తెలంగాణలో ఎవరి మోడల్ పాలన బెటర్ అన్న చర్చకు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్‌లు తెరమీదకు తెస్తున్నాయి. టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ మోడల్ దేశానికే ఆదర్శం అని వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నేతలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోడల్ పాలనను తెలంగాణలో తెస్తామని అంటున్నారు. ప్రజలు ఎవరి మోడల్ కరెక్టు అని అనుకుంటారో ఎన్నికలలో కాని తేలదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజాదరణ చూరగొని రెండోసారి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది. తెలంగాణ 119 అసెంబ్లీ సీట్లతో చిన్న రాష్ట్రం అయితే, యూపీ 405 సీట్లతో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది.
చదవండి: జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందా!
తెలంగాణలో ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం జరిగింది. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో అది మళ్లీ పునరుద్దరించబడిందని చెప్పాలి. రైతు బంధు, షాదీ ముబారక్, బిఎస్ ఐ పాస్, ధరణి వంటి కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుట్టారు. యూపీలో కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ మద్దతుతో యోగి ఆదిత్యనాథ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ప్రత్యేకించి శాంతి భద్రతల విషయంలో బాగా సీరియస్‌గా ఉన్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న నిందితుల ఇళ్లను బుల్ డోజర్‌లతో కూల్చడం ద్వారా సంచలనం సృష్టించారు. అది వివాదాస్పదం అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో బాగా ఉపయోగపడుతోందన్న భావన ఏర్పడింది. అక్కడ అయోధ్య రామమందిరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో యాదాద్రి నరసింహస్వామి ఆలయ అభివృద్దికి కేసీఆర్ కృషి చేస్తున్నారు. యూపీలో కన్నా తెలంగాణలో మతపరమైన విద్వేషాలు తక్కువే అని చెప్పాలి. కాగా ఇటీవలికాలంలో కేంద్ర బీజేపీ నేతలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ ఇక్కడ యూపీ తరహా పాలన సాగిస్తామని , యోగి ఆదిత్యనాథ్ మాదిరి రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేవారిపై పై ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు.
దీనివల్ల బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలియదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ముగింపు సభలో కాని, ఇతరత్రా కాని కేంద్ర బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ప్రజలలోకి వెళ్లడం వల్ల కూడా రాజకీయంగా లబ్ది చేకూరి ఉండవచ్చు. కాని తెలంగాణలో ఆ ధీరీ పనికి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే యూపీ రాజకీయాలు వేరు.. తెలంగాణ రాజకీయాలు వేరు. యూపీలో ఉన్న శాంతిభద్రత పరిస్థితి వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు.
కేంద్ర బీజేపీ నేతలు ఈ విషయాలను గమనించకుండా యూపీ ప్రస్తావన తెస్తున్నట్లుగా అనిపిస్తుంది. యూపీలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికీ నేరాల రేటులో యూపీనే అగ్రస్థానంలో ఉంది. కాకపోతే అక్కడ జనాభా కూడా అధికం కావచ్చు. మతపరంగా జరిగే గొడవలు కూడా అక్కడ ఎక్కువే. వాటిని అదుపు చేసే క్రమంలోనే యోగి ప్రభుత్వం నేరాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను బుల్ డోజర్లతో కూల్చివేస్తోంది. పేరుకు అక్రమ నిర్మాణాలు అని చెబుతున్నా, వాస్తవం ఏమిటో తెలియదు.
దానితో అక్కడి సమాజంలో మరీ విభజన హెచ్చుగా ఉందని అంటారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడే రైతులపై జీప్ ఎక్కించారన్న వార్త బీజేపీకి అప్రతిష్ట తెచ్చింది. అయినా సంబంధిత కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించలేదు. హత్రాస్ మానభంగ ఘటన, బలియాలో ఒక పోలీస్ స్టేషన్‌లోనే మాన భంగం జరిగిందన్న ఆరోపణ రావడం.. ఇలా అనేక అభియోగాలు వచ్చాయి. కాన్పూర్‌కు చెందిన ఒక గూండా జరిపిన అరాచకం నేపథ్యంలో అతనిని మధ్యప్రదేశ్‌లో పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు. అలాగే అతని ఇంటిని కూల్చివేయడం జరిగింది.
అయితే గత సమాజవాది పార్టీ ప్రభుత్వంతో పోల్చితే ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని అంటారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అంత దారుణమైన పరిస్థితి లేదు. కొన్ని రేప్ ఘటనలు జరిగినా, యూపీతో పోల్చితే తక్కువే. ఒక కేసులో ఇక్కడ కూడా ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించింది.
కాని యూపీలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు రాలేదు. తెలంగాణలో మతపరమైన గొడవలు ఒక్క భైంసా పట్టణంలో మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రం అంతటా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నివసిస్తున్నారు. వారెవరికి ప్రభుత్వపరంగా, సంఘ విద్రోహ శక్తుల పరంగా అంత తీవ్రమైన కష్టాలు లేవు. అందువల్ల యూపీ తరహాలో యోగి పాలన తెలంగాణలో తెస్తామని బీజేపీ ప్రచారం చేస్తే అది వారికి నష్టం చేయవచ్చు. ఎందుకంటే యోగి పాలనను బుల్ డోజర్ పాలనగా, నిరంకుశంగా ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వంగా విపక్షాలు విమర్శిస్తుంటాయి. బీజేపీపై ఇప్పటికే వివిధ రూపాలలో ఎక్కుపెట్టి అస్త్ర శస్త్రాలు కురిపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ అంశం ఆధారంగా కూడా బీజేపీని డిపెన్స్ లో పడేసే అవకాశం ఉంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment