
గ్రేటర్‌కు హైపర్ టెన్షన్
గ్రేటర్‌కు హైపర్‘టెన్షన్’భయం పట్టుకుంది. సెలైంట్‌గా సిటీ జనుల గుండెలను పట్టి పిండేస్తుంది. మూత్రపిండాల పని తీరును దెబ్బ తీస్తోంది. పక్షవాతంతో పాటు జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది. మధుమేహం, క్యాన్సర్‌కు కారణం అవుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, సిటీబ్యూరో: ఉరుకులు పరుగుల జీవితం...అతిగా మద్యం సేవించడం..అధిక బరువు...పని ఒత్తిడి...కాలుష్యం...వెరసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా గ్రేటర్‌లో 36 శాతం మంది(పెద్దలు)హైపర్ టెన్షన్(హైబీపీ)తో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ 2015-16లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో 90 శాతం మందికి తమకు బీపీ ఉన్నట్లు తెలీకపోగా, తెలిసిన వారిలో పది శాతానికి మించి వైద్యులను సంప్రదించడం లేదు.
సాధారణంగా నాలుగు పదుల వయసు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం మార్కెటింగ్, ఐటీ అనుబంధ ఉద్యోగు లు కావడం గమనార్హం. సకాలంలో గుర్తించక పోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్డియో వాస్క్యూలర్(హార్ట్‌ఎటాక్), మూత్రపిండాల పని తీరు దెబ్బతినడంతో పాటు చిన్న వయసులోనే పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోవడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లి మతిమరుపు రావడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
మారిన జీవన శైలే కారణం..
ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదపనీయడం లేదు. కూర్చొన్న చోటు నుంచి కనీ సం లేవకుండానే అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాడు. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. ఇంటి ఆహారానికి బదులు హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, ఫిజ్జాలు, బర్గర్లు, మద్యం కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయి. గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఇదిలా ఉండగా హైపర్‌టెన్షన్ బాధితుల్లో 40 శాతం మంది గుండెనొప్పితో మృతి చెందుతుండగా, 25 శాతం మంది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. మరో 10 శాతం మంది పక్షవాతంతో జీవశ్చవంలా మారుతున్నారు.
హైపర్‌టెన్షన్‌కు 140/90 రెడ్ సిగ్నల్
మధుమేహం, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, పక్షవాతానికి హైపర్‌టెన్షనే కారణం. ఈ చికిత్సల పేరుతో దేశంలో ఏటా 20 య ుూఎస్ మిలియన్ డాలర్లు ఖర్చు అవుతోంది. బ్లడ్ ప్రజర్ 140/90 ఉంటే హైపర్ టెన్షన్‌కు రెడ్ సిగ్నల్‌గా భావించాలి. బీపీ వల్ల తరచూ తలనొప్పి వస్తుంది, కళ్లు బైర్లు కమ్మినట్లు ఉంటాయి.
ఛాతి గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. శరీరం ఎంతో అలసిపోయినట్లు అన్పిస్తుంది. చిన్నపనికే చికాకు, పట్టలేని కోపం వస్తుంది. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి. పని ఒత్తిడి, ఇతర చికాకులకు దూరంగా ఉండాలి. ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేయాలి.
- డాక్టర్ సి.వెంకట్ ఎస్ రామ్, బీపీ వైద్య నిపుణుడు,
డబ్ల్యూహెచ్‌ఓ, సౌత్ ఏసియా రీజినల్ డైరెక్టర్