్ గ్లాస్ దక్షిణాదిన అగ్ర శ్రేణి కంపెనీగా ఉంది. 400లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,000 పైచిలుకు రియాక్టర్లను సరఫరా చేసింది. ఒమన్, టర్కీ, దుబాయిలోనూ కస్టమర్లున్నారు. త్వరలో రష్యాకు సరఫరా చేయనుంది. అయిదేళ్లలో రూ.1,000 కోట్లు.. స్టాండర్డ్ గ్రూప్ 2010లో ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్థకు 800 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. 2019–20లో రూ.400 కోట్లు ఆశిస్తోంది. అయిదేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది లక్ష్యమని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘మరిన్ని ఇంజనీరింగ్ ఉత్పత్తులు ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఎగుమతుల వాటా 5 శాతమే. 2024 నాటికి ఎగుమతులను 50 శాతానికి చేర్చాలన్నది మా ధ్యేయం. గ్రూప్ కింద ఎనిమిది తయారీ కేంద్రాలున్నాయి. యూకేలో ఆర్అండ్డీ కేంద్రం ఉంది’ అని వివరించారు. -
నగరానికి లేదు నిశ్చింత
మరో ఫార్మా కంపెనీలో నిప్పురవ్వలు రేగాయి.. ఇద్దరు కార్మికులను బలి తీసుకున్నాయి.. మరో ముగ్గురిని మృత్యువు ముంగిటికి నెట్టాయి.. సరైన ప్రమాణాలు పాటించకుండానే.. అనుమతులు తీసుకోకుండానే కొత్త రియాక్టర్‌ను ట్రయల్ రన్‌కు సిద్ధం చేయడం కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది.. ఈరోజు అజికో బయో ఫార్మా.. నిన్న శ్రీకర్ పరిశ్రమ.. అంతకుముందు దక్కన్ కెమికల్స్.. ఇలా వరుసగా రియాక్టర్ల పేలుళ్లు.. బ్లో అవుట్లు.. ప్రాణాలు గాలిలో కలిసిపోవడాలు విశాఖకు సర్వసాధారణంగా మారాయి.. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి.. నగరం చట్టుపక్కల ఉన్న మిగిలిన పరిశ్రమలూ దీనికి తాము అతీతం కావని తరచూ నిరూపిస్తున్నాయి.. నగర ప్రజల భద్రతను నిర్లక్ష్యపు ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు మార్చేస్తున్నాయి...దీనికి కారణం.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ప్రమాదాల నుం చి గుణపాఠాలు నేర్చుకోకపోవడమే.. 2013లో హెచ్‌పీసీఎల్ విస్ఫోటనం.. 2014లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం.. గత ఏడాది దువ్వాడ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ పరిశ్రమలో 12 డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడం దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 90 రసాయన, ఫార్మా, గ్యాస్ పరిశ్రమలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట అధికారులు జరిపిన తనిఖీల్లో వీటిలో సగానికి పైగా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని స్పష్టమైంది.. అయినా ఇప్పటికీ తగిన చర్యల్లేవు.. అధికారులు, యాజమాన్యాలూ కళ్లు తెరవలేదు.. ఈ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులకు జీవన భద్రత లభించడం లేదు. గాజువాక : పారిశ్రామిక జిల్లా విశాఖ... అగ్ని ప్రమాదాల అంచున వేలాడుతోంది. నగరాన్ని చుట్టుముట్టినట్టుండే పరిశ్రమలు జిల్లా ప్రజలను నిత్యం భయంలోకి నెట్టేస్తున్నాయి. ఏక్షణాన ఏ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంటుందోనన్న భయం వెంటాడుతోంది. నగరం చుట్టూ వేలాది చిన్నా పెద్దా కంపెనీలున్నాయి. వీటిలో 90 పరిశ్రమలు మాత్రం అగ్నిప్రమాదాలకు కూతవేటు దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు లేక ఏ క్షణాన ఎలాంటి పేలుళ్లు, ప్రమాదాలు జరుగుతాయోనని నిత్యం ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంతోపాటు చుట్టుపక్కల విస్తరించిన అనేక భారీ పరిశ్రమల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ముఖ్యంగా 50 రసాయనిక, ఫార్మా కంపెనీలు, 40 ఎల్పీజీ, గ్యాస్, పెట్రో పరిశ్రమల నుంచి వెలువడే ఘాటైన రసాయనిక వాసనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయనిక, పెట్రోకెమికల్ పరిశ్రమల పరిస్థితి మరీ ఘోరంగా కనిపిస్తోంది. అన్నీ లోపాలే... పరిశ్రమల్లో ప్రమాదకరమైన అగ్ని ప్రమాదాలకు జిల్లా చిరునామాగా మారుతోంది. నగరంతోపాటు, చుట్టుపక్కల హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీ, బ్లాక్అయిల్ ప్లాంట్, డాక్‌యార్డ్, కోరమండల్ వంటి రసాయన, గ్యాస్ ఆధారిత కంపెనీలతో పాటు, ఫార్మా, ఎస్ఈజెడ్లు, ఫార్మాసిటీలోని పలురకాల బల్క్ డ్రగ్స్, రసాయనిక పరిశ్రమలు న్నాయి. ఎల్పీజీ బాట్లింగ్ యూని ట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలా జిల్లాలో రసాయనిక, ఫార్మా కంపెనీలు, ఎల్పీజీ, గ్యాస్, పెట్రో ఆధారిత, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కలిపి మొత్తం 90 భారీ పరిశ్రమలు అత్యంత సున్నితమైనవీ ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు కనీస భద్రతా చర్యలు చేపట్టడంలేదనడానికి తరచూ చోటు చేసుకొంటున్న అగ్ని ప్రమాదాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రమాదం జరిగితే నివారణకు పరికరాలు, తగిన యంత్రాంగం, ప్రాథమిక చికిత్సకు కావలసిన సౌకర్యాలు వంటివేం లేవని అధికారులు గతంలోనే తేల్చారు. మరో 11 భారీ పరిశ్రమలైతే అసలు నిర్వహణకు ఏమాత్రం తగవని నిర్దారించారు. ప్రమాదకరమైన కంపెనీలకు 123 రకాల ప్రశ్నలతో జాబితా తయారుచేసిన అధికారులు నాలుగేళ్ల క్రితం 90 కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తే అందులో సగానికిపైగా కంపెనీలు అసలు నిర్వహణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ కంపెనీల నిర్లక్ష్యం ఫలితంగా వీటిలో ఏ చిన్న అగ్నిప్రమాదం జరిగినా రసాయనాలు గాల్లో కలవడంతోపాటు సులువుగా మంటలు వ్యాపించి జనావా సాలకు తీవ్రస్థాయిలో హానికలిగిస్తాయి. ఫలితంగా నగరంతోపాటు, గాజువాక, అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం సంభవించినా జిల్లా మొత్తం వణికిపోతోంది. ఉలిక్కిపడే ఘటనలు కొన్ని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీలో 1997లో చోటు చేసుకున్న భారీ ప్రమాదం గుర్తుకొస్తే విశాఖ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. నాటి ప్రమాదంలో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇదే సంస్థలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 2013 మేలో లంకెలపాలెం గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం విశాఖ జిల్లావాసులను కుదిపేసింది. ఒక రసాయన పౌడరు నీటిలో పడటంవల్ల సంభవించిన ఈ ప్రమాదంలో ఆ కంపెనీ మొత్తం బూడిదైన విషయం తెలిసిందే. 2013 ఏప్రిల్ 7న హెరిటేజ్ కంపెనీ విస్తరణ పనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని భారీగా ప్రాణనష్టం సంభవించేలా చేశాయి. 2013 ఆగస్టులో హెచ్పీసీఎల్లో జరిగిన విస్పోటనం ఒక్కసారిగా జిల్లా ప్రజలను కలవరపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014 జూన్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడులో 19 మంది అధికారులు, ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌లో దువ్వాడ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ డీజిల్స్ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 12 బయో డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడంతో విశాఖ వాసులు భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే. గతేడాది మేలో ఫార్మాసిటీలోని శ్రీకర్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు. నవంబరు 10న లారస్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా ఇద్దరి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబర్లో ఎస్విఆర్ డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన మరో ప్రమాదంలో గ్యాస్ లీకైన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గతేడాది జనవరిలో పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్ కెమికల్స్ కర్మాగారంలో ఇద్దరు దుర్మరణం పాలవగా 26 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా లంకెలపాలెం అజికో బయో ఫోర్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి విశాఖపట్నం : ఔషధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన పరిశ్రమల శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్ ఫార్మాసిటీలో అజికో పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, కార్మిక నాయకుడు కన్నూరు వెంకటరమణలు ఆరోపించారు. కొత్త బ్లాక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే యాజమాన్యం ట్రయల్ రన్ చేపట్టడడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలను పాటించని యాజమాన్యంపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.