
దేశంలోని పలుప్రాంతాల్లో రుతుపవనాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలోకి రుతుపవనాలు ప్రవేశించి, 20 రోజులకు పైగా సమయం గడిచినా గత కొద్ది రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు లేవు. ఊహించని విధంగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడికి పక్కనే ఉన్న తూర్పు యూపీలో ప్రతిరోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉండబోతున్నదనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు (శనివారం) చినుకులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండవచ్చు. శుక్రవారం నాటి ఉష్ణోగ్రత కంటే ఈరోజు రాజధానిలో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదుకానున్నదని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వారాంతంలోగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని పోర్‌బందర్ ప్రాంతమంతా జలమయమైంది. జూలై 22 వరకు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.