పట్టపగలే చిమ్మచీకట్లు
నగరవాసులకు వింత అనుభూతి
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో శుక్రవారం వాతావరణం స్థానికులకు వింత అనుభూతి మిగిల్చింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపగా, సాయంత్రం గాలి దుమ్ము, ధూళితోపాటు ఉరుములతో కూడిన వానజల్లుపడింది. దీంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది. గాలిదుమ్ము ప్రభావం తో సాయంత్రం ఐదు గంటల సమయానికే చిమ్మచీకట్లు అలుముకున్నాయి. వాతావరణమంతా ధూళిమయం కావడంతో సాయంత్రం కార్యాలయం నుంచి ఇళ్లకు బయల్దేరినవారు అందులో చిక్కుకుపోయారు.
గాలి బలంగా వీయడంతో కొన్నిచోట్ల చెట్లకొమ్మలు నేలకూలాయి. పాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 46, కనిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. రాజస్థాన్‌లో మూడు రోజులుగా వడగాడ్పులు వీస్తున్నాయని, దీని ప్రభా వం కారణంగా ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గొచ్చని, అయితే వచ్చే నెల రెండో తేదీ మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం డైరక్టర్ ఎం.దొరైస్వామి చెప్పారు. ఇదిలాఉంచితే ఎండతీవ్రతతో పాటు విద్యుత్ కోత కూడా నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది.
మెట్రో రైలుసేవలకు అంతరాయం
దుమ్ముధూళితో కూడిన బలమైన గాలు లు వీయడంతో మెట్రో రైలుసేవలకు సైతం అంతరాయం కలిగింది. దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఎక్కడి రైళ్లు అక్కడే నిలి చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని డీఎంఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అంజుదయాళ్ వెల్లడించారు. బలమైన గాలుల ధాటికి పైపులు, ఇతర ఇనుప సామగ్రి జనక్‌పురి, ఇందర్‌లోక్ తదితర స్టేషన్లలోని ఓవర్‌హెడ్ తీగలపై పడడంకూడా మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించింది.
ఏదిఏమైనప్పటికీ సాయంత్రం ఆరు గంటల సమయంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ విషయమై కృతి మిస్త్రీ అనే ఓ ప్రయాణికుడు మాట్లాడుతూ జనక్‌పురి స్టేషన్‌లో దాదాపు గంటపాటు రైలు కోసం ఎదురు చూడాల్సి వచ్చిందన్నాడు. సేవలను పునరుద్ధరించినప్పటికీ తొలుత వచ్చిన రెండు రెళ్లలో ఎక్కలేకపోయానని, ఇందుకు కారణం అవి కిక్కిరిసిపోవడమేనని వివరించాడు.