వరుస ప్రమాదాలతో భయపెడుతున్న పరిశ్రమలు
భద్రతా ప్రమాణాలు పాటించని సంస్థలు
విశాఖ సిటీ: పరిశ్రమల్లో నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మిక లోకానికి గుబులు పుట్టిస్తున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పా.. అధికార యంత్రాంగం పరిశ్రమలపై దృష్టిపెట్టిన సందర్భాలు ఉండడంలేదు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన భద్రతా ప్రమాణాలు ఇప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు పరిశ్రమల భద్రతపై ఒక్కసారి కూడా సమీక్షించిన సందర్భాల్లేవు.
20 పాయింట్ ఫార్ములా ఏమైంది?
2020, మేలో ఎల్‌జీ పాలీమర్స్ ఘటన తరువాత అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక నియమ, నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి అన్ని రకాల పరిశ్రమల్లో తనిఖీలు చేయించింది. ఇందులో ఉమ్మడి విశాఖలోని 121 పరిశ్రమల్లో లోపాలున్నట్లు గుర్తించింది.
భద్రతా ప్రమాణాలు పాటించని ఆయా సంస్థలకు నోటీసులు జారీచేయడంతో పాటు 29 పరిశ్రమలపై కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితులు మరోసారి తలెత్తకుండా పరిశ్రమల్లో ప్రమాదాలను తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ‘20 పాయింట్ ఫార్ములా’ను అమలులోకి తీసుకొచ్చింది. అందులో ఉన్న అంశాలకు పాయింట్లు కేటాయించారు. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆ సంస్థ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిగణించాల్సి ఉంటుంది.
కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు వరకు ప్రతి ఏడాది ఈ ఫార్ములా ప్రకారం అధికారులు తనిఖీలు నిర్వహించి పాయింట్లు కేటాయించారు. అయితే, ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ 20 పాయింట్ ఫార్ములాను పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment