పెట్టుబడులతో తరలిరండి!
ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి సర్కారు కసరత్తు
160 దేశాల ప్రాతినిధ్యంతో భాగస్వామ్య సదస్సుకు యోచన
డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోని ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ఇం దులో భాగంగా 160 దేశాల్లోని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రులు, కార్యదర్శులను, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించి, హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్ పారిశ్రామిక, వ్యాపార అవకాశాలకు, వాటి విస్తరణకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన వేదిక అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఈ సదస్సును వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక స్థాయి ఏర్పాట్లకు, అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కె.తారక రామారావు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో కేటీఆర్ పలు దఫాలు సమావేశమయ్యారు.
బ్రాండ్ ఇమేజీనే ట్రంప్‌కార్డుగా...
ఐటీ, పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజీని ట్రంప్‌కార్డుగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా ఉపాధితో పాటు అభివృద్ధికి కీలకమైన పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం ఉంటుందని కేటీఆర్ పేర్కొంటున్నారు. పారిశ్రామిక విధానంపై కసరత్తు ఆగస్టులో పూర్తవుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రకటన రాగానే భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ప్రతిపాదనలు, ఏర్పాట్లు, వ్యూహం వంటివాటిపై అడుగులు వేయనున్నారు. డిసెంబర్ చివర్లో లేదా జనవరిలో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహించాలని భావిస్తున్నారు. సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు.
ప్రతి కంపెనీతో ప్రత్యక్ష సంబంధాలు...
ప్రపంచ, జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలతో నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ 44 దేశాలతో భాగస్వామ్య సదస్సు జరిగింది. అయితే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రూ.43,800 కోట్ల విలువైన ఎంఓయూ(ఒప్పందాలు) జరిగినా, ఆచరణలో రూ.వంద కోట్లు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో భాగస్వామ్య సదస్సుకు హాజరైనవారితో పాటు భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారితో ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా సంబంధాలను కొనసాగించాలని అనుకుంటోంది.
కీలకపాత్ర పోషిస్తున్న కేటీఆర్...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన రోజునే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి హార్వర్డ్ బంగారు పతకం వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ మెయిల్ పంపిం చారు. అలాగే జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా కంపెనీ కన్నా పెద్ద పరిశ్రమలను ఏర్పాటుచేయాలని కేటీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. దీనికి ఆనంద్‌మహీంద్రా కూడా సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు హీరోహోండాకు తెలంగాణలో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ ఆదేశించారు. బెల్జియంకు చెందిన యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్, యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రాంతీయ కేంద్రాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారుస్తున్నారు. ఇందులోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఒకటి రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున చురుకుగా వ్యవహరించడం వల్ల అవే కంపెనీలు పెట్టుబడులు పెట్టకపోయినా, ఆ సంకేతాలతో కార్పొరేట్ సంస్థల్లో సానుకూల చర్చ జరిగే అవకాశం ఉంటుందని, తద్వారా ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
పారిశ్రామిక రంగానికి చేయూత: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖా మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం, ఎంఎస్‌ఎంఈ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌మిషన్లు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. సింగిల్ విండో విధానంతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అనుమతులు మంజూరయ్యేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఐఐసీ ఎండీ జయేశ్ రంజన్, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి, ఫ్యాప్సియా అధ్యక్షుడు జె.నాగేశ్వర్ రావు, సిన్మియాస్ చైర్మన్ ఎస్.మనోహరన్, మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు మిరుపాల గోపాలరావు, పి.చంద్రశేఖర్ రెడ్డి, వై.సుధాకర్ రెడ్డి, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
మానవ సంబంధాలు ప్రభావితం: సోషల్‌మీడియా మానవ సంబంధాలనే తిరగరాస్తుందని, ప్రస్తుత కాలంలో ఓట్ల కంటే ‘ట్వీట్ల’ను ఇవ్వడానికే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం బేగంపేట మనోహర్ హోటల్లో పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా ఇన్ టుడేస్ వరల్డ్’ అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
ఐటి పరిశ్రమను పటిష్టం చేస్తాం: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలోని రిట్రీట్ కార్యక్రమ మూడో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.