సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యానికి ముగింపు పలుకుతూ ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరిన మరో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మెచ్చా బుధవారం సాయంత్రం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తొలుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మెచ్చా నాగేశ్వర్‌రావు, సండ్ర వెంకట వీరయ్యలు భేటీ అయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి మంత్రుల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు.
టీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో టీడీపీని విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్లు టీఆర్‌ఎస్ పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీఆర్‌ఎస్‌లో టీడీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలని ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నాలుగో పేరాను అనుసరించి విలీనాన్ని ఆమోదిస్తూ, శాసనసభలో టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు వారికి స్థానాలు కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. తమ విలీన నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావు బుధవారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు కూడా లేఖను అందజేశారు.
వీరి వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్షం విలీనంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్యా బలం 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
సీఎంతో మెచ్చా భేటీ.. సండ్ర మధ్యవర్తిత్వం
2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు నామమాత్రంగా తయారయ్యాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఉనికిని చాటుకోలేక పోయింది. ఇటీవల జరిగిన శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నామమాత్ర ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చిన మెచ్చా నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చా పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరాలనే ఆకాంక్షను వెలిబుచ్చినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మెచ్చా చేరికలో క్రియాశీలంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా రెండు రోజుల క్రితం భేటీ అయినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో మెచ్చా చేరిక, టీడీపీ శాసనసభా పక్షం విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది.
గత శాసనసభలోనూ టీడీఎల్పీ విలీనం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో ఏర్పాటైన తొలి శాసనసభకు టీడీపీ నుంచి 15 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో 12 మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో తెలుగుదేశంను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. నాటి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కోరుతూ అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేయగా ఆమోదిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండో పర్యాయం కూడా టీడీపీ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కావడం గమనార్హం.
శాసనసభలో ఉనికి కోల్పోయిన టీడీపీ
కాగా 2018 సాధారణ ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే 2019 మార్చిలో సండ్ర టీఆర్‌ఎస్‌లో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన మరో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నాలుగో పేరా నిబంధన ప్రకారం... ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. అలాంటప్పుడు వీరికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు టిఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో విలీనం కావాలని నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ విలీనం సంపూర్ణమైంది. దీంతో రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.
చదవండి: మిస్టర్ కేసీఆర్! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు
Comments
Please login to add a commentAdd a comment