బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే | Doubts And Answers On Hypertension | Sakshi
Sakshi News home page

బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి, కాకపోతే

Published Sun, May 15 2022 1:52 PM | Last Updated on Sun, May 15 2022 2:36 PM

Doubts And Answers On Hypertension - Sakshi

హైబీపీకి సంబంధించిన సందేహాలు కాస్త చిత్రంగా ఉండవచ్చు. నిజానికి అదో అపోహలా అనిపించవచ్చు. కానీ అదే వాస్తవం కావచ్చు. అలాగే మరికొన్ని నిజమనిపించవచ్చు. కానీ అపోహ కావచ్చు. అందుకే అలాంటి కొన్ని సందేహాలూ, సమాధానాలు చూద్దాం.  

బీపీ... బీపీ అంటుంటాంగానీ... మనందరికీ బీపీ ఉండి తీరాలి. బీపీ అంటే బ్లడ్‌ ప్రెషర్‌. తెలుగులో రక్తపోటు. అది ఉండాల్సిందే. కాకపోతే 140/90 కొలతతో ఉండాలి. అది నార్మల్‌. అంటే బీపీ ఉండాల్సిందేగానీ... ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఇది పెరిగితే హైబీపీ!! నిజానికి ఇదో జబ్బు కాదు. కానీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేలా చేస్తుంది.

భారతీయ సమాజంలో ఇంచుమించు కౌమారం దాటి యువదశ దాటినవారిలోని 25 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు ఓ అంచనా. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంతమంది హైబీపీ బాధితులు ఉండటం... వారిలో అనేక సందేహాలు, అపోహల కారణంగా మందులు సరిగా తీసుకోకపోవడం వల్ల మెదడు, మూత్రపిండాల వంటి ఎండ్‌ ఆర్గాన్స్‌ విఫలమై మృతిచెందడం, పక్షవాతం వంటి కారణాలతో జీవితాంతం వైకల్యాలతో బాధపడటం చాలా సాధారణం.

ఈ నెల 17న వరల్డ్‌ హైపర్‌టెన్షన్‌ డే. ఈ సందర్భంగా ఈ అంశంపై అనేక సందేహాలూ, వాటికి సమాధానాలు తెలుసుకుని హై–బీపీ పట్ల అవగాహన పెంచుకుంటే ఎన్నెన్నో జీవితకాలపు వైకల్యాలనూ, మరణాలను నివారించవచ్చు. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం. 

యువకులను మినహాయిస్తే... మధ్యవయసు దాటాక... ఏజ్‌ పెరుగుతున్న కొద్దీ... నార్మల్‌ అయిన 120/80 కంటే కొద్దిగా ఎక్కువగానే ఉండటం మామూలే కదా! 
ఈ అపోహ చాలాకాలం రాజ్యమేలింది. వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కొద్దిగా ఎక్కువే ఉండవచ్చని తొలుత అనుకున్నారు. (వయసు + 100) అంటూ ఓ సూత్రం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 60 ఏళ్లు అయితే అతడి పై కొలత 160 వరకు ఉన్నా పర్లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఇప్పటి లెక్కలు వేరు. ఇప్పుడు తాజాగా... పద్దెనిమిది దాటిన ఏ వయసువారికైనా బీపీ 140/90 కి పైన ఉంటే అది హైబీపీ కిందే లెక్క. 

తల్లిదండ్రులకు ఉంటే, పిల్లలకూ హైబీపీ వస్తుందా?  
తల్లిదండ్రులకు హైబీపీ ఉంటే... పిల్లలకు అది తప్పనిసరిగా వచ్చే జన్యుపరమైన సమస్య కాదు గానీ... తల్లిదండ్రులకూ, రక్తసంబంధీకులకూ, దగ్గరి బంధువులకు అధిక  రక్తపోటు ఉన్నప్పుడు... వారి వారసులకు కూడా వచ్చే అవకాశాలు కాస్తంత ఎక్కువే. 

రక్తపోటు ఉన్నప్పటికీ చాలా చిన్నవయసు వారు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదేమో కదా? 
రక్తపోటు ఉందని తేలాక... అది ఎంత చిన్నవయసు అయినా తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. లేకపోతే దీర్ఘకాలంలో కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయం కలిగించే అవకాశాలు ఎక్కువ. 

చిన్నపిల్లల్లో హైబీపీ ఉండదు కదా? 
చిన్నపిల్లల్లో, అప్పుడప్పుడే యుక్తవయసుకు వస్తున్న కౌమార బాలల్లో హైబీపీ ఉండకపోవచ్చని అనిపిస్తుంది. కానీ వాళ్లలోనూ కొందరికి హైబీపీ (హైపర్‌టెన్షన్‌) ఉండే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిన్నపిల్లలు.. అంటే 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసువారు, కౌమారంలోకి వస్తున్న పిల్లలు... అంటే 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారిలోనూ హైబీపీ కనిపిస్తోంది.

అయితే చిన్నపిల్లల్లో హైబీపీ నిర్ధారణ విషయంలో కొలత చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పిల్లల్లో బీపీని తెలిపే ఛార్ట్‌ను ‘సెంటైల్‌ చార్ట్‌’ అంటారు. పిల్లల్లో నార్మల్‌ విలువలు వాళ్ల వయసునూ, జెండర్‌నూ, వాళ్ల ఎత్తును బట్టి మారుతుంటాయి. అంటే వారిలో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. కొలత విలువ 95 పర్సంటైల్‌ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే అది పిల్లల్లో హైబీపీ ఉన్నదనడానికి సూచన. ఆ రీడింగ్‌ 95–99 ఉంటే హైపర్‌టెన్షన్‌ స్టేజ్‌–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్‌ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్‌–2గా భావించాలి. ఈ దశలూ, తీవ్రతలను బట్టి ఆయా పిల్లలకు ఎలాంటి చికిత్స ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు.  

సుదీర్ఘకాలం పాటు హైబీపీ మందులు వాడితే వాటికి అలవాటు పడి... డ్రగ్‌ అడిక్షన్‌ వస్తుందేమో కదా? 
ఒకసారి  హై–బీపీ నిర్ధారణ అయ్యాక... దాన్ని అదుపులో ఉంచేందుకు డాక్టర్లు మందులను సూచిస్తుంటారు. వారి బీపీ తీవ్రతను బట్టి కొందరిలో రెండు, మూడు, నాలుగు... రకాల మందులను డాక్టర్లు వాడమంటారు. తరచూ గమనిస్తూ... మందుల మోతాదును అడ్జెస్ట్‌ చేస్తుంటారు. జీవనశైలి మార్పులతో బీపీని అదుపులో పెడితే కేవలం రెండులోపు మాత్రలతోనే చాలాకాలం కొనసాగవచ్చు. కానీ బీపీ అదుపులో లేకపోతే మందులూ, మోతాదులు పెరుగుతాయి. హైబీపీ మందులైనా, డయాబెటిస్‌ మందులైనా సుదీర్ఘకాలం వాడాల్సిందే. అది బాధితుల బీపీ కొలతలను బట్టి ఉంటాయి తప్ప... బీపీ తగ్గినప్పటికీ వాటికే అలవాటు పడటం, మానకుండా ఉండలేకపోవడం వంటివి జరగవు. 

మందులు వాడుతున్నా... బీపీ నియంత్రణలో ఉండటం లేదు. బహుశా మందుల ప్రభావం తగ్గిపోయిందా? బహుశా బీపీ ఆ మందులకు రెసిస్టెన్స్‌ పెంచుకుని ఉండవచ్చా?
కొంతమంది బీపీ బయటపడ్డాక... మొదటిసారి మాత్రమే డాక్టర్‌ను కలుస్తారు. అప్పుడు డాక్టర్‌ రాసిన మందులనే అదేపనిగా ఏళ్ల తరబడి వాడుతుంటారు. కానీ వాటితో బీపీ నిజంగానే అదుపులోకి వచ్చిందా... లేక ఆ డోస్‌ సరిపోవడం లేదా... ఇలాంటి విషయాలేమీ పట్టించుకోరు. మరికొందరు తొలిసారి మందులు వాడకం మొదలుపెట్టాక... రెండో వారంలోనో లేదా పది రోజుల తర్వాతనో మరోసారి బీపీ చూసుకుని, అది తగ్గడం లేదంటూ ఫిర్యాదు చేస్తారు.

ఇవన్నీ సరికాదు. మందుల ప్రభావం తగ్గిపోయిందనే అపోహ కూడా వద్దు. ఒకసారి బీపీ మందులు మొదలుపెట్టాక అవి పనిచేయడం ప్రారంభించి, బీపీ అదుపులోకి రావడానికి కనీసం 3 – 4 వారాలు పట్టవచ్చు. ఇవేవీ చూడకుండానే కొందరు తాము అనుకున్నదే కరెక్ట్‌ అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది సరికాదు. అందుకే బీపీ మందులు వాడుతున్న వారు డాక్టర్‌ నిర్దేశించిన ప్రకారం... ఆయా సమయాలకు ఫాలో అప్‌కు వస్తుండాలి. 

ఉద్వేగ లక్షణాలు ఉంటే అది హై–బీపీ యేనా? 
కొంతమంది తాము నర్వస్‌గా ఉండటం, తలనొప్పి తరచూ వస్తుండటం, చెమటలు పడుతున్నట్లుగా, నిద్రపట్టకుండా, కోపంగా లేదా బాగా ఉద్వేగంగా/ఉద్రిక్తంగా ఉన్నప్పుడు  హైబీపీ ఉందనో లేదా ఆ టైమ్‌లో బీపీ పెరిగి ఉందనో చెబుతుంటారు. అంతేకాదు... కొంతమందికి హాస్పిటల్‌కు వెళ్లగానే, అక్కడి డాక్టర్లను చూడగానే బీపీ పెరుగుతుంది. అదే ఇంటిదగ్గర లేదా మరోచోట రీడింగ్‌ తీసినప్పుడు నార్మల్‌గా ఉంటుంది. ఇలా తెల్లకోట్లలో ఉండే డాక్టర్లను చూసినప్పుడు రక్తపోటు పెరగడాన్ని ‘వైట్‌ కోట్‌ సిండ్రోమ్‌’ అంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో లేదా పైన చెప్పిన లక్షణాలన్నీ లేదా వాటిలో కొన్ని ఉన్నప్పుడు హైబీపీ ఉన్నట్లేనా అని సందేహ పడుతుంటారు. పై లక్షణాలతోనూ, సహజ భావోద్వేగాలతోనూ రక్తపోటు కొంతమేరకు పెరగవచ్చు. కానీ వాళ్ల భావోద్వేగాలు తగ్గగానే నార్మల్‌ అవుతుంది. అలాంటి కండిషన్లలో పెరిగేదాన్ని హైబీపీగా పరిగణించరు. అయితే ఓ వ్యక్తిలో పలుమార్లు రీడింగ్‌ తీశాక కూడా... రక్తపోటు 140/90 అనే విలువకు మించి ఉంటే అప్పుడు మాత్రమే హైబీపీగా పరిగణిస్తారు. 

సాధారణంగా రక్తపోటుకు సంబంధించిన లక్షణాలేమీ లేకపోతే హైబీపీ లేనట్లేనా? 
చాలామందికి లక్షణాలేమీ కనిపించకుండానే హైబీపీ ఉండవచ్చు. వారికి హైబీపీ ఉన్నట్లే తెలియకుండానే అది ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. రక్తపోటు చాలాకాలంగా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మన దేహంలో ఎండ్‌ ఆర్గాన్స్‌గా పిలిచే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి.

అలా అవి పూర్తిగా పాడైపోయాక... అప్పుడుగానీ ఆయా అవయవాలు దెబ్బతిన్నందున కనిపించే లక్షణాలు బయటపడవు. హైబీపీ వల్ల దెబ్బతిని, బాధితులను ప్రాణాంతక పరిస్థితులకు నెడుతున్నందునే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’ అంటారు. అందువల్ల లక్షణాలు కనిపించనంత మాత్రాన బీపీ లేదని అనుకోవడం సరికాదు. ఒకసారి డాక్టర్‌ను కలిసి, చెకప్‌ చేయించుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. 

కొన్నిసార్లు లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ అవి తాత్కాలికం కావచ్చు. అలాంటిప్పుడు ఒకవేళ బాధితులకు హైబీపీ లేకపోయినా, అది ఉన్నట్టుగా డాక్టర్లు పొరబడే అవకాశాలు లేవా? 
హైబీపీ వల్ల కొందరిలో తలనొప్పి, తలతిరగడం వంటివి కనిపించవచ్చు. కానీ ప్రతి తలనొప్పీ అధిక రక్తపోటు వల్లనే కాకపోవచ్చు. బీపీ తాలూకు లక్షణాలు అని చెప్పుకునే కండిషన్లు కనిపించినప్పుడు అసలు బీపీని కొలవకుండానే కేవలం లక్షణాలతో ఆ సమస్య ఉందని అనుకోవడం సరికాదు. డాక్టర్లు అలా పొరబడే అవకాశం లేదు. ఎందుకంటే... రక్తపోటు పెరగడం వల్ల మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే కొందరిలో వారి  బాడీ పోష్చర్‌ అకస్మాత్తుగా మారడం వల్ల రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ‘ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌’ అంటారు.

అలాంటి సమయాల్లో కొందరికి ముందుకు తూలిపడిపోతామనే ఫీలింగ్‌ లేదా తలతిరగడం వంటివి కనిపించవచ్చు. బీపీ తగ్గిన ఇలాంటి సందర్భాల్లోనూ బీపీ పెరిగినప్పుడు కనిపించే గిడ్గీనెస్‌ వంటి లక్షణాలు æ కనిపిస్తాయి. అందువల్ల డాక్టర్లు కేవలం లక్షణాల ఆధారంగా కాకుండా... అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచిచూస్తారు. ఇలా పరీక్షించినప్పుడు అన్నిసార్లూ కొలత పెరిగి ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేస్తారు. 

హైబీపీ ఉందని నిర్ధారణ అయ్యింది. డాక్టర్లు మందులు మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత బీపీ అదుపులోకి వచ్చిందనుకోండి. అప్పుడు మందులు మానేయవచ్చా? 
ఒకసారి హైబీపీ నిర్ధారణ అయి... మందులు మొదలుపెట్టాక వాటి ప్రభావంతో బీపీ అదుపులోకి వస్తుంది. దాంతో బీపీ నియంత్రణలోనే ఉంది కదా అని చాలామంది మళ్లీ మందులు మానేస్తుంటారు. మళ్లీ బీపీ చెక్‌ చేయించుకోరు. దీని లక్షణాలు బయటకు కనిపించవు కాబట్టి అది పెరిగిన విషయం తెలియదు. అందుకే ఒకవేళ బీపీ నియంత్రణలోకి వచ్చిందని మందులు ఆపేసినా... మాటిమాటికీ బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి.

బీపీ ఏమాత్రం పెరిగినట్లు అనిపించినా వెంటనే డాక్టర్‌ సలహా తో తగిన మోతాదు నిర్ణయించుకుని, మందులు తిరిగి మొదలుపెట్టాలి. అంతేకాదు... మందులు వాడుతున్నప్పటికీ తరచూ బీపీ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మందులు వాడుతున్నప్పటికీ... ఆ మోతాదు సరిపోక బీపీ పెరిగితే... డాక్టర్లు మందులు మార్చడమో లేదా సరైన మోతాదు అందేలా మరో మాత్ర లేదా రెండు మాత్రలు పెంచడమో చేస్తారు. ఈ నేపథ్యంలో బీపీ మందులు వాడుతున్నప్పుడు వాటిని మానేయకపోవడం మంచిది. తరచూ బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండటం అవసరం. 

బార్డర్‌లైన్‌లో ఉన్నప్పుడు మందులు అవసరం లేదనీ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లతో బీపీని అదుపులో ఉంచుకోవాలంటూ డాక్టర్లు చెబుతారు కదా. మరి ఇప్పుడు కూడా మందులేవీ వాడకుండా మంచి జీవనశైలి అనుసరిస్తే సరిపోదా? 
ప్రతివారూ ఇలాగే అనుకుంటారు. కానీ జీవనశైలి నియమాలను కరెక్ట్‌గా పాటించరు. పాటించినా కొద్దికాలం మాత్రమే. లక్షణాలేవీ బయటకు కనిపించని హైబీపీ దీర్ఘకాలికంగా ఏవైనా కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపితే... అప్పుడు జరిగే నష్టం... అప్పుడు వైద్యపరీక్షలకూ, చికిత్సకూ పడే ఆర్థికభారం, ఏదైనా ఎండ్‌ ఆర్గాన్‌ శాశ్వతంగా దెబ్బతింటే కలిగే నష్టం లాంటివి చాలా జబ్బుభారాన్ని (డిసీజ్‌ బర్డెన్‌ను) పెంచుతాయి.

వాటికంటే అసలు మనకు భారమే తెలియని రీతిలో, చాలా చవకైన మందులను రోజూ ఒకపూట లేదా రెండు పూటలు తీసుకోవడం మేలు. దానివల్ల సుదీర్ఘకాలం, అన్ని అవయవాలనూ పదిలంగా ఉంచుతూ హాయిగా జీవించవచ్చు. గుండెపోటు, పక్షవాతం లాంటి మరెన్నో అనారోగ్యాలనూ, అనర్థాలను నివారించుకోవచ్చు. 

ఉప్పు పూర్తిగా మానేయాలా? 
హైబీపీ అనగానే ఉప్పు వల్ల రక్తపోటు పెరుగుతుందని సాధారణ ప్రజలకు కూడా ఇప్పుడు తెలిసిన విషయం. అయితే తమకు ఎలాంటి అనర్థాలూ జరగకూడదనే ఉద్దేశంతో చాలామంది ఉప్పును పూర్తిగా మానేస్తుంటారు. కానీ మన దేహంలోని చాలా కీలకమైన జీవక్రియలు (ఉదాహరణకు మెదడు నుంచి నాడుల ద్వారా కండరాలకు వచ్చే ఆదేశాలూ, వాటి అమలు వంటివి) ఉప్పు/ఇతర లవణాలలోని అయాన్ల ద్వారానే జరుగుతుంటాయి.

ఉప్పు పూర్తిగా మానేసిన కొందరిలో ‘హెపోనేట్రీమియా’ అనే కండిషన్‌ వచ్చి, ఒక్కోసారి ప్రాణాంతకంగానూ మారవచ్చు. అందుకే ఉప్పును పూర్తిగా మానేయడం కంటే... మునుపు వాడుతున్న దాంట్లో సగం లేదా సగం కంటే తక్కువ వాడటం మంచిది.
- డాక్టర్‌ హరిరామ్‌ వి, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement