నేటి తల్లుల వ్యాయామం రేపటి పిల్లల ఆరోగ్యం
కడుపులో ఉన్నపుడే అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి తెలుసనే విషయం మనందరికీ తెలుసు. ఆ కాలంలో గర్భస్థ శిశువుతో కమ్యూనికేట్ చేయడానికి సుభద్ర ఏ మైండ్‌గేమ్ వాడిందో తెలియదు కానీ ఈ కాలం తల్లులు కొద్దిగా వ్యాయామం చేయడం ద్వారా కడుపులో ఉన్న తమ ప్రతిరూపానికి జీవితకాలానికి సరిపోయే ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చని ఓ సర్వేలో తేలింది.
నెలలు నిండుతున్నపుడు ఊరికే టీవీ చూస్తూ కాలం గడిపేయకుండా డాక్టర్ సూచించిన చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే పుట్టబోయే పిల్లలను హైబీపీ నుంచి రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే పుట్టినపుడు తక్కువ బరువు ఉండే పిల్లల్లో వయసుతో పాటు హైబీపీ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. వారు గర్భంలో ఉండగానే తల్లులు వ్యాయామం చేస్తే అప్పుడే ఏర్పడుతున్న వారి రక్తనాళాలు సవ్యంగా పని చేస్తాయి. పుట్టుకతోనే రక్తప్రసరణ సరిగా ఉంటే భవిష్యత్తులో హైబీపీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో పాటు హైబీపీ వల్ల కలిగే హృద్రోగాలను, కిడ్నీ జబ్బులను అరికట్టే వీలుంటుంది. అందుకే మీ ముద్దులొలికే చిన్నారి కోసం కొంచెం శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంకండి.