కేరళలోని నలుగురు బాలికలు అంధులకు ఉపయోగపడే స్మార్ట్‌గాగుల్స్‌ని రూపొందించారు. వాళ్లు దాన్ని తమ పాఠశాల్లో అంధురాలిగా ఉన్న సహ విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్‌లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు వేదికగా ఏర్పాటు చేస్తున్న అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో దీన్ని ప్రదర్శించారు బాలికలు. ఈ ఆవిష్కరణ మూడో స్థానం దక్కించుకోవడమే గాక అందరీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించడం విశేషం. ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టునున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఒక అడుగు ముందేసి ఇలాంటి గాగుల్స్‌ని రూపొందించాలనుకోవడం అందర్నీ సభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆ బాలికలు ఎలా రూపొందించారు? ఈ ఆలోచనకు మార్గదర్శకం చేసిందెవరూ..? తదితర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం!.
కేరళలోని సెయింట్ మేరిస్ కాన్వెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్మార్ట్ గాగుల్స్‌ని రూపొందించారు. ఈ నమునాను హన్నా రీతు సోజన్, ఆన్సిలా రెజి, ఆన్లిన్ బిజోయ్, అంజెలినా అనే నలుగురు బాలికలు రూపొందించారు. ఈ స్మార్ట్ గాగుల్ అల్ట్రా సోనిక్ సెన్సార్‌లను ఉపయోగించింది రూపొందించారు. అందువల్ల వీటిని ధరించిన అంధ వ్యక్తులకు ఎదురుగా ఉన్న అడ్డంకులను గుర్తించి బజర్ ద్వారా వారిని ముందుగా హెచ్చరిస్తుంది. ఆ బాలికలు ఈ స్మార్ట్ గ్లాస్ నమునాని త్రిసూర్‌లోని సెయింట్ పాల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ అటల్ టింకరింగ్ లాబొరేటరీ(ఏటీఎల్) తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించారు.
ఈ ఏటీఎల్‌ని నీతి అయోగ్‌లో బాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత పాఠశాల్లలో ఏర్పాటు చేసింది. ఇలాంటి ల్యాబరేటరీలను దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో సుమారు పదివేలకు పైగా ఏర్పాటు చేసింది అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఈ ల్యాబరేటరీలను పాఠశాల విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచన వెలికితీసి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసింది. అంతేగాదు ముఖ్యంగా విద్యార్థుల్లో డిజైన్ మైండ్‌సెట్, కంప్యూటేషనల్ థింకింగ్, అడాప్టివ్ లెర్నింగ్, ఫిజికల్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ల్యాబరేటరీలను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు సదరు బాలికలు మాట్లాడుతూ..తాము రూపొందించిన స్మార్ట్ గాగుల్ బేసిక్ మోడల్ అని, దీన్ని మరింతగా మెరుగుపర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. రేబాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు తెలుసని అన్నారు. అయితే అవి అత్యంత ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండదని చెబుతున్నారు. ఆ సమస్యకు చెక్‌పెట్టేలా, చౌకగా, పర్యావరణ హితంగా రూపొందించాలనేది తమ లక్ష్యం అని ఆ బాలికలు పేర్కొన్నారు. ఇక ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో లెర్నర్ లింక్స్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ద్వారా నియమించబడిన ఒక మెంటర్ ఆయా విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తాడు.
ఈ ఏటీఎల్ ప్రోగ్రాంలో మొత్తం మూడు వేర్వేరు పాఠశాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 20కి పైగా ప్రాజెక్టులు ప్రదర్శించగా, వాటిలో మొదటి మూడు ప్రాజెక్ట్‌లు ప్రత్యేక అవార్డులను పొందాయి. అందులో ఈ స్మార్ట్ గాగుల్స్ ప్రాజెక్ట్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, కేరళలోని ఏటీఎల్ ల్యాబ్ ఒప్పో ఇండియా భాగస్వామ్యంతో ఏర్పాటయ్యింది. ఈ మేరకు ఏటీఎల్ కార్యక్రమంలో ఒప్పో ఇండియా పబ్లిక్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ వశిష్ఠ మాట్లాడుతూ..ఆ యువ విద్యార్థుల అంకితభావం, కృషికి ముగ్దుడినయ్యానన్నారు. వారి నుంచి ఎంతో ప్రేరణ పొందానని చెప్పారు. దృష్టిలోపం ఉన్న తమ తోటి విద్యార్థి పట్ల వారు కనబర్చిన సానుభూతి వారిలోని సృజనాత్మక శక్తిని బయటకు వచ్చేలా చేయడమేగాక ఈ ఆవిష్కరణకు నాంది పలికేలా చేయడం నిజంగా గొప్ప విషయమంటూ ఆ బాలికలను ప్రశంసించారు వివేక్ వశిష్ట.
(చదవండి: చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!)
Comments
Please login to add a commentAdd a comment