![శిరోజాలకు ఆవ...](/styles/webp/s3/article_images/2017/09/2/41409159681_625x300.jpg.webp?itok=01G6xlXe)
శిరోజాలకు ఆవ...
అందం
దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపం.. చిన్నాపెద్దల్ని బాధిస్తున్నాయి. ఈ ప్రభావం శిరోజాల మీద పడడంతో అతిగా వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు ఉపశమనంగా కొన్ని జాగ్రత్తలు ఇంట్లోనే తీసుకోవచ్చు..
ఆవ నూనె
ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరుగుతుంది.
2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీని వల్ల వెంట్రుక పెళుసుబారి, తెగిపోకుండా బలంగా పెరుగుతుంది.
హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా రీ బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. కేశాలంకరణలో తప్పనిసరి అయితే, నిపుణుల సూచనలు పాటించాలి.
ప్రతిరోజూ వెంట్రుక పెరుగుదల ఉంటుంది. తాజా పండ్లు, బాదంపప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి, నీరు వెంట్రుక బలానికి, నిగనిగలాడుతూ పెరగడానికి దోహదం చేస్తాయి.
-గీతాంజలి ప్రియ, బ్యూటీషియన్