
కళ్లలో కారం, వెల్లుల్లి రసం
మదర్సాలో చిన్నారులకు టీచర్ చిత్రహింసలు
కనిగిరి: చిన్న తప్పి దానికి మదర్సాలోని విద్యార్థులను దారుణంగా శిక్షించిందో టీచర్. ఓ విదార్థిని కళ్లలో కారం కొట్టించి, వెల్లుల్లి రసం పిండించి.. మరో ఇద్దరు విద్యార్థినుల ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టించింది. ఈ ఘటన శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగులోకి వచ్చింది. కనిగిరి పట్టణం దొరువు బజారులో ఉన్న మదర్సాలో 120 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సుమారు 60 మంది హాస్టల్లో ఉంటున్నారు.
ఓ విద్యార్థిని మోటారు పైపులు పగులగొట్టిందన్న కోపంతో హెడ్ టీచర్ మరో విద్యార్థినితో కర్రతో కొట్టించి అట్లకాడతో చేతిపై వాతలు పెట్టించింది. కళ్లలో కారం, వెల్లుల్లి రసం పోయించింది. మరో ఇద్దరు విద్యార్థినుల ముఖం, కాళ్లు, చేతులపై వాతలు పెట్టించింది. మదర్సాకు ప్రతి శుక్రవారం సెలవు కావడంతో ఆ రోజు తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుంటారు. ఈ క్రమంలో గాయాలతో ఉన్న పిల్లల్ని చూసిన తల్లిదండ్రులు హెడ్ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలకు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇళ్లకు తీసుకెళ్లారు.