ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కనీస భద్రత ప్రమాణాలు పాటించుకుండా ఆస్పత్రి భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో చాలా మేరకు ప్రయివేటు ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. 2011లో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వంద మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం, డయాగ్నోస్టిక్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్పత్రి ముందు భాగంలోని వెలివేషన్‌కు నిప్పు అంటుకుంది. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, రోగులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోగుల ప్రాణాలు కాపాడే కేంద్రాలే నిబంధనలు పాటించక ప్రాణాల్ని హరించుకుపోతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యం అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో అంతే..
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఎంత వరకు భద్రత ఉందనేదానికి సమాధానం లేదు. ఎందుకంటే జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ అగ్నిప్రమాదాలను నిలువరించేందుకు కనీస పరికరాలు లేవు. ఆస్పత్రులకు అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కూడా ఏమాత్రం కానరా>వడం లేదు. జిల్లాలో దాదాపు 50కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వారినుంచి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ.. ఆస్పత్రుల యాజమాన్యాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం శోఛనీయం. 50 పడకలు అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చిన్న ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇరుకు సందుల్లో సైతం వాటిని నిర్వహిస్తూ రోగుల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేస్తున్నారు కానీ వారికి ఎలాంటి ప్రాణ రక్షణ కల్పించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు నిర్మించేటప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా నో ఆబక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ ఈ సర్టి ఫికెట్ కోసం ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తులు చేసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రమాదం జరిగితే..
నిబంధనలు పాటించకుండా ఉన్న ఆస్పత్రుల్లో, బహుళ అంతస్తుల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరం. చాలా ఆస్పత్రుల్లో కేవలం ఒకే ఒక మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది. కొన్నింట్లో ఒకే లిఫ్ట్ ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగితే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లిఫ్ట్ పని చేయకపోతే ఒకే ఒక మెట్టు మార్గంద్వారా రోగులను, సహాయకులను బయటకు ఎలా తరలిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేంత స్థలం కూడా చాలా ఆస్పత్రుల పరిసరాల్లో ఉండడం లేదు. ఈ మంటలు పక్క భవనాలను వ్యాపించేలా ఆస్పత్రుల నిర్మాణం ఉంది. బయటి వెంటిలేషన్ లోపలికి వెళ్లకపోగా ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలూ లేకపోలేదు.
పట్టించుకోని వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు..
జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదాలకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు చేయలేదు. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధలనకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా చాలా ఆస్పత్రులు నడుపుతున్నారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
15 మీటర్లు దాటితే మా పరిధిలోకి వస్తాయి..
15 మీటర్లు దాటి భవనాలు నిర్మిస్తే మా పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తే వారు కోర్టుకు వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో 12 మీటర్ల లోపు ఉన్న ఆస్పత్రులే ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉంటే ప్రమాదాలు జరిగితే నివారించవచ్చు. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రం ఎన్ని మీటర్లతో సంబంధం లేకుండా కోర్టులో కేసు వేస్తాం. రోగులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కల్పించుకోవాలి. – సందన్న, డివిజినల్ ఫైర్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment