మదర్సా ఉదంతంపై కదిలిన యంత్రాంగం
సాక్షి, ఏలూరు : దెందులూరు మండలం గంగన్నగూడెంలోని మౌలానా అబ్దుల్‌కలాం ఆజాద్ యూపీ స్కూల్(మదర్సా)లో నాలుగో తరగతి విద్యార్థిని కరస్పాండెంట్ చితకబాదిన ఉదంతాన్ని ‘సాక్షి’ కథనం ఆధారంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఈ నెల 30 లోగా విచారణచేసి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులను ఆదేశించడంతో యంత్రాంగం కదిలింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టడంతో విద్యార్థి వజీర్ వీపుపై తేలిన వాతలను ప్రభుత్వాసుపత్రి డాక్టర్ సీహెచ్ ప్రవీణ్ పరీక్షించారు. చికిత్స చేస్తున్నారు.
కరస్పాండెంట్‌పై బాలల చట్టం ప్రకారం కేసు
విద్యార్థి వజీర్‌ను విచక్షణారహితంగా కొట్టిన స్కూల్ కరస్పాండెంట్ వసీవుల్లాపై బాలల న్యాయ చట్టం సెక్షన్ 23, బాలల విద్యాహక్కు చట్టం సెక్షన్-17, భారత శిక్షాస్మృతి సెక్షన్-14 కింద కేసు నమోదు చేయించనున్నట్టు బాలల సంక్షేమ న్యాయమూర్తుల కోర్టు చైర్మన్ టి.స్నేహన్ ఆదివారం తెలిపారు.వ జీర్ నుంచి వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా బాలల సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణిని న్యాయమూర్తుల పీఠం ఆదేశించటంతో ఆమె ఆదివారం బాలుడితో పాటు అతని తల్లి నజీమున్నీసా, అమ్మమ్మ బషీర్‌ఉన్నీసాల నుంచి వివరాలు సేకరించారు.
ఎస్సై విచారణ
గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మదర్సాలో విద్యార్థిని కరస్పాండెంట్ కొట్టిన ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు దెందులూరు ఎస్సై కె.వెంకటరమణ ఆదివారం సాయంత్రం పాఠశాలలో విచారణ నిర్వహించారు. ఘటన ఎప్పుడు, ఎలా జరిగింది, విద్యార్థి, కరస్పాండెంట్ ప్రవర్తనపై ఆరా తీశారు. విచారణలో ఉపాధ్యాయులు మౌలానా జాఫర్‌సాబ్, అబ్దుల్ రెహమాన్, అఫీజుల్లాఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో బాలురు 178 మంది, బాలికలు 261 మంది మొత్తం 439 మంది ఉన్నారన్నారు. యూపీ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, ముగ్గురు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారని చెప్పారు. పాఠశాల ప్రారంభించి 13 ఏళ్లు అయిందని, ఇప్పటివరకు ఏ రిమార్కు లేదన్నారు.
వజీర్ ఈ నెల 11న తరగతి గదిలో పాస్ పోశాడని, అతడిని కరస్పాండెంట్ రూమ్‌కు తీసుకువెళితే అక్కడ కూడా పాస్ పోశాడన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా చేసిన ఘటనలు లేవన్నారు. ఈ విషయాన్ని కరస్పాండెంట్ వజీర్ తల్లిదండ్రులకు చెప్పడంతో చింతలపూడి రావడానికి ప్రయత్నిస్తున్నాడని, ఒకటి తగిలించి మందలించాలని వారు చెప్పారన్నారు. పాస్ పోసిన అనంతరం కరస్పాండెంట్ విద్యార్థిని కొట్టడం వాస్తవమేనన్నారు. కరస్పాండెంట్ విధి నిర్వహణలో విద్యార్థులతో వ్యవహరించే తీరులో ఇప్పటివరకు ఎవరి నుంచీ ఫిర్యాదు లేదని, భోజనం, మౌలిక వసతులు కల్పించడంతోపాటు అందరినీ బాగా చూస్తారని ఎస్సైకి వివరించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని ఎస్సై కె.వెంకటరమణ తెలిపారు.
మదర్సాపై దుష్ర్పచారం తగదు
గంగన్నగూడెం (దెందులూరు) : గంగన్నగూడెంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ మదర్సా(ఉర్దూ పాఠశాల)పై అనవసరంగా దుష్ర్పచారం చేస్తున్నారని ఉర్దూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ అలీ పేర్కొన్నారు. మదర్సాలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మదర్సా విద్యార్థి వజీర్‌ను కరస్పాండెంట్ వసీవుల్లా కొట్టిన సంగతి వాస్తవమేనన్నారు. ఈ ఘటనతో మదర్సాపై దుష్ర్పచారం చేయటంలో కొందరి హస్తం ఉందని ఆరోపించారు. ఆరుగురు విద్యార్థులను కొట్టడంతో ఇద్దరు కోమాలోకి వెళ్లారని టీవీ చానల్స్‌లో రావడం తమను బాధించిందన్నారు. పాఠశాల ప్రారంభించి పదమూడేళ్లుకాగా ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌పై ఎటువంటి రిమార్కు లేదన్నారు.
ఈ నెల 11న ఈ ఘటన జరిగితే విద్యార్థి తండ్రి ఈ నెల 22న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ విద్యార్థికి ముందు నుంచే మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనందున ఏలూరులోని మానసిక వైద్య నిపుణులు స్వరూప్ వద్ద చికిత్స పొందుతున్నాడని, ఈ విషయం నిర్ధారించుకోవటానికి అధికారులు విచారణ చేపట్టవచ్చని సూచించారు. విద్యార్థి తండ్రితో కొందరు మదర్సాపై దుష్ర్పచారం చేయిస్తున్నారని ఆరోపించారు. మదర్సా ఉపాధ్యాయులు మహ్మద్ అబ్దుల్‌రెహమాన్, అఫీజుల్లా, మౌలానా జాఫర్‌ఖాన్, నుజ్జమిల్ పాల్గొన్నారు.