సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొనసాగుతోంది.
కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది.
40 డిగ్రీలకు చేరువలో..
రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమవారం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసాగుతుందని, అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment