బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్, పాస్‌బుక్ చూపుతున్న ఖాతాదారురాలు, ఆమె భర్త
అశ్వారావుపేటరూరల్ : ఎస్‌బీఐ ఖాతాదారుడి ఖాతా నుంచి 83వేల రూపాయలు అతనికి తెలియకుండానే ఎవరో స్వాహా చేశారు. ఇది మంగళవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ సిబ్బందిపై బాధితుడు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు...
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామానికి చెందిన ఎస్‌కె.అఫ్జల్, తన భార్య షాహెదాబేగం పేరు మీద అశ్వారావుపేటలోని ఎస్‌బీఐ బ్రాంచిలో 2012లో సేవింగ్స్ అకౌంట్ తెరిచాడు. అందులో 1.80లక్షల రూపాయల వరకు జమ చేశాడు.
తమకు ఏటీఎం అవసరం లేదని అనుకున్నారు. ఏటీఎం కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అప్పట్లో పనిచేసిన సిబ్బంది, మరొక ప్రైవేట్ ఉద్యోగి కలిసి, షాహెదాబేగం పేరు మీద ఏటీఎం కార్డు కోసం ఫోర్జరీ సంతకంతో దరఖాస్తు చేశారు.
బ్యాంకుకు వచ్చిన ఆ కార్డు ద్వారా అశ్వారావుపేట, కొత్తగూడెంలోని ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ ఏటీఎంల ద్వారా 83వేల రూపాయలు స్వాహా చేశారు. రెండు రోజుల క్రితం నగదును డ్రా చేసేందుకు స్థానిక ఎస్‌బీఐకి వెళ్లిన అఫ్జల్, షాహెదాబేగానికి.. ఖాతా నుంచి 83వేల రూపాయలు డ్రా అయినట్టు తెలిసింది.
దీనిపై బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. కొంత సమయమిస్తే దీనిని పరిష్కరిస్తామని మేనేజర్ చెప్పారు. అప్పట్లో పనిచేసిన మేనేజర్‌కు, సిబ్బందికి ప్రస్తుత మేనేజర్ సమాచారమిచ్చి, ఖాతాదారురాలితో రాజీకి ప్రయత్నించారు.
స్వాహా చేసిన నగదుతోపాటు మరికొంత కలిపి ఇస్తామని బేరసారాలకు ప్రయత్నించారు. దీనికి ఖాతాదారురాలు, ఆమె భర్త ఒప్పుకోలేదు. తమ ఖాతా నుంచి డబ్బు ఎలా, ఎవరు డ్రా చేశారో చెప్పాలని నిలదీశారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కార్డును ఇలా పొందారా...!
ఎస్‌బీఐలో ఖాతా తెరిచిన తర్వాత, నిబంధనల ప్రకారంగా ఏటీఎం కోసం ఖాతాదారు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన దాదాపు ఇరవై రోజుల్లో పోస్టల్ ద్వారా ఖాతాదారు ఇంటి చిరునామాకు కార్డు వస్తుంది.
కానీ, ఈ ఖాతాదారురాలికి ఏటీఎం కార్డు రాలేదు (అసలు వారు దరఖాస్తే చేయలేదు). ఏటీఎం కార్డు వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (పిన్).. ఖాతా ఉన్న బ్యాంకుకే వస్తుంది. దీనిని నేరుగా ఖాతాదారుకే బ్యాంక్ సిబ్బంది ఇవ్వాలి.
అప్పటి బ్యాంక్ అధికారులు, సిబ్బంది కలిసి ఖాతాదారు ఏటీఎం కార్డును తప్పుడు చిరునామాతో అందుకున్నారు. ఈ వ్యవహారంలో అప్పటి బ్యాంక్ అధికారి, సిబ్బంది హస్తం ఉందన్నది ఆరోపణ.
మీడియా ఎదుటే చీటింగ్‌కు యత్నం
ఖాతా నుంచి నగదు స్వాహాపై బాధితులు స్థానిక మీడియాను ఆశ్రయించారు. కొందరు పాత్రికేయులు కలిసి ఎస్‌బీఐ స్థానిక బ్రాంచ్ మేనేజర్‌ను వివరణ కోరారు. ఖాతాదారు అకౌంట్ స్టేట్‌మెం ట్ ఇవ్వాలని కోరారు.
దీనికి ఆయన... ‘‘స్టేట్‌మెం ట్ ఇవ్వాలంటే దరఖాస్తుపై ఖాతాదారు సంతకం పెట్టాలి’’ అంటూ, ఏటీఎం కార్డు దర ఖాస్తు ఫారం ఇచ్చారు. ‘‘ఇది ఏటీఎం దరఖాస్తు ఫారం కదా..! స్టేట్‌మెంట్‌కూ, దీనికీ సంబంధం ఏమిటి..?’’ అని, ప్రశ్నిస్తే ఆ మేనేజర్ మౌనంగా ఉన్నారు. ‘‘మమ్మల్ని మళ్లీ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారా..?’’ అంటూ, మేనేజర్‌ను ఖాతాదారురాలు, ఆమె భర్త నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment