కాలువలో పెద్ద నోట్లు కొట్టుకొచ్చాయి!
హల్ద్వానీ: అది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ నగరం. నగరంలో ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న ఓ కాలువలోకి కొందరు యువకులు దిగారు. మరికొందరు ఆ ప్రాంతంలో గుమికూడారు. ఈ తతంగం చూస్తున్న వారికి అక్కడ ఏమి జరుగుతోందో కాసేపు అర్థం కాలేదు. అక‍్కడి పరిస్థితి చూస్తే కాలువలో చేపలు పడుతున్నట్టుగా ఉంది. అయితే యువకులు పట్టుకుంటున్నది చేపలను కాదు పాత 500, 1000 రూపాయల నోట్లను..!
నల్లధనం దాచిన గుర్తు తెలియని కుబేరులు పాతనోట్లను ఏం చేయాలో తెలియక కాలువలో పడేశారు. పాత నోట్లు కాలువలో కొట్టుకు రావడాన్ని గమనించిన స్థానిక యువకులు కొందరు వాటిని పట్టుకునేందుకు అందులో దిగారు. ఈ విషయం తెలియడంతో ఆ ప్రాంతంలోని వారు అక్కడ గుమికూడారు. కొందరికి 500, 1000 రూపాయల నోట్లు దొరికాయి. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి స్థానికులు కాలువలోకి దిగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ నోట్లను ఎవరు, ఎంత మొత్తం కాలువలో పడేశారన్న వివరాలు తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.