
గోరఖ్‌పూర్: హింసకు పాల్పడే వారికి అదే రీతిలో సమాధానం చెప్పాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఇటీవల ఎన్‌కౌంటర్లు పెరగాయనే విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. ‘అందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత. సమాజంలో ప్రశాంతతను చెదరగొడుతూ తుపాకీని నమ్మే వారికి తుపాకీ భాషలోనే సమాధానం చెప్పాలి. ఈ విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని అధికారులకు చెప్పాను’ అని యోగి అన్నారు. అంతకు ముందు లక్నోలో విలేకర్లలో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వారు అమర్యాదగా వ్యవహరించారన్నారు.