His Team Working On Parking Solutions And Welcome Inputs: Minister KTR - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పార్కింగ్‌ పరేషాన్‌! కేటీఆర్‌కు ట్వీట్‌.. ఇలా చేస్తే బెటర్‌!

Published Wed, Aug 2 2023 7:10 AM | Last Updated on Wed, Aug 2 2023 10:45 AM

- - Sakshi

హైదరాబాద్: గ్రేటర్‌ నగరంలో పార్కింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేటు వ్యక్తుల ఖాళీ స్థలాల్లో పార్కింగ్‌ సదుపాయానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్‌ అని, షాపింగ్‌ ప్రాంతాల్లో మల్టీలెవెల్‌ పార్కింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని పౌరుడొకరు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. అందుకు స్పందిస్తూ మంత్రి దేశంలోని అన్ని నగరాల్లోనూ పార్కింగ్‌ సమస్య పరిష్కారం ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని పేర్కొన్నారు.

నగరంలో రెండు మల్టీలెవెల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సులను నిర్మిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవని ఇంకా చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకోసం కొత్తగా రానున్న మెట్రో మార్గాల్లో విశాలమైన పార్కింగ్‌ ప్రదేశాలతో ‘పార్క్‌ అండ్‌ రైడ్‌’ పద్ధతికి ప్రయత్నిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఖాళీ స్థలాలు, ఖాళీ ప్లాట్ల యజమానులు స్థానిక మున్సిపల్‌ అధికారులతో కలిసి తమ స్థలాలను పార్కింగ్‌ లాట్లుగా మార్చుకుంటే వారికి ఆదాయం కూడా లభిస్తుందని, ఈ దిశగానూ ఆలోచిస్తున్నామని తెలిపారు.

అప్పట్లో కొరవడిన స్పందన..
► 
గతంలోనూ దాదాపు అయిదేళ్ల క్రితం నగరంలోని ఖాళీ ప్లాట్లు, స్థలాల యజమానులు వాటిని పబ్లిక్‌ పార్కింగ్‌ ప్రదేశాలుగా మార్చుకుంటే వారికి ఆదాయంతో పాటు ప్రజలకు పార్కింగ్‌ సమస్యలు తగ్గుతాయని కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ అందుకు పిలుపునిచ్చినా ప్రైవేటు యజమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు.

దాదాపు 15 మంది మాత్రం స్పందించి, అధికారులను సంప్రదించినప్పటికీ, ఇద్దరు మాత్రం ముందుకొచ్చారు. వారిలో ఒకరికి స్థలంపై యాజమాన్య హక్కులు లేవని అధికారులు గుర్తించారు. స్థలాలపై తగిన హక్కులు లేకపోవడం.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అదే తమ స్థలంగా చెబుతూ కొందరు ముందుకు రావడం తదితర కారణాలతో ప్రైవేట్‌ పార్కింగ్‌ సదుపాయాలపై జీహెచ్‌ఎంసీ శ్రద్ధ చూపలేదు.

తాజాగా మంత్రి కేటీఆర్‌ మళ్లీ ఈ ఆలోచన చేయడంతో, జీహెచ్‌ఎంసీ తిరిగి ప్రయత్నాలు చేస్తే ఈసారైనా ఆశించిన ఫలితం కనిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. తగినన్ని ప్రైవేట్‌ పార్కింగ్‌ స్థలాలు వినియోగంలోకి వస్తే వాటిని జియోట్యాగింగ్‌ చేయడంతో పాటు మొబైల్‌ యాప్‌ ద్వారా ఎన్ని వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ఉందో తెలుసుకోవడంతోపాటు అడ్వాన్సుగా కూడా పార్కింగ్‌ స్థలాన్ని రిజర్వు చేసుకునే సదుపాయం కూడా కల్పించవచ్చునని అప్పట్లో భావించారు.

వాహనాల పార్కింగ్‌ ఫీజులను సైతం జీహెచ్‌ఎంసీయే ఖరారు చేసింది. కార్లు తదితర నాలుగుచక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 20, తర్వాత ప్రతీ గంటకు రూ.5గా నిర్ణయించారు. ద్విచక్రవాహనాలకు మొదటి రెండు గంటలకు రూ.10, తర్వాత ప్రతి రెండు గంటలకు రూ.5గా నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement