హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మేనేజర్ పదవిని అడ్డంపెట్టుకుని పలు మార్గాల్లో రూ.4.75 కోట్లను స్వాహా చేసిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఆడిట్‌లో ఈ మోసాలు బయటపడ్డాయి. దీంతో ఎస్‌బీఐ ప్రస్తుత మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్‌బీఐ సనత్‌నగర్ బ్రాంచ్‌లో 2020 జూన్ 20 నుంచి 2023 జూన్ 16 వరకు కార్తీక్ రాయ్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన పలు అనధికారిక లావాదేవీలకు పాల్పడినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ నుంచి రుణాలు పొందిన వారికి వాటిని రద్దు చేస్తామని చెప్పి.. కొందరి పేరిట అప్పులు మంజూరు చేశారు. కాగా.. ముందు తీసుకున్న రుణాలు రద్దు చేయలేదు. పైగా ఖాతాదారులకు తెలియకుండా మంజూరు చేసిన రుణాలు థర్డ్ పార్టీ ఖాతాలకు మళ్లించారు. తాము మోసపోయినట్టు గుర్తించిన కొందరు ఖాతాదారులు మేనేజర్ కార్తీక్ రాయ్‌ను ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతో అలా జరిగి ఉండవచ్చని, రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తానని వారికి హామీ ఇచ్చారు. రుణ ఖాతాలు క్లోజ్ చేసుకోవడానికి వారు ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్‌లను సైతం థర్డ్ పార్టీ ఖాతాలకు మళ్లించారు.
బ్యాంక్‌లోని పలు డిపాజిట్లకు వ్యతిరేకంగా ఓడీ ఖాతాలను తెరిచి ఆ మొత్తాలను అందులోకి మళ్లించారు. ఇదే క్రమంలో మరణించిన ఖాతాదారులకు సంబంధించి నిధులను కూడా థర్డ్ పార్టీ ఖాతాలకు బదిలీ చేశారు. ఇంతటితో ఆగకుండా నకిలీ పత్రాలు, వేతన స్లిప్పులతో కొత్త రుణాలు మంజూరు చేసి భారీగా డబ్బులు కొల్లగొట్టినట్లుగా తేలింది. ఇలా అవకాశం ఉన్న ప్రతిసారీ మొత్తం రూ.4,75,98,979 స్వాహా చేసినట్లు గుర్తించారు. ప్రస్తుత మేనేజర్ రాఘవేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment