Haldwani
-
యోగి బాటలో థామీ సర్కార్.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?
ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్‌పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్‌ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత
హల్ద్వానీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా నిర్మించిన మదరసా కూల్చివేతకు స్థానిక యంత్రాంగం ప్రయత్నించడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు వురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితు లను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతోపాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని బన్భూల్పూర్ ప్రాంతంలో మదరసా, ప్రార్థనలకు వినియోగించే ఒక నిర్మాణం ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ మొదలైంది. అరగంటలోపే భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. కొందరు చుట్టుపక్కల భవనాలపైకెక్కి మున్సిపల్ సిబ్బంది, పోలీసులపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. సంఘటన స్థలంలో గుమికూడిన వారు రాళ్లు, కర్రలు, పెట్రోలు బాంబులు, దేశవాళీ తుపాకులతో అధికారులు, సిబ్బందిని ఆగ్రహంతో ప్రశ్నిస్తూ దాడికి యత్నించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. ఆందోళనకారుల ఒక గుంపు వెంటబడగా పోలీసులు సమీపంలోని పోలీస్‌స్టేషన్ లోపలికి వెళ్లారు. అక్కడికి చేరుకున్న గుంపు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టింది. పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టేందుకు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ చెప్పారు. పోలీస్ స్టేషన్‌తోపాటు సిబ్బందిపై దాడికి యత్నించినట్లు గుర్తించిన సుమారు 20 మందిలో నలుగురిని అరెస్ట్ చేసి, మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. మృతి చెందిన ఆరుగురిలో ముగ్గురికి బుల్లెట్ గాయాలు, మరో ముగ్గురికి ఇతర గాయాల య్యాయని చెప్పారు. క్షతగాత్రులైన 60 మందిలో చాలా మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లిపోయారని ఎస్పీ(సిటీ) హర్బన్స్ సింగ్ చెప్పారు. ఒక జర్నలిస్ట్ సహా గాయపడిన ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. -
ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురు మృతి
డెహ్రాడూన్: ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుఉకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దాడితో హింస చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపు చేసేందుకు ఖర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవల ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు కూల్చివేతల కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. రాళ్లు రువ్వుతూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసంచేసి పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చిననప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. హల్ద్వానీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇదీ చదవండి.. లైవ్‌లో మాట్లాడుతుండగానే శివసేన నేత హత్య -
సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వాళ్లంతా ఈ పాటికి రోడ్డున పడేవాళ్లే. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయేవాళ్లే. ఎముకలు కొరికే చలిలో చంటిపిల్లలు, వృద్ధులు, గర్భిణులతో నానా అంతా అగచాట్లు పడేవారే. ‘ఇది రైల్వే స్థలం. మీరు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలనేది’ హైకోర్టు ఆదేశం అని స్థానిక అధికారులు చెప్పగానే వాళ్లంతా నెత్తినోరూ బాదుకున్నారు. ‘‘మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? నిలువ నీడ లేకుండా చేస్తారా?’’ అని మొత్తుకున్నారు. ప్రార్థనలు చేశారు. బైఠాయించారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడును తీసికెళ్లేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రదేశంలో అనేక మంది కాపురం ఉంటున్నారు. వాటిని గఫూర్ బస్తీ, ఢోలక్ బస్తీ, ఇందిరానగర్ అని పిలుస్తారు. అక్కడ ఇళ్లే కాదు. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. నాలుగు గుళ్లు, పది మసీదులు, ఒక బ్యాంకు, కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్లంతా నిరుపేదలు. అందులో ఎక్కువ మంది ముస్లింలు. దాదాపు నాలుగువేల కుటుంబాలు. మొత్తం 50వేల మంది దాకా ఉంటారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదని చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లు హఠాత్తుగా ఆక్రమణదారులు ఎలా అవుతారు. ముందూ వెనక చూడకుండా, ఒక ప్రత్యామ్నాయం అనేది చూపకుండా ప్రభుత్వం వాళ్లని ఖాళీ చేయమని ఎలా చెబుతుంది? రైల్వే శాఖ ఏం చెబుతోంది? కొంత మంది అక్కడ భూమిని లీజుకు తీసుకున్నారు. కొంత మంది భూమిని ప్రభుత్వవేలంలో కొనుక్కున్నారు. జిల్లా కోర్టుల్లో దీనికి సంబంధించిన అర్జీలు కూడా ఉన్నాయి. చాలా మంది దగ్గర చట్టబద్ధమైన పత్రాలున్నాయని కూడా చెబుతున్నారు. ఈశాన్య రైల్వేశాఖ ఈ భూమి విషయంలో పొంతనలేని వాదనలు చేస్తోంది. ఒకసారి 78 ఎకరాలు ఆక్రమించారని చెబితే, మరోసారి 29 ఎకరాలు ఆక్రమణ పాలయిందని చెబుతోంది. 2014లో ఈ అంశంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలయినప్పుడు అక్కడ నిర్వాసితులను ఆక్రమణదారులు అని పేర్కొనకపోవటం గమనార్హం. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఒక ఎస్టేట్ అధికారిని నియమించారు. ఆయన ఈ స్థలం రైల్వేదని తేల్చేశారు. 2017లో కూడా హైకోర్టు ఒకసారి అక్కడున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తే, అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్పింది? ఈ భూమిపైన హల్ద్వానీ నివాసితులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదని భావించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తక్షణం వారిని తొలగించాలని ఆదేశించింది. అవవసరమైతే సాయుధ బలగాల సహకారం తీసుకునయినా అక్కడున్న వాళ్లని తరిమివేయటానికి, రైల్వే అధికారులకు, జిల్లా యంత్రాంగానికి అనుమతులిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సామాజిక కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్.ఎ.నజీర్, పి.ఎస్.నరసింహతో కూడిన బెంచీ దీనికి సానుకూలంగా స్పందించింది. ‘‘ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలి’’ అని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒక పద్ధతి ప్రకారమే మేం ముందుకు వెళుతున్నామని రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నా, దశాబ్దాలుగా ఉంటున్న వారిని సాయుధ పోలీసు బలగాలు ఉపయోగించి ఎలా ఖాళీ చేయిస్తారని న్యాయమూర్తులు నిలదీశారు. ఆశ్రయం పొందే హక్కు (రైట్ టు షెల్టర్): ఆశ్రయం పొందే హక్కుఅనేది భారతదేశంలో వివాదాస్పదమైన హక్కుగా చెప్పుకోవాలి. పునరావాస కల్పన అనే దాన్ని ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోవు. ఆశ్రయం పొందే హక్కు అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రతి ఒక్కరికీ లభించే హక్కు. సుప్రీంకోర్టు 1996లో ఒక కేసులో ( చమేలి సింగ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్) ఈ మేరకు తీర్పునిచ్చిన విషయం గమనార్హం. పునరావాసం, ఆశ్రయం పొందే హక్కులను సంబంధించి 1990లో ఇచ్చిన మరో తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జంతువులు ఆశ్రయం కల్పించటం అనేది వాటి శరీరానికి రక్షణ కల్పిస్తే చాలు, అదే మనుషులయితే వారికి తగిన వసతి కల్పించాలి. వారు శారీరకంగా, మానసికంగా, తెలివితేటలపరంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. హల్ద్వానీ కేసులో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి తొలగించటానికి ముందు వారికి ప్రత్యామ్యాయనివాసాలు చూపించవలసి ఉంది. దశాబ్దాలుగా వారు అక్కడ నివసిస్తున్నారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మరో వైపు హల్ద్వానీ కేసు సుప్రీంకోర్టుకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. స్థానిక రాజకీయ ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చేయకుండా మార్గదర్శకాలు అందించటానికి అది వీలుకల్పించింది. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. హల్ద్వానీవాసులకు ఎలాంటి ముప్పు లేదు. వచ్చేనెలలో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు నివాసితులు ఆశించిన పూర్తి న్యాయం లభిస్తుందని కోరుకుందాం. -
Supreme Court: వాళ్లంతా మనుషులు.. రాత్రికి రాత్రే ఖాళీ చేయించటమేంటి?
న్యూఢిల్లీ: ఉత్తరఖాండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో నిర్మించిన 4వేల ఇళ్లు, స్కూళ్లు, ప్రార్థనా స్థలాల కూల్చివేతకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. వేలాది మందిని రాత్రికి రాత్రే నిరాశ్రయులను చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ కూల్చివేతలతో ప్రభావితమయ్యే ప్రజలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం ఆలోచించాలని అభిప్రాయపడింది. కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘వారు ఉంటున్న ప్రాంతంలో రైల్వేకు చెందిన భూమి, ప్రభుత్వానికి చెందిన భూమిపై ఎంత అనేది స్పష్టత రావాల్సి ఉంది. 50వేల మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు. ఇక్కడ మానవతా కోణం దాగి ఉంది. వారంతా మనుషులు. ఏదో ఒకటి జరగాలి. వారికి ఏదో విధంగా న్యాయం అందాలి.’అని పేర్కొంది ధర్మాసనం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. నిరాశ్రయులవుతున్న వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. హల్ద్వానీలోని 29 ఎకరాల భూమిలో ఆక్రమణలను కూల్చివేయాలని డిసెంబర్ 20న ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. జనవరి 9లోగా రైల్వే స్థలంలో ఉన్న బంభుల్‌పురా, గఫూర్ బస్తీ, ధోలక్ బస్తీ, ఇందిరా నగర్ ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. తొలగింపులను ఆపాలని నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. క్యాండిల్ మార్చ్‌లు, ధర్నాలు చేశారు. ఇదీ చదవండి: అంజలి సింగ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు కాదు మరో ఇద్దరు ఉన్నారటా! -
దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్‌ని ఆక్రమించి పాకిస్తాన్ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది. దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్‌తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్‌లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్‌తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌దిగా గుర్తించారు. చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్ పాకిస్తాన్‌పై చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్‌గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్‌గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
-
‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్
డెహ్రాడూన్: ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణతో అంబులెన్స్‌లు విరామమెరుగక సంచరిస్తున్నాయి. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారంతా పీపీఈ కిట్లు ధరించి సేవల్లో మునిగారు. ఈ సమయంలో కాస్తంతా సమయం దొరికినా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన పని వారు ఎంత కష్టపడుతున్నారో అర్ధమవుతోంది. వారు ఎలాంటివి కోల్పోతున్నారో తెలుస్తోంది. వారి దయనీయ స్థితి నెటిజన్లను ఆవేదనకు గురి చేస్తోంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీ పట్టణంలో ఓ కళాశాల వద్ద కొద్ది మందితోనే పెళ్లి బరాత్ కొనసాగుతోంది. ఈ సమయంలో అటువైపు వచ్చిన అంబులెన్స్‌తో వచ్చిన డ్రైవర్ మహేశ్ వాహనం ఆపేశాడు. వెంటనే పీపీఈ కిట్లోనే బరాత్ మధ్యలోకి వచ్చి తీన్మార్ స్టెప్పులేశాడు. మ్యూజిక్ అనుగుణంగా స్టెప్పులేస్తూ తన పని ఒత్తిడిని మరిచేలా అలసిపోయేలా డ్యాన్స్ చేశాడు. అయితే అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పీపీఈ కిట్ డ్రైవర్‌ను చూసి పెళ్లివారు ఆందోళన చెందారు. అనంతరం ఆ డ్రైవర్ ఆనందంతో డ్యాన్స్ చేస్తుండడంతో అతడిని వారించకుండా ఎగరనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. రోగులకు నిరంతరం సేవలందిస్తూ బిజీగా ఉన్న వ్యక్తి ఇలా కష్టాన్ని మరుస్తూ సంతోషంగా చిందేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. -
కాలువలో పెద్ద నోట్లు కొట్టుకొచ్చాయి!
హల్ద్వానీ: అది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ నగరం. నగరంలో ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న ఓ కాలువలోకి కొందరు యువకులు దిగారు. మరికొందరు ఆ ప్రాంతంలో గుమికూడారు. ఈ తతంగం చూస్తున్న వారికి అక్కడ ఏమి జరుగుతోందో కాసేపు అర్థం కాలేదు. అక్కడి పరిస్థితి చూస్తే కాలువలో చేపలు పడుతున్నట్టుగా ఉంది. అయితే యువకులు పట్టుకుంటున్నది చేపలను కాదు పాత 500, 1000 రూపాయల నోట్లను..! నల్లధనం దాచిన గుర్తు తెలియని కుబేరులు పాతనోట్లను ఏం చేయాలో తెలియక కాలువలో పడేశారు. పాత నోట్లు కాలువలో కొట్టుకు రావడాన్ని గమనించిన స్థానిక యువకులు కొందరు వాటిని పట్టుకునేందుకు అందులో దిగారు. ఈ విషయం తెలియడంతో ఆ ప్రాంతంలోని వారు అక్కడ గుమికూడారు. కొందరికి 500, 1000 రూపాయల నోట్లు దొరికాయి. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి స్థానికులు కాలువలోకి దిగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ నోట్లను ఎవరు, ఎంత మొత్తం కాలువలో పడేశారన్న వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.