హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టణంలోని బన్‌భూల్‌పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది.
పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్‌పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment