
సాక్షి, న్యూఢిల్లీ : మదర్సాలలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ అధికారులు తయారుకావడం లేదని.. కొన్ని మదర్సాలలో ఉగ్రవాద బీజాలే పడుతున్నాయని షియా బోర్డు చీఫ్ వాసిం రిజ్వి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మదర్సాలను ప్రధాన విద్యా స్రవంతిలోకి చేరేలా చర్యలు చేపట్టాలని కోరారు. మదర్సాలను విద్యా మండళ్ల పర్యవేక్షణ కిందకు తీసుకురావాలని, వీటిని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలకు అనుబంధంగా చేర్చాలని సూచించారు. మతపరమైన విద్యను ఐచ్ఛికం చేయాలని కోరారు. కొన్ని మదర్సాలు ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని రిజ్వి ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు రిజ్వి ప్రకటనపై పలు ఇస్లామిక్ సంస్థలు మండిపడుతున్నాయి. షియా బోర్డ్ ఛైర్మన్‌ను బఫూన్‌గా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. ‘వాసిం రిజ్వి పెద్ద జోకర్..అవకాశవాద వ్యక్తి..ఆయన తన ఆత్మను ఆర్‌ఎస్‌ఎస్‌కు అమ్ముకున్నార’ ని వ్యాఖ్యానించారు. మదర్సాలలో ఉగ్ర బోధనలు జరిగితే అందుకు తగిన ఆధారాలను ఆయన నేరుగా హోంమంత్రికి అందించవచ్చు కదా అని ప్రశ్నించారు.