కాలకుంట్ల మదన్‌మోహన్‌రావు, గాలి అనిల్‌కుమార్
అందరూ అనుకున్నట్లుగానే ఆ ఇద్దరినే కాంగ్రెస్ అధిష్టానం మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపి విడుదల చేసిన ఎనిమిది మందితో కూడిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మెదక్ లోక్‌సభ స్థానానికి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ నుంచి మదన్‌మోహన్‌రావు స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు గాలి అనిల్‌కుమార్‌కు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మెదక్ లోక్‌సభ టికెట్ ఇస్తామని చెప్పినట్లుగానే ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ గ్రామానికి చెందిన గాలి అనిల్‌కుమార్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని, లోక్‌సభ టికెట్ ఇస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్ ఇతర కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు.
మెదక్ లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ విజయశాంతి, గతంలో పోటీ చేసిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పోటీలో ఉంటారని భావించినా వారు సుముఖత చూపలేదు. చివరకు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి భార్య నిర్మలారెడ్డి, గాలి అనిల్‌కుమార్ మాత్రమే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గాలి అనిల్‌కుమార్‌కే టికెట్ ఇవ్వాలని విజయశాంతితోపాటు, ఇతర నాయకులు ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు జగ్గారెడ్డి కూడా అనిల్‌కు టికెట్ ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని అంగీకరించినట్లు సమాచారం.
ఎట్టకేలకు జహీరాబాద్‌లో..
జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్‌మోహన్‌రావును ప్రకటించారు. కామారెడ్డికి చెందిన ఆయన ప్రవాస భారతీ యుడు. ఎమ్మెస్సీ చదివి, విదేశాల్లో 17 ఏళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన మదన్‌మోహన్‌రావు అప్పటి నుంచి టీడీపీలో కీలక నాయకుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమీప బంధువైన ఈయన పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి టీడీపీని టికెట్ ఇవ్వమని కోరారు. అప్పుడు సయ్యద్ యూసూఫ్ అలీకి పొత్తులో భాగంగా సీటు కేటాయించారు. అనంతరం 2014లో జరిగి ఎన్నికల్లో పోటీ చేసిన మదన్‌మోహన్‌రావు 1,57,497 ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఈయన తిరిగి జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది.
నియోజకవర్గ పెద్దలతో సమావేశం
టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మెదక్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, జహీరాబాద్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు శనివారం నుంచే తమ కార్యకలాపాలను మొదలు పెట్టారు. ఈ ఇద్దరు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసనసభా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఇంతకు ముందు పోటీ చేసిన వారు, సీనియర్ నాయకులకు ఫోన్‌చేసి తమకు సహకరించాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా టికెట్ వచ్చిందని తెలియగానే ఇరువురి కార్యాలయాల వద్దకు కార్యకర్తలు రావడంతో అంతా బిజీబిజీగా మారారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నామినేషన్లు వేస్తామని, ఇందుకుగాను అందరిని సమీకరించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment