సాక్షి, సిటీబ్యూరో:
రాజధాని వీధుల్లో చెత్తాచెదారం కుప్పలు పడుతోంది. ‘గ్రేటర్’ నగరాన్ని చెత్త ముంచెత్తుతోంది.. చర్చలు ఫలించలేదు. పారిశుద్ధ్య కార్మికులు విధులకు రాలేదు. చెత్త తరలింపు వాహనాలు కదల లేదు. డంపర్‌బిన్ల నుంచి.. ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచీ చెత్త తరలింపుపనులు జరుగలేదు. దీంతో రె ండో రోజైన మంగళవారం సైతం గ్రేటర్‌లో ఎక్కడి చెత్త అక్కడే పోగు పడి పరిస్థితులు పరమ అధ్వానంగా మారాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా.. ప్రజారోగ్యం దృష్ట్యా జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు కార్మిక సంఘాల నేతలతో మంగళవారం సైతం చర్చలు జరిపారు. తమ డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో.. చెత్త తరలింపు సమస్య జటిలంగా మారనుంది. ఇప్పటికే పెరిగిపోయిన చెత్తకుప్పలతో కాలనీలు, బస్తీలలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, మలేరి యా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడే కుంటుపడటంతో పరిస్థితి ఏమిటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంటువ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్యం కోసం సమ్మె విరమించాలని కోరగా.. కార్మికసంఘాల నేతలు ససేమిరా అనడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.
రాష్ట్రస్థాయిలోని కార్మిక సంఘాలు మునిసిపల్ అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెకు తాత్కాలికంగా విరమణ ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ.. జీహెచ్‌ఎంసీలోని ప్రధాన యూనియన్ అయిన బీఎంఎస్ మాత్రం గ్రేటర్‌లో సమ్మె కొనసాగింపునకే నిర్ణయించింది.
మరోవైపు, జీహెచ్‌ఎంసీలోని గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ సైతం మంగళవారం నుంచి సమ్మెలోకి దిగింది. తాము గతంలో ప్రభుత్వానికిచ్చిన తమ డిమాండ్ల పత్రంలో ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతామని తెలిపామని, డిమాండ్లు పరిష్కారం కానందున సమ్మెకు దిగినట్లు యూనియన్ అధ్యక్షుడు యు.గోపాల్ తెలిపారు. అన్ని సంఘాలను కూడా తమతో ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా లేఖలు పంపినప్పటికీ, వాటినుంచి సానుకూలత వ్యక్తం కానందున తాము ఒంటరిగానే దీక్షలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో 108 రోజులపాటు నిరాహార దీక్షలు చేసిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే దాకా ప్రస్తుత దీక్షలు కొనసాగిస్తామన్నారు.
కమిషనర్ బదిలీతో పరిస్థితి గందరగోళం..
కార్మిక సంఘాల నేతలతో సమావేశానంతరం చేపట్టాల్సిన చర్యల గురించి మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీల ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కృష్ణబాబు చర్చలు జరుపుతుండగానే ఆయన బదిలీ విషయం తెలిసింది. మంగళవారం సాయంత్రం నుంచి తక్షణ ప్రత్యామ్నాయ చర్యలకు కమిషనర్ ఆదేశించినప్పటికీ, ఆయన బదిలీతో గందరగోళం ఏర్పడింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కార్మిక సంఘాలకు నచ్చజెప్పేందుకు అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అన్ని రకాలుగా సహకరిస్తామని అన్ని పార్టీల నాయకులు మేయర్, కమిషనర్లతో జరిగిన సమావేశంలో తె లిపారు.
సమస్య జటిలం..
చెత్త తరలింపు కోసం తాత్కాలికంగా ఇతరులను పనుల్లోకి తీసుకున్నప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోవడమే కాక కార్మికుల నుంచి మరి న్ని అదనపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు దోమల నివారణ, తదితర విభాగాల్లోని కార్మికులు కూడా సమ్మెలో ఉండటంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. సోమ, మంగళవారాల్లో వెరసి దాదా పు 72 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఎక్కడికక్కడే కుప్పలుగా పేరుకుపోవడంతో, దుర్వాసన భరించలేక ప్రజలు సతమతమవుతున్నారు. ఉద్యోగులను కూడా యూనియన్ల నేతలు జీహెచ్‌ఎంసీ నుంచి బయట కు రప్పించారు. జీహెచ్‌ఎంఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
‘చెత్త’సిటీ!
Published Wed, Oct 23 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement