ఉక్కరి బిక్కిరి
- జిల్లాలో అసాధారణ వాతావరణం
- వేడిగాలులకు జనం అవస్థలు
- తేమ శాతం పెరగడంతో ఉక్కపోత
- విద్యుత్ కోతలతో మరిన్ని ఇబ్బందులు
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : అసాధారణ వాతావరణంతో జిల్లావాసులు ఆదివారం ఉడికిపోయారు. వేసవి ఎండ ల్లో సైతం పడలేని ఇబ్బందికి గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడ్డారు. ఉష్ణోగ్రత చెప్పుకునే స్థాయి లో లేకపోయినా, ఎండ ప్రభావం చూపకపోయినా విపరీతంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకపక్క విద్యుత్ కోత.. మరో పక్క ఉక్కపోత రెండూ కలిసి జిల్లా ప్రజలకు కంటిపైకునుకు లేకుండా చేశాయి.
రెండురోజుల నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దట్టంగా మేఘాలు కమ్ముకోవడంతో వాతవరణం చల్లబడింది. దీంతో కొంచెం ఉపశమనం లభించిందని సంతోషపడ్డలోపే తీవ్రమైన ఉక్కపోత ఊపిరి తీసుకోనీయడం లేదు. దీనికంతటికి వాతావరణంలో తేమశాతం విపరీతంగా పెరిగిపోవడమే కారణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా తేమశాతం 40నుంచి 45 మధ్య ఉంటే చల్లని గాలితో వాతావరణం పొడిగా ఉంటుంది.
ఉక్కపోత సమస్య ఉండదు. కానీ తేమశాతం 75 నుంచి 88 వరకు పెరిగిపోయింది. దీని వల్లే తీవ్రమైన ఉక్కపోతని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో కూర్చున్నా గాలి లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోపక్క విద్యుత్ కోతలు కూడా జనానికి తీవ్ర అసౌకర్యంగా మారాయి. అసలే గాలిలేక అలమటిస్తోన్న పరిస్థితుల్లో విద్యుత్ లేక ఆపసోపాలు పడుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలు కూడా కరెంటు ఉండడం లేదు. దీంతో ఉక్కపోత మరీ పెరగడంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి వచ్చింది. శనివారం రాత్రి చిరుజల్లులు పడినా దాని ప్రభావం ఆదివారం ఏమీ కనిపించలేదు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మబ్బులతో ఉండి చల్లగా ఉన్నట్టే అనిపించింది. అయితే గాలి స్తంభించినట్టు అనిపించడంతో ప్రజలంతా ఉక్కపోతతో అల్లాడిపోవాల్సి వచ్చింది.
దడ పుట్టిస్తున్న రోహిణి
నర్సీపట్నం టౌన్: రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయి అన్న పెద్దలు మాటలు నిజమయ్యే విధంగా భానుడు ఎండ వేడిమి సృష్టిస్తున్నాడు. నర్సీపట్నంలో శని, ఆదివారాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రి వేళల్లోనూ గాలి ఎక్కువగా రాకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి భగభగలతో కూలర్లు,చల్లని గాలిని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బయట పనులకు వెళ్లే కార్మికులు కూడా ఇబ్బందులకు గురువుతున్నారు.
సాయంత్రం ఆరు గంటల వరకు వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో ప్రధాన రహదారుల్లో జన సంచారం లేక వెలవెలబోయాయి. వ్యాపారులు మధ్యాహ్న సమయంలో దుకాణాలు మూసి వేస్తున్నారు. ఈ ఏడాది చలివేంద్రాలు లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజలు తాగునీటికి అవస్థలు పడ్డారు.