జగతి మెచ్చేలా.. జనం నచ్చేలా!
- మెట్రోపొలిస్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి
- నగరం ముస్తాబు
- ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు
- అతిథులకు పూర్తి స్థాయి భద్రత
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. దీని కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమవారం నుంచి జరిగే మెట్రోపొలిస్ సదస్సు కోసం రహదారులు కొత్తరూపు సంతరించుకున్నాయి. వేదికకు వెళ్లే దారి పొడవునా వెలసిన స్వాగత తోరణాలు అతిథులను రా..రామ్మని ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. అతిథులను ఆకర్షించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం తల మునకలవుతోంది. ఇలాంటి సదస్సులు కొత్త కాకపోయినా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొట్ట తొలిగా నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం కావడంతో ప్రభుత్వ, అధికార వర్గాలు దీన్ని సవాలుగా తీసుకున్నాయి.
ప్రజలు కూడా ఈ సదస్సు నిర్వహణ తీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల అధికారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 125 కి.మీ.ల పరిధిలో రహదారుల అభివృద్ధి, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలు పూర్తి చేశారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా... నగరం గొప్పదనాన్ని గుర్తించేలా అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విమానాశ్రయం నుంచి అతిథులు తమకు కేటాయించిన హోటళ్లకు వెళ్లేంతవరకు వారిని సురక్షితంగా చేర్చేందుకు దాదాపు 130 మంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. అతిథులతో మెలగాల్సిన తీరుపై వారికి శిక్షణ నిచ్చారు. ఏర్పాట్ల వివరాలను శనివారం హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అతిథులు పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాజంక్షన్ల అభివృద్ధి పనులు చేసినట్టు వారు చెప్పారు.
మెట్రో రైలు మార్గాల్లోనూ ట్రాఫిక్ చిక్కులు ఎదురవకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు విమానాశ్రయంలో.. హోటళ్ల వద్ద క్యూలలో వేచి ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరిం చారు. ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు స దస్సు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన సదస్సును 7న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వారు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయు డు, తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.