యోగి బాటలో థామీ సర్కార్‌.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు? | Sakshi
Sakshi News home page

Haldwani Violence: యోగి బాటలో థామీ సర్కార్‌.. డ్యామేజ్ రికవరీ బిల్లు అమలు?

Published Mon, Feb 26 2024 9:40 AM

Pushkar Singh Dhami Yogi Model will Take Money from Accused - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు అవలంబిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్తల్లో నిలిచారు. ఆందోళనకారుల కారణంగా ప్రభుత్వానికి వాటిల్లే నష్టాలను రికవరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సీఎం యోగిని అనుసరించనున్నారని సమాచారం. 

హల్ద్వానీ హింసాకాండలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి వసూలు చేసేందుకు థామీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిరసనల సమయంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు ఏదైనా నష్టం జరిగితే ఆ మొత్తాన్ని ఆందోళనకారుల నుండి రికవరీ చేయనున్నట్లు ప్రభుత్వ  వర్గాలు పేర్కొన్నాయి. 

సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ పబ్లిక్  అండ్‌ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

నిరసనల కారణంగా సంభవించే ఆస్తి నష్టాల పరిహారంపై నిర్ణయం తీసుకునేందుకు రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 8న నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో అక్రమాస్తుల వ్యతిరేక ప్రచారంలో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో బంబుల్‌పురా ప్రాంతంలో ఒక మసీదు, మదర్సాను కూల్చివేశారు. అంతటితో ఆగక స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా నిప్పంటించారు. 

ఈ ఘటనలో ధ్వంసమైన ఆస్తుల విలువ మొత్తాన్ని నిందితుల నుంచి రికవరీ చేస్తామని, దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ టేబుల్‌పైకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి గతంలోనే ప్రకటించారు. కాగా ఈ హింసాకాండలో పాల్గొన్నవారి సమాచారం అందించాలని మీడియాను జిల్లా యంత్రాంగం కోరింది. హల్ద్వానీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అబ్దుల్ మాలిక్‌ను ఇటీవల ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement