విశ్వమంత ఆశ
*బడ్జెట్ కేటాయింపులకు ఎదురుతెన్నులు
* మౌలిక వసతులకు ప్రాధాన్యం
* నిధులు కావాలని నివేదన
* రూ.5066 కోట్లతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి ప్రతిపాదనలు
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా గ్రేటర్ సిటీ... రాజధాని హైదరాబాద్ నగరం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాట ఇది. మహా నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలంటే ప్రధానంగా కావాల్సినవి మౌలిక వసతులు. తీరైన రహదారులు... అందరికీ తాగునీరు... మెరుగైన పట్టణ ప్రణాళిక... స్మార్ట్‌సిటీ నిర్మాణం దిశగా పయనం... ఇటీవల మెట్రోపొలిస్ సదస్సులోనూ అందరిదీ ఇదే మాట. ఆ దిశగా గ్రేటర్ నగరాన్ని తీర్చిదిద్దాలంటే కావాల్సినది బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సాయం.
మహానగర అభివృద్ధి... మౌలిక సదుపాయాల కల్పనలో కీలక భూమిక పోషించే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి తాజాబడ్జెట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నాయి. జీహెచ్‌ఎంసీ రూ.1093 కోట్లు.. హెచ్‌ఎండీఏ సుమారు రూ.2200 కోట్లు... జలమండలి రూ.1773 కోట్లు... మొత్తంగా రూ.5066 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. తాజా బడ్జెట్‌లో కేటాయించే నిధుల పైనే మహానగరంలో వసతుల కల్పన, స్మార్ట్‌సిటీ నిర్మాణం వైపు అడుగులు పడతాయన్నది సుస్పష్టం. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సిటీజనుల ఆశలను, సర్కారు విభాగాల అంచనాలను ఎంతమేరకు చేరుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.