breaking news
SEGALU
-
మళ్లీ ఉక్కపోత..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణం మళ్లీ సెగలు కక్కుతోంది. కొద్దిరోజుల నుంచి ఉష్ణ తీవ్రత అధికమై పగటి పూట ఎండ చుర్రుమంటోంది. వర్షాకాలంలో ఇలాంటి వాతావరణం అరుదుగా కనిపిస్తుంది. మరోవైపు ఉష్ణతాపానికి ఉక్కపోత కూడా తోడవుతోంది. ఇది ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన తర్వాత రాష్ట్రంలో ఈ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంటోంది. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. ఎండ ఊపందుకుని సాయంత్రం వరకు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో తేలికపాటి జల్లులే తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. పైగా మేఘాలు కూడా అంతగా ఏర్పడటం లేదు. ఫలితంగా సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఎండల ప్రభావం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఆగస్టు మొదటి వారంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు వానలకు బదులు ఎండలు కాస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల్లో వర్షాలు కురిపించేటంత తేమ ఉండటం లేదు. దీంతో వానలకు ఆస్కారం ఉండకపోగా ఉక్కపోత కూడా ఇబ్బంది పెడుతోంది. 40 డిగ్రీలకు చేరువలో.. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో రికార్డవుతున్నాయి. సోమవారం బాపట్లలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. ఇంకా పలుచోట్ల 35నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణతీవ్రత కొనసాగుతుందని, అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వివరించింది. -
‘ఒప్పంద’ సెగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ‘ఒప్పంద’ సెగలు రగులుతున్నాయి. ఎన్నికల ముందు ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్ సహా పలు పదవులకు రెండున్నరేళ్లు ఒకరిని, మిగిలిన కాలానికి మరొకరిని నియమించేలా ఒప్పందాలు కుదిరాయి. రెండున్నరేళ్లు గడిచినా పదవుల్లో ఉన్నవారు తప్పుకోకపోవడంతో వారితో రాజీనామాలు చేయించేందుకు పార్టీ ముఖ్యులు సామదాన దండోపాయల్ని ప్రయోగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల పెనుగొండ ఎంపీపీ వివాదం తెరపైకి రాగా.. తాజాగా ఏలూరు ఎంపీపీ, జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఒప్పందాలు టీడీపీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. కుదరదంతే.. పెనుగొండ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు పల్లి జూలీ సురేఖ ససేమిరా అనడంతో తెలుగుదేశం పార్టీలో వివాదం రాజుకొంది. ఎంపీపీ పదవికి మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖ, అనంతరం చీకట్ల భారతి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. ఈ ప్రకారమే ఎన్నికల ఖర్చును ఇద్దరూ భరించాలని పెద్ద మనుషులు తీర్మానం చేయించారు. సురేఖ పదవీ కాలం జనవరి 4వ తేదీతో ముగిసింది. అయితే, డిసెంబర్ నెలలోనే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలసిన సురేఖ తాను ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. ఏలూరు ఎంపీపీ రాజీనామా విషయంలో ఎంపీపీ భర్త, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినటయగా పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించే స్థాయికి ఈ వివాదం వెళ్లింది. చింతమనేని ప్రభాకర్ ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు రూ.40 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. ‘దెందులూరు నియోజకవర్గంలోని అమాయక ప్రజల భయపడతారు కానీ.. ఏలూరు నగరంలో నీ ఆటలు సాగవు’ అంటూ చింతమనేనిని బహిరంగంగా హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవహారం కూడా ముదురుతోంది. ఈ పదవి కేటాయింపు విషయమై కుదిరిన ఒప్పందంలో తొలి గడువు ముగియడంతో.. వైఎస్ చైర్మన్ ఎన్నిక తెరపైకి వచ్చింది. 2014లో జెడ్పీ చైర్మన్ పదవి ముళ్లపూడి బాపిరాజుకు ఏకగ్రీవం అయినప్పటికీ ఉపాధ్యక్ష పదవిలో పోటీ ఏర్పడింది. ఈ పదవిని వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా జెడ్పీటీసీకి కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆకివీడు, బుట్టాయగూడెం జెడ్పీటీసీలు వైస్‌చైర్మన్ గిరీకోసం పోటీ పడ్డారు. మెట్ట ప్రాంతానికి చైర్మన్ పదవి వచ్చినందున, డెల్టా ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని అక్కడి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. 2014 జనవరి 4న ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలనే దానిపై చర్చించారు. చర్చల్లో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పట్టుదలతో రెండున్నరేళ్లు ఒకరికి, మరో రెండున్నరేళ్లు పదవిని కట్టబెట్టేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తన అనుచర వర్గానికి చెందిన బుట్టాయగూడెం జెడ్పీటీసీ చింతల వెంకట రమణకు పదవిని కేటాయించారు. ఈ ఏడాది జనవరి 5 తేదీ నాటికి ఆమె వైస్ చైర్మన్ పదవి చేపట్టి రెండున్ననేళ్లు పూర్తయ్యింది. దీంతో ఆకివీడుకు చెందిన జెడ్పీటీసీ మన్నే లలితాదేవి జెడ్పీ వైస్ చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఒప్పందం ప్రకారం తనకు రెండున్నరేళ్ల అనంతరం పదవిని కేటాయిస్తానని అప్పట్లో మాట ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రస్తుత జెడ్పీ వైస్ చైర్మన్ రాజీనామా చేయకపోవడంతో ఈ వ్యవహారం పార్టీలో ముసలం రేపే పరిస్థితి కనిపిస్తోంది.