ఇల్లు.. నిల్లు.. | Within the market, the selection of beneficiaries | Sakshi
Sakshi News home page

ఇల్లు.. నిల్లు..

Published Sat, May 31 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM

ఇల్లు.. నిల్లు..

ఇల్లు.. నిల్లు..

  •      అర్ధంతరంగా మాయమైన ‘వాంబే’
  •      పదేళ్లుగా పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక
  •  సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో దాదాపు పది లక్షల మంది సొంత ఇళ్లు లేక అల్లాడుతున్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేదలే ఎక్కువ. ఇలాంటి పేదల కోసం ప్రభుత్వాలు పలు గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. వేటినీ సవ్యంగా పూర్తి చేయకపోవడంతో పేదల సొంతగూడు కల నెరవేరడం లేదు.

    ఆరంభ శూరత్వంగా ప్రారంభమై, అవాంతరాలతో మధ్యస్తంగా నిలిచిపోయిన పలు గృహనిర్మాణ పథకాల్లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) ఒకటి. దాదాపు దశాబ్దం క్రితమే ఈ పథకం ప్రారంభించినప్పటికీ, నేటికీ లబ్ధిదారుల ఎంపికే పూర్తికాని దుస్థితి. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త సర్కారు హయాంలోనైనా పేదల సొంతగూటి కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.
     
    దశాబ్దం కిందట ప్రారంభమైనా..
     
    దాదాపు దశాబ్దం క్రితం పేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6,036 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో 19 కాలనీల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ.92.30 కోట్లు ఖర్చు కాగలదని అప్పట్లో అంచనా వేశారు.

    ఇందులో రూ. 80.86 కోట్లు గృహనిర్మాణాలకు కాగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.44 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అనంతరం ఆ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జీహెచ్‌ఎంసీకి బదలాయించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం.. ఎంపికైన లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించకపోవడం.. లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడం.. తదితర కారణాలతో ఈ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది.

    పథకం అమలుపై శ్రద్ధ చూపేవారు కరవై పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కొన్ని కాలనీల్లో పూర్తయిన ఇళ్లు ఆక్రమణల పాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల స్థానే థర్డ్‌పార్టీలు చేరాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టిం చుకునే అతీగతీ లేకుండా అసంపూర్ణంగా మిగిలాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులే చేరినప్పటికీ.. చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించలేదు. మొత్తానికి పథకం నిష్ర్పయోజనమైంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement