
ఒకవైపు వనరుల కొరత.. మరోవైపు అంచనాలలో లోపం.. ఇంకోవైపు ప్రకృతిలో మారుతున్న తీరుతెన్నులు.. ఇవన్నీ వాతావరణ శాఖ అధికారులను ఇబ్బందులకు గురిచేసి, రుతుపవనాలను సరిగ్గా అంచనావేయలేకపోయేలా చేస్తున్నాయా? ఈ సీజన్‌కు సంబంధించిన అంచనాల్లో అప్పుడప్పుడూ పొరపాట్లు తొణికిసలాడటం దీనికి ఉదాహరణగా నిలిచించిందా?
వాతావరణశాఖ ఇటీవలి కాలంలో జారీచేసిన అలర్ట్‌లు అంచనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. దీంతో జనం వాతావరణశాఖపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ శాఖపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతున్నదనే వాదన వినిపిస్తోంది. జూన్ 28న దేశరాజధాని ఢిల్లీలో రుతుపవనాలు ప్రవేశించిన రోజున రికార్డుస్థాయి వర్షపాతం కురుస్తుందని వాతావరణశాఖ ముందుగా ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆశాఖ అధికారులు వర్షపాతం అంచనాలు మార్చారు. ఇదేవిధంగా కొన్నిసార్లు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసి, వాటిని తిరిగి మారుస్తున్న సందర్భాలున్నాయి.
వాతావరణ శాఖ విడుదల చేసిన రుతుపవనాల అంచనాలు మునుపటి కంటే తక్కువ ఖచ్చితత్వంతో ఉన్నాయని గత గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. 2011 నుండి 2024 వరకు అంటే గత 14 ఏళ్లలో రుతుపవనాల అంచనాలు 96 శాతం ఖచ్చితమైనవనిగా రుజువు చేసిన ఏకైక సంవత్సరం 2022. మిగిలిన ఏళ్లలో ఇది 77 శాతం వరకూ నిజమయ్యింది. రుతుపవనాల ట్రెండ్‌లో మార్పు కారణంగా ఒకే నగరంలో రెండు విభిన్న పోకడలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడుతోంది.
వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. హిమాలయ పర్వతాలు ఆసియాలోని చల్లని గాలిని ఉత్తర భారతదేశ మైదానాలకు చేరుకోకుండా నిరోధిస్తాయి. రుతుపవనాలను కూడా ఆపుతాయి. ఇవి దేశానికి వర్షాలను తీసుకువస్తాయి. అయితే కొత్త మోడల్స్, రాడార్, రెయిన్ గేజ్‌ల సహాయంతో భవిష్యత్తులో వర్షాలు, రుతుపవనాల అంచనాలను మరింత ఖచ్చితంగా తెలుసుకునేందుకు వాతావరణశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.