![Women With Labour Pain Doctor Passing Through Road Helps Delivery - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/10/sngr.jpg.webp?itok=3Ivk39tK)
జహీరాబాద్: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం పీహెచ్‌సీకి వచ్చింది. అక్కడ డాక్టర్ లేకపోవడంతో ఏరియా ఆస్పత్రికి తరలించమని సిబ్బంది సలహా ఇచ్చారు. ఈలోగానే ఆ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆ దారిన వెళ్తున్న ఓ వైద్యుడు పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేకాపూర్ తండాకు చెందిన మంజూబాయి ప్రసవం కోసం ఆదివారం మధ్యాహ్నం మల్‌చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆస్పత్రిలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. అక్కడ ఉన్న ఏఎన్ఎంలు వివరాలు తెలుసుకుని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆటో మాట్లాడి ఆమెను తీసుకెళ్లే క్రమంలోనే పురుటి నొప్పులు వచ్చాయి.
దీంతో అందరూ ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో, ప్రస్తుతం వరంగల్ జోనల్ మలేరియా ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ వ్యక్తిగత పనిపై అటు వైపు వచ్చారు. అందరూ గుమిగూడటం చూసి విషయం ఆరా తీశారు. వెంటనే ఆస్పత్రి ఆవరణలో ఏఎన్‌ఎంలతో కలిసి పురుడు పోశారు. అనంతరం తల్లీ బిడ్డలకు పీహెచ్‌సీలో వైద్యం అందించారు. మాతృదినోత్సవం రోజున మంజూబాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన వైద్యుడు సునీల్‌ని పలువురు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment