సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమర్‌రెడ్డి . చిత్రంలో తమ్మినేని, ఎల్.రమణ
హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భర జీవితం గడుపుతున్న భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లను మహాకూటమి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పాటుకాగానే పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దరిపల్లి చంద్రం అధ్యక్షతన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన పునాదుల గర్జన కార్యక్రమంలో ఉత్తమ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొని మాట్లాడారు. ప్రజల జీవితాలను మార్చే దమ్ము మహాకూటమికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే ఈఎస్‌ఐ వ్యవస్థను మరింత విస్తృతం చేసి ప్రతి భవన నిర్మాణ కార్మికునికి ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వీటితో పాటు కేజీటుపీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు నిర్మిస్తామన్నారు. సిద్దిపేట మహాకూటమి అభ్యర్థిగా దరిపల్లి చంద్రంను ప్రకటించారు.
బీసీలకే ముఖ్యమంత్రి: తమ్మినేని
టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలుపర్చడం లేదని ఇదో దద్దమ్మ ప్రభుత్వమని తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటే బీఎల్‌ఎఫ్ తరఫున రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీలకు 60 సీట్లు ఇచ్చిన ఘనత బీఎల్‌ఎఫ్‌దేనన్నారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ..తాను కార్మిక శాఖమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఫండ్‌ను ప్రచారాలకు మాత్రమే వెచ్చిస్తూ వెల్ఫేర్‌ను మర్చిపోయిందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను అమలు చేయకపోతే ప్రభుత్వాల పునాదులు కదిలిస్తామన్నారు. కార్మిక శాఖ బోర్డు చైర్మన్‌గా కార్మికుడే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం కావాలో... ఈ కూటమి కావాలో తేల్చుకోవాలంటూ ప్రచారంలోకి దిగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విరాహత్‌అలీ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్‌నేత రాగిడి లక్ష్మారెడ్డి, టీడీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్, బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాములు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment