సాక్షి, హైదరాబాద్: కాలుష్య పరిశ్రమలకు విషయ ప్రస్తావన లేకుండా నోటీసు జారీ చేస్తే చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. నివాస ప్రాంతాల్లో పరిశ్రమల్ని ఏర్పాటు చేసి చట్టాన్ని ఉల్లంఘించారా, మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకించారా, కాలుష్యాన్ని వెదజల్లుతోందా, అక్రమ నిర్మాణంలో పరిశ్రమ ఉందా.. వంటి అంశాల్లేకుండా నోటీసు ఇస్తే చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఏ చట్ట ప్రకారం నోటీసు ఇస్తున్నారో స్పష్టత లేకపోతే ఎలాగని జీహెచ్‌ఎంసీని ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని కాలుష్య పరిశ్రమలకు తిరిగి నోటీసు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
శాస్త్రిపురంలోని తన గోడౌన్‌ను మూసేయాలని జీహెచ్‌ఎంసీ మార్చి 5న ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ మహమ్మద్ తౌఫిక్ అహ్మద్ సవాల్ చేసిన వ్యాజ్యం విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. షోకాజ్ నోటీసుకు మూసివేత నోటీసుకు మధ్య చట్ట ప్రకారం ఉండాల్సిన సమయం కచ్చితంగా ఉండాలని తెలిపింది. ఏ అంశంపై నోటీసు ఇస్తున్నారో చాలా స్పష్టంగా ఉండకపోతే కోర్టుల్లో వీగిపోతాయని చెప్పింది.
జీహెచ్‌ఎంసీ వివరణపై హైకోర్టు అసంతృప్తి
పిటిషనర్‌కు చెందిన టైల్స్ పరిశ్రమ నుంచి కాలుష్యం వెలువడుతోందని నోటీసు ఇచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే టైల్స్ కాల్చడం వల్ల కాలుష్యం వెలువడుతోందని జీహెచ్‌ఎంసీ జవాబు చెప్పడంపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసుపై వివరణ ఇచ్చే గడువు వారం రోజులు ఉంటుందని, ఈలోగానే మూసేయాలని నోటీసు ఇవ్వడం సరికాదని పేర్కొంది. దీనిపై అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ స్పందిస్తూ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ నోటీసుల్లో జరిగిన పొరపాట్లను తెలుసుకున్నారనిచెప్పారు. దీంతో పిల్‌పై విచారణ ముగిసినట్లుగా ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, సంగారెడ్డి జిల్లా హాత్‌నూరా మండలం గుండ్లమానూరులో కాలుష్యం వెలువరించే పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 25కి వాయిదా పడింది.
విషయం లేని నోటీసు చెల్లుబాటు కాదు
Published Wed, Jun 17 2020 2:43 AM | Last Updated on Wed, Jun 17 2020 2:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment