గ్రేటర్‌కు లండన్ లుక్
‘థేమ్స్’ తరహాలో గ్రేటర్ వాటర్‌గ్రిడ్
రూ. 13 వేల కోట్ల వ్యయంతో ప్రాథమిక అంచనాలు
తీరనున్న పానీ పరేషాన్
నేడు గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌పై సీఎస్ సమక్షంలో కీలక సమావేశం
సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి లండన్ లుక్ రానుంది. విశ్వనగరంగా భాసిల్లుతోన్న లండన్ మహానగరంలోని థేమ్స్ నది చుట్టూ ఉన్న వాటర్ గ్రిడ్ తరహాలో ఇక్కడ కూడా గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ. 13 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేస్తోంది. లండన్‌లో 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండగా.. గ్రేటర్‌లో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ సుమారు 160 కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటు కానుంది. ఇది ఏర్పాటైతే నగరంలో నీటి సమస్య కూడా పరిష్కారమవుతుంది. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల నీటిని సమగ్ర నీటి సరఫరా వ్యవస్థ ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేసే(గ్రిడ్) ఏర్పాటుపై జలమండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇపానెట్ సాఫ్ట్‌వేర్‌లో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటు, సుమారు 60 చోట్ల నోడ్స్‌ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు అధిక సంఖ్యలో బల్క్ నీటి సరఫరా నల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన, సాంకేతిక సర్వే కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు కోరేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు సమాచారం.
నేడు సీఎస్ సమక్షంలో కీలక భేటీ
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రిడ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమక్షంలో సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఇందులో గ్రిడ్ లక్ష్యం, ప్రాధాన్యతలు, అంచనా వ్యయాలు, ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.
ముఖ్యాంశాలివీ...
సుమారు వెయ్యి చదరపు కి.మీ పరిధిలో 160 కి.మీల మేర ఏర్పాటు కానున్న గ్రిడ్‌కు అంచనా వ్యయం రూ. 13 వేల కోట్లు. ఈ నిధులతో నగర శివార్లు, ఔటర్ పరిసరాలు, గ్రామ, నగర పంచాయతీలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లకు నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, హెడ్‌వర్క్స్ పనులు, నీటి పంపిణీ చేసే భారీ పైప్‌లైన్స్ (రింగ్‌మెయిన్స్), నగరంలో అంతర్గత నీటి సరఫరా కోసం (రేడియల్ మెయిన్స్) పైప్‌లైన్‌లు ఏర్పాటు.
గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి సేకరిస్తున్న నీటిని రింగ్‌మెయిన్స్ ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేయవచ్చు. ఎక్కడ కొరత ఉంటే అక్కడికి నీటి మళ్లించడం ఈ గ్రిడ్‌తో సాధ్యం.నగరం నలుమూలలకు డిమాండ్‌ను బట్టి నీటి సరఫరా సాధ్యపడుతుంది. సమగ్ర నీటి సరఫరా నెట్‌వర్క్(ఇంటిగ్రేటెడ్ సోర్స్ ట్రాన్స్‌మిషన్ సిస్టం)ను ఏర్పాటు చేయవచ్చు.
నిత్యం సుమారు 730 మిలియన్ గ్యాలన్ల నీటిని మహానగరానికి సరఫరా చేయవచ్చు. ప్రస్తుతం నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది.నగరం నలుమూలలకు నీటి కనెక్షన్ల మంజూరుకు వీలుంటుంది.నగరంలో త్వరలో సుమారు 205 చదరపు కి.మీ పరిధిలో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)కు నిరంతరాయంగా నీటిని సరఫరా చేయవచ్చు. ఉప్పల్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పోచారం, ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ ప్రాంతానికి తాగునీటి కొరత తీర్చవచ్చు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలకు నీటికొరత ఉండదు. ఔటర్ చుట్టూ ఏర్పాటు కానున్న ఈ గ్రిడ్‌లో సరఫరా అవుతున్న నీటిని స్కాడా విధానంతో ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించవచ్చు. అక్రమ కుళాయిల ఊసే ఉండదు.
మురుగు నీటిపారుదల వ్యవస్థ అత్యవసరం
గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌తోపాటు ఆయా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ(డ్రైనేజీ)ను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో నగరాన్ని మురుగు ముంచెత్తుతుంది. గ్రిడ్ ద్వారా సరఫరా చేసిన నీటిలో తిరిగి 80 శాతం వరకు నీరు డ్రైనేజీలో కలుస్తుందన్నది అక్షర సత్యం. అందుకే డ్రైనేజీ వసతులు అత్యవసరం. లేనిపక్షంలో మురుగునీరంతా సెప్టిక్ ట్యాంకులు, నాలాలు, చెరువుల్లో చేరి అక్కడి నుంచి మూసీలోకి చేరి నగరం మురికికూపంగా మారే అవకాశం ఉంది. వాటర్‌గ్రిడ్‌తోపాటు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు గ్రిడ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం.
- టి.హనుమంతరావు,
నీటిపారుదల రంగ నిపుణుడు