చిన్నపిల్లల్లో, అప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ (హైపర్‌టెన్షన్) ఉంటోందా? ఉంటోంది. ఇప్పుడీ సమస్య వారిని వేధిస్తోంది. తమకు తెలియకుండానే నూరేళ్ల పాటు హాయిగా,ఆరోగ్యంగా జీవించాల్సిన వారి బతుకుల్లో అంధత్వం, మూత్రపిండాల వ్యాధి రూపంలో వారి బతుకుల్లో చీకటి నింపుతోంది. ఇటీవల ఈ సమస్య పెరుగుతోంది. రేపు ‘వరల్డ్ హైపర్‌టెన్షన్ డే’సందర్భంగా చిన్నపిల్లల్లో హై–బీపీ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
చిన్నపిల్లల్లోనూ(3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు పిల్లలు), కౌమారంలోకి వస్తున్న తరుణ వయస్కుల్లోనూ (12 నుంచి 18 ఏళ్ల మధ్యవారు) హైబీపీ కనిపించడం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల్లో బీపీ చాలా జాగ్రత్తగా కొలవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను సెంటైల్ చార్ట్ అంటారు. పిల్లల్లోనూ, కౌమార బాలల్లోనూ బీపీ కొలిచే సమయంలో ఆ విలువలు వాళ్ల వయసునూ, జెండర్‌నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతూ ఉంటాయి.
అందుకే... తల్లిదండ్రులు మొదట పిల్లల వయసు, బరువు, ఎత్తు... వీటన్నింటినీ కొలిచి... నాలుగైదు రోజుల పాటు మామూలు ఆపరేటస్‌తోనే రెండు చేతులకూ, కాళ్లకూ వాళ్ల బీపీ రీడింగ్స్ తీసుకోవాలి. వాటిని హాస్పిటల్‌లో పిల్లల డాక్టర్‌కు చూపిస్తే... వారు ఆ రీడింగ్స్‌ను బట్టి లెక్క వేసి, పర్సంటైల్ నిర్ణయించి, హైబీపీ ఉన్నదీ లేనిదీ తెలుసుకుంటారు.ఇందులో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. బీపీ పర్సంటైల్ 95 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్ 95–99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్–1, స్టేజ్–2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ణయిస్తారు.
పిల్లల హై–బీపీల్లో రకాలు
పిల్లల్లో ఉన్న హైబీపీని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది ఎసెన్షియల్ లేదా ప్రైమరీ హైపర్‌టెన్షన్. ఇందులో హైబీపీకి కారణం ఏమిటన్నది తెలియదు. అయితే సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఎక్కువగా బరువు ఉండటం, ఊబకాయం (ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీ) వంటివి దీనికి కారణాలు కావచ్చని భావిస్తుంటారు. చాలామంది పిల్లల్లో బాల్యం వీడేముందు లేదా కౌమారంలోకి ప్రవేశించే ముందు ఈ ఎసెన్షియల్ లేదా ప్రైమరీ హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక రెండోది సెకండరీ హైపర్‌టెన్షన్. ఈ రెండో రకం హైబీపీకి మూత్రపిండాల జబ్బులు లేదా హార్మోన్లలో సమస్య వంటిది ఏదో ఒక కారణం ఉంటుంది. ఎవరిలోనైనా లక్షణాలు బయటకు కనిపిస్తూ హైపర్‌టెన్షన్ ఉందంటే ఆ పిల్లలకు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు రావచ్చనడానికి సూచన. పైగా ఏ కారణం వల్ల వారికి ఇలా హైపర్‌టెన్షన్ కనిపిస్తోందో, దానికి చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారి ప్రాణాంతకమైన గుండెజబ్బులు, మూత్రపిండాల జబ్బులు లేదా కంటిచూపును ప్రభావితం చేయడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. ఇక మరికొంతమంది పిల్లల్లో హైబీపీ విచిత్రంగా కనిపిస్తుంటుంది. ఇలాంటివారిలో ఆ పిల్లలు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మాత్రమే వారిలో హైబీపీ కనిపిస్తుంటుంది. వారి సాధారణ పరిసరాలు, ఇళ్లు, ఆటస్థలాల్లో పరీక్షించినప్పుడు వారిలో హైబీపీయే కనిపించదు. ఇలాంటి పిల్లలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లే. వారి సమస్యకు ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ పిల్లల హై–బీపీని ‘వైట్ కోట్ హైపర్‌టెన్షన్’ అంటారు. అంటే హాస్పిటల్‌లో డాక్టర్లను చూసినప్పుడు మాత్రమే ఆందోళనతో వారి బీపీ పెరుగుతుందన్నమాట. అయితే ఈ తరహా బీపీని నిర్ధారణ చేయడం చాలా జాగ్రత్తగా జరగాలి. దాదాపు 12 నెలల పాటు వారిని వేర్వేరు చోట్ల పరీక్షిస్తూ ఉన్న తర్వాతే ఆ పిల్లల బీపీని వైట్‌కోట్ హైపర్‌టెన్షన్‌గా పరిగణించాల్సి ఉంటుంది.
హై–బీపీ పిల్లల్లో కనిపించే సమస్యలు
హై–బీపీ ఉన్న పిల్లల్లో అది వారి ఆరోగ్యంపై చాలా రకాలుగా దుష్ప్రభావాలు చూపుతుంటుంది. ఉదాహరణకు ఇలాంటి పిల్లలు త్వరగా ఉద్వేగాలకు గురికావడం, చాలా వేగంగా చిరాకు పడటం, ఎదుగుదల చాలా తక్కువగా ఉండటం, వాంతులు చేసుకుంటూ ఉండటం, తినడంలో సమస్యలు, ఫిట్స్, శ్వాసవ్యవస్థకు సంబంధించిన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇవిగాక మరికొన్ని సమస్యలూ ఉంటాయి.
తక్షణం కనిపించే సమస్యలు(అక్యూట్ కాంప్లికేషన్స్)
హైబీపీతో బాధపడే పిల్లల్లో అప్పటికప్పుడు కొన్ని అనర్థాలు కనిపించవచ్చు. వారిలో హైపర్‌టెన్సివ్ ఎన్‌సెఫలోపతి వంటి మెదడుకు సంబంధించిన సమస్య కనిపించవచ్చు. అంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వారు మగతగా మారిపోవడం, కోమాలోకి వెళ్లడం, బీపీ వచ్చాక ఫిట్స్ వస్తూ ఉండటం, మెదడులో రక్తస్రావం కావడం, గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), మూత్రపిండాల వైఫల్యం (రీనల్ ఫెయిల్యూర్) వంటి సమస్యలు కనిపించవచ్చు. కేవలం హైబీపీ ఉన్నంతమాత్రాన ఈ సమస్యలన్నీ వచ్చేస్తాయని కాదు. అయితే ఈ పిల్లల్లో వచ్చిన బీపీ తీవ్రత, ఆ హైబీపీ ఎంతసేపు కొనసాగింది వంటి అంశాల మీద ఈ దుష్ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.
హైపర్‌టెన్సివ్ ఎన్‌సెఫలోపతి వచ్చిన పిల్లలు చాలా బద్దకంగా, మగతగా, మందకొడిగా ఉంటారు. వారు తరచూ తలనొప్పి వస్తుందంటూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇక ఫిట్స్ రావడం, చూపునకు సంబంధించిన సమస్యలు రావడం కూడా మామూలే. వారిలో వచ్చే హార్ట్‌ఫెయిల్యూర్ సమస్య అన్నది వారిలో హైబీపీ తీవ్రత చాలా ఎక్కువగా పెరిగితే అది భవిష్యత్తులో వారికి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఇలా చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ బీపీ కనిపిస్తున్న పిల్లల కేసులను ఎమర్జెన్సీగా పరిగణించి, ఆ పిల్లల్లోని బీపీ నియంత్రణలో ఉండేలా చికిత్స చేయడం అవసరం.
దీర్ఘకాలిక దుష్పరిణామాలు
ఇక పెద్దల్లో మాదిరిగానే పిల్లల్లో కూడా హైబీపీ వల్ల కళ్లు దెబ్బతిని చూపు ప్రభావితం కావడం, గుండె, కిడ్నీలు, మెదడు, రక్తనాళాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.
వైద్య పరీక్షలు – నిర్ధారణ
పిల్లల్లో కనిపించే లక్షణాలు బట్టి పిల్లల్లో హైబీపీని తెలుసుకోడానికి చాలా జాగ్రత్తగానూ, చాలా నిశితంగానూ వారిని పరీక్షించాల్సి ఉంటుంది. పిల్లల్లో ఉన్న ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలు పొట్టకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా చేస్తున్నారా అన్నదాని ఆధారంగా కూడా వారిలో బీపీని పరీక్షించాలి. అలాగే పిల్లల్లో మూత్రపిండాల సమస్య, గుండెజబ్బులు, థైరాయిడ్ సమస్యలు ఉంటే వారి బీపీని తప్పక పరీక్షించాలి. పిల్లల్లో డయాబెటిస్ ఉన్నా, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ మోతాదులు ఎక్కువగా ఉన్నా, వారి బరువు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నా... ఇక గుండెజబ్బులు, పక్షవాతం, కిడ్నీ సమస్యల వంటివి చాలా చిన్న వయసులోనే (ప్రీమెచ్యుర్ కార్డియోవాస్క్యులార్ డిసీజెస్, స్ట్రోక్స్ అండ్ రీనల్ డిజార్డర్స్) కనిపించినా... ఆ పిల్లల బీపీని చాలా నిశితంగా పరీక్షిస్తూ ఉండాలి.
ఇలా పరీక్షించే సమయంలో పిల్లల ఎత్తు, వారి బరువు, వారి బీఎమ్‌ఐ (బాడీ మాస్ ఇండెక్స్) వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే ఆ పిల్లల తల్లిదండ్రుల్లో స్థూలకాయం, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉండటం వంటివి కనిపిస్తుంటే అలాంటి పిల్లల్లో ఎసెన్షియల్/ప్రైమరీ హైపర్‌టెన్షన్ కనిపించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లిదండ్రులు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువగా బరువున్న సందర్భాల్లోనూ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ పిల్లలను చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇలా పిల్లల్లో బీపీని కొలవాల్సిన సందర్భాల్లో కేవలం బీపీ ఆపరేటస్‌ను వారి చేతులకు మాత్రమే అమర్చడం కాకుండా... వాళ్ల కాళ్లకు సైతం అమర్చి బీపీ కొలతలు తీసుకుంటూ ఉండాలి. ఈ రెండురకాల కొలతలు తీసుకొని పరిశీలించడం, పోల్చిచూడటం చాలా అవసరం. కాళ్ల దగ్గర బీపీ కొలతలు తీసుకునేప్పుడు రెండు కాళ్లకూ కొలతలు తీసుకుంటే మంచిది లేదా కనీసం ఒక కాలికైనా కొలత తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే పిల్లలను భౌతికంగా (ఫిజికల్‌గా) పరీక్షించే సమయంలో వారు శారీరకంగా ఎంత శ్రమపడుతున్నారు (ఫిజికల్ యాక్టివిటీ) వంటి అంశాలనూ చూడాలి. అలాగే పిల్లల్లో హై–బీపీ కనిపిస్తోందంటే చాలామందిలో అది ఏ మూత్రపిండాల సమస్యవల్లనో లేదా గుండెజబ్బుల వల్లనో లేదా హార్మోనల్ సమస్యల వల్లనో అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ దిశగా కారణాలు తెలుసుకోవడం కోసం ఆయా అవయవాలకు సంబంధించిన పరీక్షలూ చేయించడం అవసరం. అలాగే కొన్ని కీలకమైన అవయవాలు (మెదడు, గుండె, మూత్రపిండాలు) ఏవైనా దెబ్బతిన్నాయా, ఒకవేళ దెబ్బతిని ఉంటే అది ఏమేరకు అన్న విషయాలు తెలుసుకోవడం కూడా అవసరం. ఈ సందర్భంగా ఆ పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది.
చాలా తక్కువ వయసు చిన్నారుల్లో హైబీపీ కనిపిస్తుంటే సాధారణ భౌతిక పరీక్షలతోపాటు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ)తో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఉన్న ఆరోగ్య సమస్యలనూ పరిగణనలోకి తీసుకొని పిల్లలను చాలా నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది.
సమస్యను ఎదుర్కోవడం ఎలా(మేనేజ్‌మెంట్)
సమస్యను ఎదుర్కోవడానికి ముందుగా ఆ చిన్నారిలో కనిపిస్తున్నది ఎసెన్షియల్/ప్రైమరీ హైపర్‌టెన్షనా లేక సెకండరీ హైపర్‌టెన్షనా అని నిర్ధారణ చేసుకోవాలి. ఆ తర్వాత హైబీపీని అదుపులో ఉంచడం కోసం జీవనశైలిలో మార్పులు అవసరం. ఒకవేళ సమస్య అన్నది సెకండరీ హైపర్‌టెన్షన్‌తో అయితే సమస్యను బట్టి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
జీవనశైలిలో మార్పులు: హైపర్‌టెన్షన్ ఉన్న పిల్లలు వారి డాక్టర్ల సూచన మేరకు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు వారు చాలా ఎక్కువగా బరువు ఉంటే ఆ బరువును తగ్గించుకోవడం, ఎత్తుకు తగిన బరువు మాత్రమే ఉండేలా నియంత్రించుకోవడం వంటివి చేయాలి. ఇందుకోసం శారీరకంగా ఒళ్లు అలసిపోయేలా వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం వంటివి అవసరం. ఇది కేవలం వారిని భౌతికంగా మాత్రమే కాకుండా... మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంచుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల అతిగా శ్రమతో పాటు విసుగు కలిగించవచ్చు. ఇలాంటి పిల్లలకు తేలిగ్గా, ఉత్సాహంగా అనుసరించగలిగేలా నడక, సైక్లింగ్, స్కూల్లో ఆడే ఆటలు, ఈత వంటివి బాగా సహాయం చేస్తాయి. పిల్లల్లో రోజూ కనీసం 30 – 60 నిమిషాల పాటు ఈ తరహా శారీరక వ్యాయామాలు చాలా అవసరం.
ఆహారపరమైన మార్పులు: పిల్లలు తినే ఆహారాల్లో ఉప్పు చాలా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి ఆహారాల్లో పైనుంచి ఏమాత్రం ఉప్పు కలపకూడదు. ఇక ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే బయటి ఆహారాలైన క్యాన్‌డ్ ఫుడ్, పిజ్జాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్, సాల్టెడ్ పొటాటో చిప్స్ వంటి జంక్ ఫుడ్ నుంచి పూర్తిగా దూరంగా ఉంచాలి.
పిల్లలు తీసుకునే ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, పొట్టుతీయని ఆహారధాన్యాలతో చేసే వంటలు, కొవ్వు లేని పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూడాలి. అతిగా వేయించిన వేపుళ్లు, తీపి మిఠాయిలు చాలా పరిమితంగా మాత్రమే పిల్లలు తీసుకునేలా చూడాలి.
సెకండరీ హైపర్‌టెన్షన్‌ను ఎదుర్కోండి ఇలా...
పిల్లల్లో సెకండరీ హైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు వారికి ఏ సమస్యను బట్టి హై–బీపీ వచ్చిందో ముందుగా ఆ సమస్యకు తగిన చికిత్స అందించడం అవసరం. ఆ మందులతో పాటు పిల్లల్లో హైబీపీ తగ్గించడానికి, ఆ బీపీని నియంత్రణలో ఉంచడానికి కూడా మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మిగతా జీవనశైలి మార్పులు కూడా అనుసరించాలి.
ఒకవేళ పిల్లల్లో హైపర్‌టెన్షన్‌కు సంబంధించన ఎలాంటి దుష్ప్రభావాలూ లేకపోయినా... ఆ పిల్లల బరువు మితిమీరి ఉంటే మాత్రం భవిష్యత్తులో వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ముందుగానే నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఎత్తుకు తగినంత బరువు ఉండేలా... వారి బరువు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలి. దీన్నే ‘స్టెప్–డౌన్’ చికిత్సగా పరిగణిస్తారు. ఇలాంటి పిల్లల్లో 8 – 12 నెలల పాటు వారి ఎత్తుకు తగినంత బరువుకు వచ్చేలా వైద్యనిపుణులు జీవనశైలి మార్పులు సూచిస్తారు. ఇలాంటి హై–రిస్క్ ఉన్న పిల్లలందరికీ ప్రతి మూడు నెలల కోసారి బీపీ పరీక్షించడం, వారి వారి రిస్క్ (ముప్పు)ను బట్టి కంటి, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన తగిన పరీక్షలు చేయిస్తూ ఉండటం అవసరం. ఇక మందులను కూడా ఇతర అవయవాలపై దుష్ప్రభావాలు (సైడ్–ఎఫెక్ట్స్) పడకుండే ఉండేలా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి వాడటం అవసరం. ఇలా మందులు వాడే పిల్లల్లో ఆ దుష్ప్రభావాలను తెలుసుకోవడం కోసం ప్రతి ఏడాదీ ఆయా అవయవాల పరీక్షలు చేయిస్తూ ఉండాలి.
ఏయే సందర్భాలు ఎమర్జెన్సీగా పరిగణించాలి...
పిల్లల్లో హైబీపీ కనిపించినప్పుడు చాల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీపీ ఎక్కువగా ఉన్న ప్రతిసారీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేకపోయినా... నిర్దిష్టంగా కొన్ని సందర్భాల్లో మాత్రం తప్పక హాస్పిటల్‌లో ఉంచే చికిత్స అందించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా బీపీ పెరగడం, మెదడు, గుండె, మూత్రపిండాలు ప్రభావితం కావడం జరిగితే... ఆ పిల్లలను తప్పక హాస్పిటల్‌లో ఉంచే చికిత్స అందించాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న కారణాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల భౌతిక పరీక్షల సమయంలో వారి దేహ నిర్మాణాన్ని, వారి ఎత్తు, బరువులను పరిగణనలోకి తీసుకొని వైద్యులు కూడా ఒకసారి వారి బీపీని పరీక్షించడం అవసరం. ఆ బీపీలో తేడాలు ఏవైనా కనిపించినప్పుడు దానికి కారణాలను కనుగొనాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటి పిల్లల విషయంలో క్రమం తప్పకుండా తప్పనిసరిగా ఫాలోఅప్‌కు వస్తుండాలని తల్లిదండ్రులకు సూచించాలి. వారి బీపీ తీవ్రతను బట్టి తల్లిదండ్రులకు తగిన కౌన్సెలింగ్ ఇస్తుండటం అవసరం.
ఈ పిల్లల్లోహైబీపీవిషయంలోజాగ్రత్తగా ఉండాలి...
ఈ కింద పేర్కొన్న పిల్లల విషయంలో హైపర్‌టెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరంటే...
♦ నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు, పుట్టినప్పుడు చాలా తక్కువ బరువుతో ఉన్నవారు.
♦ పుట్టుకతోనే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) ఉన్నవారు.
♦ తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌కు గురవుతున్నారు లేదా మూత్రపిండాలు, మూత్రసంబంధమైన వ్యాధులు ఉన్నవారుకుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే ఆ కుటుంబంలోని పిల్లలు.
♦ చిన్నవయసులోనే క్యాన్లర్లు వచ్చిన పిల్లలు
♦ వీళ్లకు మాత్రమే కాకుండా... ఫిట్స్‌తో బాధపడేవారు, ఎప్పుడూ మగతగా ఉన్నట్లు కనిపించే పిల్లలు, తలనొప్పులతో బాధపడే పిల్లలు, చూపు సమస్యలు ఉన్న పిల్లలనూ బీపీ విషయంలో చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. తరచూ పరీక్షించాలి.
Comments
Please login to add a commentAdd a comment