సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్‌లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్‌తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్‌గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment