హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.426 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు చౌరస్తాలో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తీరుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా వెళ్లే వాహనాదారులకు ఇది ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు.
ఎటువంటి రోడ్డు వెడల్పు లేకుండా దుకాణాదారులకు నష్టం కలిగించకుండా అనుకున్న సమయానికి స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెట్రో ట్రైన్ మీదుగా అత్యంత ఎత్తు నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం స్టీల్ మాత్రమే ఉపయోగించి నిర్మించినట్లు తెలిపారు. ఇది నగరానికే తలమానికమని ఆయన కొనియాడారు. కాగా.. స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం తొలి హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి పని చేశారని, స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు జారీ చేయనుందన్నారు. నాయిని నరసింహారెడ్డి సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించారన్నారు. అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment