సిటీ నెం.1
♦ ‘దుమ్ము’ దులిపిన నివేదిక
♦ ధూళిలో గ్రేటర్‌దే అగ్రస్థానం
♦ కాలుష్య నియంత్రణ మండలి
♦ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి మాట ఏమోగానీ... దుమ్ము, ధూళి కాలుష్యంలో గ్రేటర్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేకమంది ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు ధూళి కాలుష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహా నగరంలో రోజుకు 11.9 టన్నుల ధూళి కాలుష్యం వెలువడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఆరు మహా నగరాలు... హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, పాట్నా, షోలాపూర్‌లలో కాలుష్యంపై సీపీసీబీ ఇటీవల అధ్యయనం చేసింది. దీనిలో గ్రేటర్ సిటీఅగ్రస్థానంలో ఉంది. ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీనగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించుతోందని కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి.
కారణాలివే...
♦గ్రేటర్‌లో మొత్తం 43 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి సిటీ నెం.1
ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో ధూళి కాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది.
♦ మెట్రో పనుల నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల కోసం తవ్వినపుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలుస్తున్నాయి.
♦నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో కాలుష్యం పెరుగుతోంది.
♦జలమండలి, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తి చేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి.
♦పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
♦వాహనాల వేగానికి రహదారులపై లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగతోనూ ధూళి కాలుష్యం పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రాంతాల్లోనే కాలుష్యం అధికం
♦పంజగుట్ట, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులార్ మ్యాటర్) ప్రమాణాలు నమోదయ్యాయి.
♦కొన్నిచోట్ల నెలకు సగటున క్యూబిక్ మీటర్‌కు 150 మైక్రోగ్రాముల ఆర్‌ఎస్‌పీఎం చేరుతోంది.
♦కొన్ని సందర్భాల్లో ఘనపు మీటరు గాలిలో 250- 300 మైక్రోగ్రాములకు ఆర్‌ఎస్‌పీఎం చేరుకుంటోంది.
అనర్థాలివీ...
♦ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాస కోస సంబంధ వ్యాధులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి.
♦ఆస్తమా, బ్రాంకైటీస్, హై బీపీ, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం వంటివ్యాధులతో జనం సతమతమవుతున్నారు.
♦నగరంలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో 90 శాతానికి పైగా ధూళి కాలుష్యం బారిన పడుతున్న వారేనని వైద్యులు చెబుతున్నారు.