సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : ‘ఇప్పటివరకు ఏ విషయంలోనూ ఎక్కడా రాజీపడ్డది లేదు.. ఇకపై పడేదీ లేదు. నాన్న నాకు ఇచ్చిన పొలం అమ్ముకుని మరీ రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడా చేయి చాచింది లేదు.. నా నిజాయితీ, విశ్వసనీయతే ప్రజలు నా వెంట ఉండేలా చేశాయి. మా మేనమామ కూతురు శ్యామల, నేను ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. అవేర్ సంస్థ ద్వారా ప్రజలకు దగ్గరయ్యా. రాజకీయాల్లోకి వచ్చి రెండెకరాల భూమి అమ్ముకున్నా తప్ప సంపాదించింది లేదు. నలుగురికి మంచి చేయడం కోసం నేను నష్టపోయినా బాధపడను’ అంటున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ‘సాక్షి’ పర్సనల్ టైమ్.
మాది దమ్మపేట మండల పరిధిలోని మొద్దులగూడెం పంచాయతీలో గల తాటి సుబ్బన్నగూడెం అనే మారుమూల గిరిజన గ్రామం. మా తల్లిదండ్రులకు ఆరుగురం సంతానం. మా నాన్న రాములుకు వ్యవసాయమే జీవనాధారం. నాకు పదేళ్ల వయసప్పుడే ఆయన మృతిచెందారు. అప్పటి నుంచి అమ్మ ఆదెమ్మే మాకు అన్నీ తానై పెంచింది. మేం పెద్దయ్యేంత వరకు మా మేనత్త భర్త నర్సింహులు మా పొలాలు సాగు చేసి, మాకు సంరక్షకుడిగా నిలిచారు.
నాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ముగ్గురు అక్కలను అంతగా చదివించలేదు. నేను మూడో తరగతి వరకు మా ఊరికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న తొట్టిపంపు గ్రామానికి కాలి నడకనే వెళ్లి చదువుకున్నాను. నాలుగో తరగతి నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అప్పట్లో ఇలా తారురోడ్లు లేవు. పొలాల నుంచి అడ్డదారుల్లో దుగాల మీద నడుచుకుంటూ వెళ్లేది. 5 నుంచి 10 వరకు అశ్వారావుపేట ఎస్టీ హాస్టల్‌లో ఉండి జమీందారు గారి దివాణం బడిలో చదువుకున్నాను.
అప్పట్లో అశ్వారావుపేటలో ఐటీఐ కాలేజీ స్థాపించిన పీకేఎస్.మాధవన్ గిరిజనులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. లోన్లు ఇవ్వడం, పొదుపు చేయించడంతోపాటు విద్యారంగంలో ప్రోత్సహిస్తుండే వారు. ఆయన దగ్గర గిరిజనులను చైతన్యవంతులను చేసేందుకు నేను ఆర్గనైజర్‌గా పనిచేసే వాడిని. అప్పట్లో నా రాజ్‌దూత్ వాహనంతోనే అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తిరుగుతూ గిరిజనులను చైతన్యం చేస్తూ అవేర్ సంస్థ పథకాలను వారికి చేరవేసేవాడిని. రాజ్‌దూత్‌పై మారుమూల గ్రామాల్లో తిరిగిన రోజులు, నా రాజ్‌దూత్ నంబర్ ఏటీడబ్ల్యూ 5370 ఇప్పటికీ గుర్తుంది. ఆనాటి నుంచి ప్రజలతో నాకున్న సంబంధాలే నన్ను ఎమ్మెల్యేను చేశాయి.
పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాం..
నా భార్య శ్యామల మా ఊర్లోనే ఉండే మా మేనమామ కూతురు. తాటి వారి ఆడపడుచు. వరసకు మరదలే అయినా అప్పట్లో ఇద్దరం ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మాకు పిల్లలు లేనందున సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నాం. బాబు రాము అనంతపురంలో ఫిజికల్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇక నా మేనల్లుడు తాటి ప్రదీప్‌చంద్ర నా వ్యక్తిగత వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. నా భార్య మా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా మాటకు అడ్డు చెప్పలేదు.
ఆమెకు తెలిసిందల్లా నా నిర్ణయానికి కట్టుబడి ఉండడమే. రాజకీయాల్లో తిరగడం వల్ల మానాన్న నుంచి నాకు సంక్రమించిన 14 ఎకరాల్లో రెండెకరాలు అమ్మేశా. భూమి అమ్మినప్పుడు కూడా శ్యామల పల్లెత్తు మాటనలేదు. నాపై ఆమెకున్న నమ్మకం.. ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఆ సమయంలో శ్యామల మాట్లాడుతూ.. ‘ఆయనకు ఏది నచ్చితే అదే చేస్తారు.. నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు.. నలుగురికి మంచి చేయడం కోసం నష్టపోయినా తప్పు లేదనే వ్యక్తిత్వం ఆయనది. ఇంటి పేరు మెచ్చా.. ఆయనకు లేదు మచ్చ.. అని అందరూ మెచ్చుకుంటుంటే గర్వంగా ఉంటుంది’ అన్నారు.
ఇల్లూ.. పొలమే లోకం..
మొద్దులగూడెం గ్రామ పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే అయ్యాక కూడా ఉంటే ఇంట్లో, లేకుంటే పొలంలో.. ఈ రెండూ కాకుంటే పార్టీ ఆఫీస్‌లో ఉంటానని ప్రజలందరికీ తెలుసు. అందుకే అశ్వారావుపేటలో క్యాంపు కార్యాలయంలో ఒంటరిగా కూర్చోలేక మారుమూల గ్రామమైనా మా ఊర్లోనే ఉంటాను. నియోజకవర్గం దాటితే.. అసెంబ్లీకే. నాకు కాంట్రాక్టులు లేవు.. టెండర్లకు వెళ్లేదీ లేదు. మా ఇంట్లో నాకొక్కడికే రాజకీయాలపై ఆసక్తి. మా తమ్ముడికి ఆ ఊసే ఉండదు. జలగం వెంగళరావు హయాంలో కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశాను.
ఏడో తరగతి పూర్తికాగానే ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం వచ్చినా.. రాజకీయాలపై ఉన్న మక్కువతో అందులో చేరలేదు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నప్పుడు మా పంచాయతీ ఎన్నికల్లో వాళ్లకు పది ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది నా వల్లే అని తెలుసుకుని ఓ రోజు అర్ధరాత్రి బుల్లెట్ వేసుకుని మా ఇంటికొచ్చి నన్ను టీడీపీలో చేర్పించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అదే పది ఓట్లు వచ్చాయి. అంతే అప్పటి నుంచి నన్ను తుమ్మల వదలిపెట్టలేదు. జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావుతో మంచి సంబంధాలున్నాయి.
2009లో అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడింది. టీడీపీ నుంచి నేను.. మా బావ తాటి వెంకటేశ్వర్లు టికెట్ కోసం పోటీపడ్డాం. ఈ పంచాయితీ తేల్చలేక అప్పట్లో అధిష్టానం గెలిచే సీటును సీపీఎంకు ఇచ్చి చేజార్చుకుంది. ఆ తర్వాతా మా ఇద్దరికే పోటీ. 2014లో తాటి నన్ను ఓడించాడు. 2019లో నేను ఆయనను ఓడించి బాకీ తీర్చుకున్నా. నేను ఓడిపోయి ఇంట్లో ఉన్నప్పుడే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటూ.. నన్ను కూడా రావాలని ఒత్తిడి తెచ్చారు.
అయితే వారం రోజులు ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు వెళ్లి ఆయనకు దొరక్కుండా తప్పించుకున్నాను. మళ్లీ నేను గెలిచి.. ఆయన ఓడాక కూడా ఒత్తిడి మొదలెట్టారు. చివరకు సీఎం కూడా నాకేం కావాలన్నా సరే అన్నారు. కానీ.. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకునేది లేదని తేల్చి చెప్పేశాను. నేను మట్టిని నమ్ముకున్న రైతును.. ఆ మట్టికున్న నిజాయితీ మనకుంటేనే ప్రజలు విశ్వసిస్తారనేది నా నమ్మకం. నాకు ఆ దేవుడు.. ఈ దేవుడనే తేడా లేదు. కాకుంటే సాయిబాబా గుడికి ఎక్కవగా వెళుతుంటా. సాధ్యమైనంత వరకు కుటుంబంతో.. చిన్ననాటి స్నేహితులతో గడుపుతుంటాను.
Comments
Please login to add a commentAdd a comment