సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాల అమలే కాదు.. ఆఖరికి జనాభా లెక్కలు.. ఓటర్ల జాబితా వంటి వివరాలు సైతం అస్తవ్యస్తంగా మారాయి. అంకెల గారడీతో కాకిలెక్కలు చూపుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
జనగణన.. ఓటర్ల నమోదు కార్యక్రమాల కోసం ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేయాల్సిన సిబ్బంది ఇష్టానుసారంగా తమకిచ్చిన పనులు పూర్తిచేసి మమ అనిపించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌లోని జనాభా.. ఓటర్ల వివరాలను పోల్చిచూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఎన్నికల కమిషన్ అంచనా మేరకు జనాభాలో ఓటర్లు దాదాపు 70 శాతం వరకు ఉండవచ్చు.
నగరీకరణ, వలసల వంటి కారణాలతో గ్రేటర్ నగరంలో అది మరికొంత శాతం ఎక్కువుంటే ఉండవచ్చు. కానీ గ్రేటర్‌లోని శివారుల్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లు దాదాపు వంద శాతానికి చేరువలో ఉన్నారు. కోర్ సిటీ (పాత ఎంసీహెచ్)లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా 90 శాతం ఉన్నారు. అంటే.. జనగణనలోనైనా తప్పులు దొర్లి ఉండాలి.
లేదా ఓటర్ల గుర్తింపులోనైనా పొరపాట్లు జరిగి ఉండాలి. లేకుంటే ఓటర్లు 90 శాతం మేర ఉండటమన్నది అసాధారణమని సర్వేలపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. కోర్‌సిటీలో ఆయా నియోజకవర్గాల్లో మొత్తం 20,232 మంది ఓటర్లను డూప్లికేట్లుగా గుర్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం ఇటీవల వారి పేర్లను తొలగించింది. ఇంకా, వారు గుర్తించని డూప్లికేట్లు ఎందరున్నారో తెలియ దు.
జనాభాను బట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. వీటిల్లోనే తేడాలుండటంతో ఇక ఆయా పథకాల అమలు తీరు ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. పైన పేర్కొ న్న జనాభా వివరాలు 2011 నాటి జనగణన నాటివి కాగా.. ఓటర్ల వివరాలు ప్రస్తుత సంవత్సరానివి. గత రెండేళ్లలో జనాభా దాదాపు రెండు శాతం మేర పెరగిందనుకున్నా.. ఓటర్లు 90 శాతానికి పైగా ఉండటం విశేషం.
కారణాలనేకం..
గ్రేటర్‌లో ఓటర్ల శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. పెరిగిన ఆరోగ్యస్పృహ తదితరమైన వాటితో ప్రజల జీవితకాలం పెరగడం వంటి వాటి వల్ల కొద్దిశాతం పెరుగుదల ఉంటుంది. నగరానికి వలస వచ్చేవారు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం. నగరంలో ఇళ్లు మారడం ఎక్కువైనందున ఓటరు జాబితాలో పాత ఇంటి చిరునామాతో రద్దు చేసుకోకుండానే కొత్త చిరునామాతో నమోదు చేయించుకోవడం తదితరమైనవి కూడా కారణం కావచ్చు. - నవీన్‌మిట్టల్,
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి
తప్పుల తడక కాకిలెక్క
Published Mon, Sep 30 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement